సాక్షి, రాజమహేంద్రవరం: ప్రభుత్వ నిర్వాకంతో నాణ్యత లేని బ్యాగులు, చాలీచాలని బూట్లు, స్కూళ్లలో వసతులు లేక ఇప్పటికే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విద్యార్థి దశలో కీలకమైన ప్రాథమిక పాఠశాలల్లో మెజార్టీ శాతం ఒక్క ఉపాధ్యాయుడితోనే నడుపుతున్నారు. ఆ ఒక్కరే బోధనేతర పనులు కూడా చక్కబెట్టుకోవాల్సి రావడంతో బోధన ముందుకు సాగడం లేదు. ఏ కారణం చేతనైనా ఆ ఉపాధ్యాయుడు విధులకు రాకపోతే పాఠశాలకు ఆ రోజు సెలవే. జిల్లాలోని వందలాది పాఠశాలల్లో ఇదే దుస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలను గొప్పగా మార్చేశామని చెబుతున్న విద్యా శాఖ మంత్రి లోకేశ్ చెబుతూండగా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. గడచిన రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బోధనేతర విధులతోనే సరి
ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధనేతర విధులు మరింత ఇబ్బందికరంగా మారాయి. పాఠశాలకు వెళ్లగానే విద్యార్థులకు హాజరు వేయడం.. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం సమయంలో ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయడం.. కోడిగుడ్లు, చిక్కీలు, బియ్యం వస్తున్నాయో లేదో చూసుకోవడం వంటి పనుల్లో ఉపాధ్యాయుడు తలమునకలైనప్పుడు విద్యార్థులు ఖాళీగానే ఉండాల్సి వస్తోంది. కొన్నిచోట్ల రెండు, కొన్నిచోట్ల ఐదు తరగతుల్లో వివిధ సబ్జెక్టులను ఒక్కరే బోధించాల్సి వస్తోంది. దీంతో, బోధన సవ్యంగా సాగక, సిలబస్ సక్రమంగా పూర్తి కావడం లేదు. అలాగే, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ విద్యార్థులు 3, 6 తరగతుల్లోకి చేరినప్పుడు చదువులో వెనుకబడిపోతున్నారు.
40 శాతం పాఠశాలల్లో ఒక్కరే..
జిల్లాలో 843 ప్రాథమిక పాఠశాలలుండగా వీటిల్లో 329 చోట్ల ఏకోపాధ్యాయ బోధనే సాగుతోంది. అంటే జిల్లాలోని మొత్తం ప్రాథమిక పాఠశాలల్లో 40 శాతం వాటిలో ఒక్క ఉపాధ్యాయుడే బోధన సాగించాల్సి వస్తోంది. ఫలితంగా బోధన సరిగ్గా జరగక ఈ పాఠశాలల్లోని విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. ఈ విషయాన్ని విద్యా శాఖ అధికారుల వద్ద ప్రస్తావించగా ఒక్కరే ఉపాధ్యాయులున్న చోట వారు సెలవు తీసుకుంటే సీఆర్‌పీలను పంపిస్తున్నామని, పాఠశాల మూత పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.
జిల్లాలోని 329 పాఠశాలల్లో ఇదే దుస్థితి
ఇతర పనుల భారంతో
కుంటుపడుతున్న బోధన
వెనుకబడిన విద్యార్థులపై కొరవడిన శ్రద్ధ
ప్రాథమిక స్థాయిలో
తూతూమంత్రంగా విద్యాభ్యాసం


