సమగ్ర ప్రణాళికతో పుష్కర ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సమగ్ర ప్రణాళికతో పుష్కర ఏర్పాట్లు

Aug 26 2026 12:12 AM | Updated on Aug 26 2026 12:12 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జూలై 7వ తేదీ వరకూ జరిగే గోదావరి పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి మంగళవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో తన క్యాంపు కార్యాలయం నుంచి ఆమె, ఎస్పీ డి.నరసింహ కిశోర్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, భక్తులకు రవాణా, వసతి, పారిశుద్ధ్యం, భద్రత, ఘాట్ల అభివృద్ధి తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు, స్థానిక మాహత్మ్యాలను సమగ్రంగా నమోదు చేయాలని దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు పుష్కరాలకు వచ్చే అవకాశమున్నందున అఖండ గోదావరి బ్రాండింగ్‌తో ప్రత్యేక వీఐపీ ఘాట్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. జిల్లాలో 1,869, కోనసీమలో 1,501, కాకినాడ జిల్లాలో 321, పోలవరం జిల్లాలో 190 చొప్పున పనులను రూ.4,026 కోట్లతో చేపడుతున్నామని ముఖ్యమంత్రి సమీక్షలో అధికారులు వివరించారు.

పొగాకు పంట

నియంత్రణ పాటించాలి

దేవరపల్లి: అధిక ఉత్పత్తి కారణంగా పండించిన పొగాకును మంచి ధరకు అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారని టొబాకో బోర్డు దేవరపల్లి వేలం కేంద్రం నిర్వహణాధికారి పి.హేమస్మిత అన్నారు. పొగాకు నారుమడి పెంపకం, తెగుళ్లు, పురుగు మందుల వాడకం, నారుమడి నియంత్రణ, యాజమాన్య పద్ధతులపై కృష్ణంపాలెంలో మంగళవారం ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది రైతులు విధిగా పంట నియంత్రణ పాటించి, నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. తమకు కేటాయించిన పరిమాణానికి లోబడి మాత్రమే సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. నారు అమ్మే నిబంధనల గురించి వివరించారు. రిజిస్ట్రేషన్‌ పొందిన రైతులకు మాత్రమే నారు విక్రయించాలని స్పష్టం చేశారు. నారుమడి వేసిన రైతులు తప్పనిసరిగా బోర్డు అధికారులకు తెలియజేయాలని హేమస్మిత అన్నారు.

రేపు నిధి ఆప్‌ కే నికత్‌

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలో గురువారం ఉదయం 9 గంటలకు నిధి ఆప్‌ కే నికత్‌ డిస్ట్రిక్ట్‌ ఔట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్‌ పీఎఫ్‌ కమిషనర్‌ ఎంకే వెంకటరావు మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పరిధికి సంబంధించి పెద్దాపురం ఏడీబీ రోడ్డులోని పతంజలి ఫుడ్స్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు సంబంధించి యానాంలోని నల్లం ఎడ్యుకేషనల్‌ సొసైటీలోను, కాకినాడ జిల్లాకు తుని మార్కండ్రాజుపేట అర్కా ఎడ్యుకేషనల్‌ సొసైటీలోను, పశ్చిమ గోదావరి జిల్లాకు కాళ్ల మండలం సీసలి జయలక్ష్మి సీఫుడ్స్‌లోను, ఏలూరు జిల్లాకు వట్లూరులోని రామచంద్ర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లోను ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. కొత్త ఈపీఎస్‌, ఈడీఎల్‌ఐ, ఆమ్నెస్టీ, ఈఈసీ, కొత్త సీఐటీఈఎస్‌ పథకాల అమలు నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పీఎఫ్‌ సభ్యులు, పింఛనుదారులు, ఆయా సంస్థలు దీనిని ఉపయోగించుకోవాలన్నారు. నిధి ఆప్‌ కే నికత్‌ అని పేర్కొంటూ ఫిర్యాదులు సమర్పించవచ్చన్నారు. ఈ సందర్భంగా డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్లు కూడా ఇవ్వవచ్చని వెంకటరావు తెలిపారు.

ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌కు

నిడదవోలులో హాల్ట్‌

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల డిమాండ్‌ మేరకు విశాఖపట్నం – లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిడదవోలు స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా ఒక నిమిషం హాల్ట్‌ ఇవ్వాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. సెప్టెంబర్‌ 5వ నుంచి విశాఖప్నటం–ఎల్‌టీటీ (18519) రైలు ప్రతి రోజూ తెల్లవారుజామున 2.54 గంటలకు నిడదవోలు చేరుకుని 2.55కు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (18520) ఉదయం 6.09 గంటలకు నిడదవోలు చేరుకుని, 6.10కి బయలుదేరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement