వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం తాడేపల్లిలో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు.
– రాజమహేంద్రవరం సిటీ
25న మెగా జాబ్ మేళా
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): స్థానిక ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వికాస సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 25న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ బీవీ తిరుపాణ్యం తెలిపారు. ఈ మేరకు బుధవారం కళాశాల ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. ఆ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే జాబ్ మేళాలో దాదాపు 15 ప్రముఖ కంపెనీలు పాల్గొని 600 ఉద్యోగాలను భర్తీ చేస్తాయన్నారు. ఉద్యోగ స్వభావాన్ని బట్టి నెలకు రూ.16 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం లభిందన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులన్నారు.
ఏసీసీఏతో ఒప్పందం
దిశగా అడుగులు
రాజానగరం: ప్రొఫెషనల్ అకౌంటెన్సీ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెట్స్ (ఏసీసీఏ)తో ఆదికవి నన్నయ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా బుధవారం ఆ సంస్థ ప్రతినిధులతో యూనివర్సిటీ అధికారులు సమావేశమయ్యా రు. ఈ ఒప్పందం కుదిరితే ప్రొఫెషనల్ విద్య, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి, విద్యార్థుల ఉపాధి అవకాశాలు, పరిశ్రమ –విద్యా సంస్థల మధ్య సహకారం వంటి రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. సమావేశంలో యూనివర్సిటీ అధికారులు ఎన్.ఉదయ్‌భాస్కర్, ఉమామహేశ్వరిదేవి, సంస్థ ప్రతినిధులు కె.రోయిస్టన్ పాల్గొన్నారు.
కొనసాగుతున్న నిరసన
రాజమహేంద్రవరం రూరల్: చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 396కు వ్యతిరేకంగా దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్‌డౌన్‌తో జిల్లా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. నిరసనలో భాగంగా జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజు లేఖర్లు విధులను బహిష్కరించారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలపై ప్రభావం పడింది. సాధారణంగా ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజుకు సుమారు 300 డాక్యుమెంట్లు నమోదు అవుతుంటాయి. వీటి ద్వారా రోజుకు రూ.1.50 కోట్ల ఆదాయం వచ్చేంది. లేఖర్ల నిరసన కారణంగా 20, 21 తేదీల్లో 30 డాక్యుమెంట్లు మాత్రమే నమోదై, కేవలం రూ.50 వేలు మాత్రమే వచ్చింది. దస్తావేజు లేఖర్లు పెన్‌డౌన్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ కె.జగన్మోహనరావు తెలిపారు.
మూడో రోజుకు నిరసన
రాజమహేంద్రవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జిల్లా, రాజమండ్రి దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పెన్‌డౌన్ బుధవారం మూడో రోజుకు చేరింది. సంఘ వ్యవస్థాపకుడు ఫణికుమార్, జిల్లా అధ్యక్షుడు నల్లమిల్లి వీర్రెడ్డి, రాజమండ్రి సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కోలా రామచంద్రరావు, బేరి సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా జగన్నాథ రథయాత్ర
దేవరపల్లి: గోపాలపురం మండలం వాదాలకుంటలో బుధవారం జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఇస్కాన్ వారి భగవద్గీత పాఠశాలకు చెందిన లెర్న్‌లీవ్ గీత టీం కో ఆర్డినేటర్ కృష్ణప్రియ దేవిదాస్ (కళ్యాణ్ ప్రసాద్ వెలగా) ఆధ్వర్యంలో ఈ రథయాత్ర చేపట్టారు. జగన్నాథ్, బలదేవ్, సుభద్రదేవి ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి గ్రామంలో యాత్ర నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని రథాన్ని లాగారు.


