వైరస్‌ వేళ.. నిర్లక్ష్యమేల! | - | Sakshi
Sakshi News home page

వైరస్‌ వేళ.. నిర్లక్ష్యమేల!

Jul 23 2026 12:24 AM | Updated on Jul 23 2026 12:24 AM

చర్యలు తీసుకుంటున్నాం

కరోనా అనుమానిత లక్షణాలపై అవగాహన కల్పిస్తున్నాం. పీహెచ్‌సీలలో ఐదు బెడ్లు, సీహెచ్‌సీలలో పదేసి బెడ్లతో వార్డులు సిద్ధం చేస్తున్నాం. పరీక్షల కిట్లు, మందులు అందుబాటులో ఉంచుతున్నాం.

– కోమల, డీఎంహెచ్‌వో, తూర్పుగోదావరి

సాక్షి, రాజమహేంద్రవరం: ఊరందరిదీ ఒక దారైతే... వైద్య ఆరోగ్య శాఖ, రాజమహేంద్రవరం గవర్నమెంట్‌ జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌) పెద్దలది మరో దారి అన్న చందాన వ్యవహారం తయారైంది. సమాజాన్ని అతలాకుతలం చేసి లక్షలాది కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో అన్ని చోట్లా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో కేసులు నమోదవుతున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జీజీహెచ్‌ వైద్యులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కరోనా అనుమానిత లక్షణాలతో వస్తున్న వారికి పరీక్షలు చేసి పాజిటివ్‌ వస్తే ఐసోలేషన్‌ వార్డుకు తరలించేసి చికిత్స అందిస్తున్నారు. అక్కడితో తమ పని అయిపోయిందన్నట్లు చేతులు దులిపేసుకుంటున్నారు. మహమ్మారి వైరస్‌ నియంత్రణకు ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు.

ఎందుకు ఇలా..

జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్న విషయాలను, వైరస్‌ సోకడానికి ముందు సంబంధిత వ్యక్తులు ఎక్కడెక్కడ తిరిగారో అన్న విషయాలు అటు జనానికి, ఇటు మీడియాకు జీజీహెచ్‌ పెద్దలు తెలియజేయడం లేదు. వైరస్‌ సోకిన వారు ముందుగా ఎక్కడికి వెళ్లారో తెలిస్తే, ఆ ప్రాంతంలో ఎవరైనా అనుమానిత లక్షణాలతో బాధపడితే తక్షణమే అప్రమత్తమై పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా ఏమీ చెప్పకపోవడంతో చాలా మంది సాధారణ జ్వరం, జలుబు, దగ్గు అని భావిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అటువంటి వారు తీవ్రతను అంచనా వేయకపోతే పరిస్థితి ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదముంది. మరోవైపు ప్రభుత్వ అనుకూల మీడియాకు జీజీహెచ్‌ పెద్దలు లీకులిచ్చి మమ అనిపించేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జీజీహెచ్‌ వైద్యులు కరోనా తీవ్రతను తగ్గించి చూపుతున్నారని, కేసుల వివరాలు బహిరంగంగా వెల్లడించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆరుకు చేరిన పాజిటివ్‌ కేసులు

జిల్లాలో ఐదో వేవ్‌లో తొలిసారిగా ఈ నెల 19న రాజమహేంద్రవరం నగరంలోని ఓ యువకుడికి కరోనా సోకింది. 21న నిర్వహించిన పరీక్షల్లో మరో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వారిలో గోపాలపురానికి చెందిన 25 ఏళ్ల మహిళ కొద్ది రోజుల కిందట జీజీహెచ్‌లో ప్రసవించారు. ఆమెకు జ్వరం, జలుబు తగ్గకపోవడంతో కోవిడ్‌ పరీక్ష చేయగా పాజిటివ్‌ రావడంతో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ పరిధిలోని కొంతమూరుకు చెందిన 54 ఏళ్ల మహిళ కరోనా అనుమానిత లక్షణాలతో రావడంతో పరీక్షించగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. బుధవారం 8 మందిని పరీక్షించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిందని, వారంతా బొమ్మూరు, దేవీచౌక్‌, కంబాలచెరువు ప్రాంతాలకు చెందిన వారని జీజీహెచ్‌ అధికారులు తెలిపారు. అనుమానిత లక్షణాలతో ఓపీకి వచ్చిన వారిని పరీక్షించగా కరోనా నిర్ధారణ అయ్యిందన్నారు.

ఫ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

ఫ క్రమంగా పెరుగుతున్న కేసులు

ఫ ప్రజలను అప్రమత్తం

చేయని వైద్య, ఆరోగ్యశాఖ

ఫ రోగులకు చికిత్సతో సరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement