● సాధిక్ ఖాన్ కేసులో ఎన్ని ట్విస్టులో
● ట్రాప్ నుంచి పరారీ వరకు
అంతా పకడ్బందీగా
● మరికొందరు మహిళలతోనూ
ఇదే తరహా ప్రవర్తన
కాకినాడ క్రైం: సౌజన్యను ట్రాప్ చేసి, ఓ క్రైం థ్రిల్లర్‌ని తలపించేలా సాధిక్ ఖాన్ తన కుట్రల్ని గుట్టు చప్పుడు కాకుండా కొనసాగించాడు. తన దారిలోకి తెచ్చుకోవడం, ఆమైపె ఇష్టాన్ని వ్యక్తం చేయడం, అక్రమ బంధాన్ని కొనసాగించడం, ఆమె భర్తను అడ్డు తొలగించుకునేందుకు కుయుక్తులు పన్నడం, ఆస్తి కాజేసేందుకు చేసిన కుట్ర, అంతకుముందు ఆమెను కొట్టడం, భర్తపై దాడి, బాధితురాలి కుటుంబ సభ్యుల పైనా విరుచుకుపడడం, వారిని బ్లాక్‌మెయిల్ చేయడం ఇవేవీ థ్రిల్లర్‌కు తీసిపోని రీతిలో ఉన్నాయి. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన తర్వాత తప్పించుకోవడానికి చేసిన విఫలయత్నాలు పోలీసులకే మతి పోగొట్టాయి. సౌజన్య లాంటి మరికొందరు సాధిక్ వలలో చిక్కి ఉండవచ్చనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పిల్లల్ని అడ్డుపెట్టుకొని తల్లులకు వల వేసేవాడని వారి ప్రాఽథమిక విచారణలో తేలింది.
ఆ ఒక్క క్లూతోనే..
కేవలం ఒక్క క్లూతోనే సాధిక్ జాడ బట్టబయలైందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యలు జరగడం, వాటికి తానే కారణం కావడంతో ఎవరూ అతడిపై ఆరోపణలు చేయకుండానే జాగ్రత్త పడి పరారయ్యాడు. అప్పటికి లేఖ దొరకలేదు, సాధిక్ ఖాన్ పేరు కూడా ఎవరికీ తెలియదు. ఆ సమయంలో తాను వినియోగిస్తున్న ఒక్కొక్కటి రూ.1.5 లక్షలు విలువ చేసే రెండు ఫోన్లను వదిలేసి పరారయ్యాడు. వెళ్తూవెళ్తూ రైఫిల్ అసోసియేషన్‌లోని ఓ ఆప్తమిత్రుడికి ఫోన్ చేసి, ఆ నంబర్ డిలీట్ చేసేశాడు. కొందరి ఫోన్ నంబర్లు పాకెట్ బుక్‌లో రాసుకొని బయల్దేరాడు. కాల్ డేటాలో ఆ వివరాలు లభ్యమయ్యాయి. ఇంటి నుంచి నేరుగా ద్విచక్రవాహనంపై సామర్లకోటకు వెళ్లిన సాధిక్ తన బైక్‌ను పార్కింగ్‌లో ఉంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. పలువురు ప్రయాణికుల ఫోన్లతో తనకు కావలసిన వారికి ఫోన్లు చేశాడు. చివరకు మహారాష్ట్ర వెళ్లి, తన స్నేహితుడిని కలిశాడు. అక్కడ ఒక రోజు ఉన్నాడు. తర్వాత రోజు మీరట్‌కి బయల్దేరాడు. సరిగ్గా ఆ సమయానికి కాకినాడ పోలీసులు ఆ మిత్రుడి వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపటి ముందు అబ్బాస్ అనే మరో రైఫిల్ ట్రైనర్‌ను కలిసేందుకు సాధిక్ మీరట్ వెళ్లాడనే సమాచారాన్ని అతడు ఇచ్చాడు. సాధిక్ కంటే ముందే అబ్బాస్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఆ ఇంటిని సమీపిస్తుండగా సాధిక్‌ను పట్టుకున్నారు. అక్కడి నుంచి కేరళ వెళ్లాలనుకున్నాడని పోలీసులు తెలిపారు.
కోడలిపై అనుమానం..
ఇదిలా ఉండగా నూకరాజు కుమార్తె సౌజన్య భర్త జగదీశ్వర్‌రెడ్డిని సాధిక్ ఖాన్ హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఏ కారణం లేకుండానే జగదీష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని వారు వాపోయారు. ఏడాది పాటు వాంతులయ్యాయని, కారణం తెలిసేది కాదని చెప్పారు. మాట నెమ్మదించి, కాలు కూడా చచ్చుబడిందని అన్నారు. జీర్ణకోశ సమస్యతో బాధపడుతూ కాకినాడ సర్పవరంలోని ఓ ఆసుపత్రిలో ఐదు రోజులు చికిత్స అనంతరం జగదీష్ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి వెళ్లి చికిత్స పొందినట్టు చెప్పారు. అక్కడ కాస్త కోలుకోగా, హైటెక్ సిటీలోని ఓ ఫిజియోథెరపీ సెంటర్‌కు సౌజన్యతో పాటు ఆమె తల్లిదండ్రులు, అత్తమామలు తీసుకువెళ్లారు. కేవలం ఫిజియోథెరపీ చేస్తే కోలుకోవలసిన దశలో జగదీశ్వర్‌రెడ్డి హఠాత్తుగా మరణించాడు. ఆసుపత్రిలో తాము లేని సమయంలో సాధిక్ ఖాన్ వచ్చి సౌజన్యతో కలసి జగదీష్ తాగే ప్రొటీన్ షేక్‌లో అంతకు ముందు పట్టించిన స్లో పాయిజన్ గుణాలున్న రసాయనాన్ని మరోమారు కలిపి ఉంటాడని అతడి కుటుంబీకులు చెప్పారు.
పిల్లలు ఎర.. తల్లులు సొర
ఖతర్నాక్ ఖాన్ వ్యవహార శైలిని తమ పిల్లల్ని రైఫిల్ షూటింగ్ శిక్షణలో చేర్చిన పలువురు తల్లులు పూసగుచ్చినట్టు తమను సంప్రదించిన మీడియాకు తెలిపారు. పిల్లల్ని అడ్డు పెట్టుకొని తమతో మాట కలిపేందుకు, తమ స్టేటస్‌లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం పేజీలు ఫాలో అవుతూ లైక్స్ కొడుతూ ముగ్గులోకి దించేందుకు ప్రయత్నించేవాడని వివరించారు. ఈ కారణంతోనే తమ పిల్లల్ని అతడి అకాడమీలో మానిపించేశామని కొందరు చెప్పారు. క్లాస్ ఇన్‌ఫర్మేషన్ కోసం అంటూ కాల్స్ చేసి అక్కర్లేని విషయాలతో మాటలు మాట్లాడేవాడని తెలిపారు.


