నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌

Jul 20 2026 12:20 AM | Updated on Jul 20 2026 12:20 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లను సోమవారం యథావిధిగా నిర్వహించి అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్‌ కీర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఆయా కేంద్రాల్లో ప్రజా స్పందన ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు ‘సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేస్తున్నామని, సేవలు పొందిన అనంతరం క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి తమ అభిప్రాయాన్ని నమోదు చేయాలని కలెక్టర్‌ కోరారు. కలెక్టరేట్‌తో పాటు రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాలు, మండల తహసీల్దార్‌ కార్యాలయాలు, రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌, అన్ని మున్సిపల్‌ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని వెల్లడించారు. అలాగే ప్రజలు 1100 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. వాట్సప్‌ గవర్నెన్స్‌ 9552300009 ద్వారా 300 పైగా పౌర సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు.

షైనింగ్‌ స్టార్స్‌కు

నేడు సత్కారం

అమలాపురం టౌన్‌: గత విద్యా సంవత్సరం జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 136 మంది విద్యార్థులను షైనింగ్‌ స్టార్స్‌ పేరుతో విద్యా శాఖ సత్కరించనుంది. కలెక్టరేట్‌ సమీపంలోని సత్యనారాయణ గార్డెన్స్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ ఒక్కో విద్యార్థికి పతకం, ప్రశంసా పత్రంతో పాటు రూ.20 వేల నగదు బహుమతి అందించనున్నారు. డీఈఓ పి.నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. గత విద్యా సంవత్సరం వరకూ కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే ఈ పురస్కారాలు అందించేవారు. ఈ ఏడాది నుంచి తొలిసారిగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కూడా వీటిని అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 64, ప్రైవేటు పాఠశాలల నుంచి 72 మంది చొప్పున విద్యార్థులకు ఈ పురస్కారాలు అందించనున్నారు. మొత్తం 47 మంది ఓసీ, 47 మంది బీసీ, 21 మంది ఎస్సీ, 18 మంది ఎస్టీ, ముగ్గురు సీడబ్ల్యూఎస్‌ఎన్‌ విభాగాల్లో ఈ విద్యార్థులను ఎంపిక చేశారు. వీరితో పాటు ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన 30 మంది విద్యార్థులకు కూడా షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులు అందించనున్నారు.

నేటి నుంచి దస్తావేజు లేఖర్ల పెన్‌డౌన్‌

అమలాపురం టౌన్‌: రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్‌–396ని రద్దు చేయాలనే డిమాండుతో దస్తావేజు లేఖర్లు సోమవారం నుంచి పెన్‌డౌన్‌ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న దశల వారీ ఆందోళనల్లో భాగంగా ఈ నిరసన చేపడుతున్నారు. జిల్లాలోని 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు చెందిన దాదాపు 2 వేల మంది దస్తావేజు లేఖర్లు, సహాయకులు, టైపిస్టులు ఈ నిరసన చేపట్టనున్నారు. ఈ మేరకు అమలాపురం దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు జిన్నూరి సురేష్‌, కన్వీనర్‌ మట్టపర్తి రాము, కార్యదర్శి వెలుతురుపల్లి సుబ్బు తదితరులు పట్టణ సీఐ పి.వీరబాబుకు, 1, 2 సబ్‌ రిజిస్ట్రార్లు ఆర్‌.శ్రీలక్ష్మి, పి.లక్ష్మణరాజులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ డిమాండుతో ఇప్పటికే దస్తావేజు లేఖర్లు జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద రెండు పర్యాయాలు ధర్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పెన్‌డౌన్‌ పిలుపు నేపథ్యంలో వారు సోమవారం నుంచి కక్షిదారులకు డాక్యుమెంటేషన్‌ చేయరు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఎప్పటిలాగే జరుగుతుంది. అయితే, దస్తావేజు లేఖర్లు మాత్రం తమ విధులకు దూరంగా ఉంటారు.

ట్రీక్కుల మారి..

ఆత్రేయపురం: అధికారం తమదే అని అధికార పార్టీకి చెందిన నేత మండలంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. అతను ఏం అధికారులు చూసిచూడనట్లుగా అసలు పట్టించుకోవట్లేదు. బొబ్బర్లంక రాష్ట్రీయ రహదారిపై గతంలో ప్రభుత్వం సోషల్‌ ఫారెస్ట్రీ ద్వారా పెంచిన చెట్లను అధికార పార్టీ నేత ఆదివారం భారీ యంత్రాల సాయంతో పట్టపగలు నరికివేస్తున్నప్పటికీ అధికారులు ఏమి పట్టించుకోలేదు. గతంలో కూడా అతడు తన వ్యాపారానికి అడ్డొస్తుందనే నెపంతో కొన్ని భారీ చెట్లను తొలగించారని స్థానికులు అంటున్నారు. ఇంత చేస్తున్నా అతనిపై ఎందుకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement