సంక్షేమ పథకాల అమలులో కనీస చిత్తశుద్ధి లేని చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం అర్హుల ఎంపికలో సచివాలయాల స్థాయి నుంచే కోతలు విధించింది. ముఖ్యంగా మ్యాపింగ్ సమయంలో జరిగిన తప్పిదాలు లబ్ధిదారులకు పెనుశాపంగా మారాయి. అద్దె ఇళ్లలో ఉన్న వారి ఆధార్ కార్డులను కూడా ఆ ఇంటి ఆస్తి పన్ను, విద్యుత్ మీటర్‌తో లింక్ చేయడంతో ఆస్తి లేకున్నా ఉన్నట్లు చూపిస్తోంది. ఫలితంగా వేలాది మంది అర్హులు.. అనర్హుల జాబితాలోకి వెళ్లిపోయారు. లబ్ధిదారుల ఆధార్ నంబర్‌తో పరిశీలిస్తే ఆస్తి ఉన్నట్లు చూపిస్తోంది. ఆ లింక్ తొలగించడానికి సచివాలయ సిబ్బంది నిరాకరిస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం ఈ విషయంపై దృష్టి సారించడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా నెలకు 300 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే పథకానికి అనర్హుడిని చేసేశారు. చాలా మంది అంతకంటే తక్కువ విద్యుత్ వినియోగించినా సరే అర్హుల జాబితాలో పేరు లేకుండాపోయింది. మరో వైపు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను సైతం అనర్హుల జాబితాలో చేర్చారు.
సాక్షి, రాజమహేంద్రవరం: బూటకపు హామీలతో అధికారం చేపట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో సామాన్యులకు తీరని అన్యాయం చేస్తోంది. మేనిఫెస్టోలో అర్హులందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పినా అమలులో మాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 3,28,148 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారందరికీ ఒక్కొక్కరికి రూ.13 వేలు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో రూ.426,59,24,000 జమ చేయాలి. అయితే జిల్లాకు రూ.340,88,34,000 మాత్రమే కేటాయించారు. ఫలితంగా 2,62,218 మంది విద్యార్థులు మాత్రమే పథకానికి అర్హత సాధించారు. 1,89,094 మంది తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. నిబంధనల కొర్రీల వల్ల 65,930 మంది విద్యార్థులు తల్లికి వందనం పథకానికి దూరమైపోయారు. వారి తల్లులు రూ.85,70,90,000 కోల్పోయారు.
దరఖాస్తులు స్వీకరించకుండానే జాబితాలు
ప్రభుత్వాలు అమలు చేసే ఏ పథకాలకై నా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హుల జాబితా సిద్ధం చేయాలి. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదువుతున్న విద్యార్థుల తల్లులకు పథకం వర్తిస్తుంది. ఇందుకోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత జాబితా సిద్ధం చేయాలి. అందుకు భిన్నంగా ప్రభుత్వమే అర్హులు, అనర్హులంటూ జాబితాలు సిద్ధం చేసేసి సచివాలయాల వద్ద పెట్టేస్తోంది. ఫలితంగా వేలాది మంది అర్హులకు అన్యాయం జరుగుతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం పొందిన వారిని కూడా ప్రస్తుతం అనర్హుల జాబితాలో చేర్చడం గమనార్హం.
రూ.2 వేల చొప్పున మినహాయించి..
ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసమని అమ్మఒడి పథకం పొందిన ఒక్కో విద్యార్థి నుంచి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వెయ్యేసి రూపాయల చొప్పున కేటాయించింది. ఆ విషయాన్ని చంద్రబాబు అండ్ కో నానా యాగీ చేశారు. ఊరూ వాడా రచ్చచేసి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్ర దుష్ప్రచారం చేశారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఒక్కో విద్యార్థి నుంచి రూ.2 వేల చొప్పున తీసుకుంటున్నారు. పథకంలో నగదు మొత్తాన్ని పెంచకపోగా కోత మాత్రం పెంచేశారు. నాడు మేధావుల ముసుగులో రచ్చ చేసిన వారంతా నేడు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఎక్కడ దాక్కున్నారని ప్రజలు నిలదీస్తున్నారు. ఈ ఏడాది 2,62,218 మంది విద్యార్థుల నుంచి రూ.2 వేల చొప్పున రూ.52,44,36,000ను పాఠశాలల నిర్వహణ కోసమని మినహాయించేశారు.
ఫ చంద్రబాబు ప్రభుత్వంలో
దగాపడ్డ తల్లులు, విద్యార్థులు
ఫ నిబంధనల చట్రంలో
నలిగిపోయిన తల్లికి వందనం
ఫ 65,930 మంది
విద్యార్థులకు అన్యాయం
ఫ రూ.85.7 కోట్లు
కోల్పోయిన పేద తల్లులు
జిల్లాలో ‘తల్లికి వందనం’ తీరిదీ
1,126 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు : 93,849
687 ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు : 1,85,649
168 ఇంటర్ కళాశాలల్లో విద్యార్థులు : 48,650
జిల్లాలో ఒకటి నుంచి ఇంటర్ వరకూ విద్యార్థులు : 3,28,148
రూ.13 వేల చొప్పున ప్రభుత్వం కేటాయించాల్సింది : రూ.426,59,24,000
ప్రభుత్వ జాబితా ప్రకారం అర్హులు : 2,62,218
తల్లికి వందనం పొందిన తల్లులు : 1,89,094
పథకానికి ప్రభుత్వం కేటాయించింది : రూ.340,88,34,000
నిబంధల కొర్రీలతో అర్హత కోల్పోయిన విద్యార్థులు : 65,930
ప్రభుత్వ నిర్వాకంతో పేద తల్లులు కోల్పోయింది : రూ.85,70,90,000
‘నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, ఇంటిలో ఎందరు పిల్లలు చదివితే అందరికీ తల్లికి వందనం వర్తింపజేస్తామంటూ అధికారమే లక్ష్యంగా చంద్రబాబు అండ్ కో ఎన్నికల సమయంలో ఊరూరా ప్రచారం సాగించింది. అధికారం చేపట్టిన మొదటి ఏడాది పథకం అమలును పూర్తిగా అటకెక్కించేసింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రెండో ఏడాది తూతూమంత్రంగా అమలు చేసింది. అదే పంథాను కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా వేల మంది తల్లులు, పిల్లలకు తమదైన స్టైల్‌లో వెన్నుపోటు పొడిచింది.


