రాజానగరం: వారందరూ రాజమహేంద్రవరం నగరంలో మొబైల్ షాపులు, రకరకాల వ్యాపారాలు చేస్తున్నవారు.. వాటిల్లో పని చేస్తున్న వర్కర్లు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశ (ఈజీ మనీ), చెడు స్నేహాలు వారిని దారిదోపిడీ బాట పట్టించాయి. చివరకు కటకటాలపాలు చేశాయి. రాజానగరం ఎస్సై జీవీవీ సత్యనారాయణతో కలసి సీఐ వీరయ్య గౌడ్ మంగళవారం మీడియాకు ఈ వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి పాతపట్నంలో ఆరు ఎద్దులు కొనుగోలు చేసి, రెండు వ్యాన్లలో అమరావతి సమీపంలోని కోసూరు సంతలో వెంకటేష్ అనే రైతుకు అప్పగించేందుకు ఈ నెల 9న తరలిస్తున్నాడు. ఆ వ్యాన్లకు డ్రైవర్లుగా, సహాయకునిగా కొండపల్లి రవి, తాడేల నవీన్, ఆలాపన దాలిరాజు ఉన్నారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ పదో తేదీ వేకువజామున రాజానగరంలోని ఓ హోటల్ సమీపాన కాలకృత్యాలు తీర్చుకునేందుకు వారు ఆగారు. అదే సమయంలో రెండు కార్లలో వచ్చిన ఆగంతకులు వారిని కత్తులతో బెదిరించి, తమ కార్లలో ఎక్కించుకున్నారు. ఇద్దరు వ్యక్తులు ఎద్దులతో ఉన్న రెండు వ్యాన్లను తీసుకుని పల్లకడియం వైపు వెళ్లారు. నిర్మానుష్య ప్రదేశంలో ఎద్దులను, వ్యాన్లను వదిలేసి, వారి వద్ద ఉన్న సొమ్ము అపహరించుకుని పోయారు. దీనిపై బాధితుల్లో ఒకరైన కొండపల్లి రవి రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు దారి దోపిడీకి పాల్పడిన కై లాస్ దివాస్ (సిల్వర్ షాప్), వైష్ణవ అభిషేక్, జితేంద్ర పురోహిత్ (మొబైల్ షాపులో వర్కర్లు), మూలి కై లాష్ కుమార్ (జెండాపంజా రోడ్డులో మొబైల్ షాప్), రమేష్ మాలి (మొబైల్ షాప్), రమేష్ దేవాషి, దివాస్ రాకేష్ (సోమాలమ్మ గుడి వీధిలో మొబైల్ షాపులు), పూరస్ కుమార్ (మొబైల్ షాపులో వర్కర్), భావేష్(కేవీఆర్ రోడ్డులో గిఫ్ట్ షాపు)లను అరెస్టు చేశారు. వీరందరూ రాజమహేంద్రవరానికి చెందిన వారే. అందరూ 19 నుంచి 35 సంవత్సరాల వయస్కులు. నిందితులను బుధవారం కోర్టులో హాజరు పరుస్తామని సీఐ తెలిపారు.
ఫ దారి దోపిడీకి పాల్పడిన 9 మంది
ఫ అరెస్టు చేసిన రాజానగరం పోలీసులు
ఫ అందరూ రాజమహేంద్రవరంలో వ్యాపారులు, వర్కర్లే


