నేను చనిపోతే అమ్మకు దిక్కెవరు! | - | Sakshi
Sakshi News home page

నేను చనిపోతే అమ్మకు దిక్కెవరు!

Jul 20 2026 12:20 AM | Updated on Jul 20 2026 12:20 AM

రావులపాలెం/ఆలమూరు: వృద్ధురాలైన ఆ తల్లిది ఓ విషాద గాథ. ముగ్గుబుట్ట వంటి తల.. ముడుతలు పడిన దేహం.. మూగతనం.. ముదిమి మీద పడిన వేళ ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు ఆయువు.. ఆమె కళ్ల ముందే అర్ధాంతరంగా తీరిపోయింది. చూసే దిక్కు లేక.. కుమార్తె పంచనచేరింది.

ఆ కుమార్తెకూ వయస్సు మీద పడుతోంది.. అనారోగ్యం వేధిస్తోంది.. తన పనులే తాను చేసుకోలేని దుస్థితి వస్తోంది.. మరోవైపు తల్లి భారం తన పైనే పడింది.. తనకేమైనా జరిగితే అమ్మను ఎవరూ చూడరేమోనని మానసికంగా వేదన చెందింది. చనిపోతానని అంటూ ఉండేది.

చివరకు అన్నంత పనీ చేసింది. తల్లిని తీసుకుని కాలువలో దూకి తనువు చాలించాలని నిర్ణయించుకుంది. ఈ సంఘటనలో కుమార్తె మృతి చెందగా.. వృద్ధురాలైన తల్లి ఆచూకీ గల్లంతైంది. రావులపాలెం మండలం ఊబలంకలో ఆదివారం జరిగిన ఈ సంఘటన వారి స్వగ్రామమైన ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

ఇద్దరిదీ విషాద గాథే

చొప్పెల్ల గ్రామానికి చెందిన వాడపల్లి బూరమ్మ (80) మూగ. మాటలు రావు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె. కుమారుడు గతంలో చనిపోయాడు. దీంతో, బూరమ్మ మానసికంగా కృంగిపోయింది. బెంగ పెట్టుకుంది. చూసే దిక్కు లేకపోవడంతో గ్రామంలోని తన కుమార్తె మీసాల సూర్యవతి (60), అల్లుడు సూర్యనారాయణ ఇంటికి చేరింది. సూర్యవతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమార్తె. పదేళ్ల కిందట రాజానగరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద కుమారుడు మృతి చెందాడు. అప్పటి నుంచీ ఆమె కూడా బెంగ పెట్టుకుని, తన ఆరోగ్యం గురించి పట్టించుకునేది కాదు. పైగా ఆమె నడుము, కాళ్ల నొప్పులతో బాధ పడుతోంది. కొద్ది రోజుల కిందట శస్త్రచికిత్స జరిగింది. అయినా ఆమెకు స్వస్థత చేకూరలేదు. ఈ నేపథ్యంలో తాను చనిపోతే తల్లిని ఎవరూ చూడరేమోనని సూర్యవతి కలత చెందేది. ఈ నేపథ్యంలోనే చనిపోవాలని నిర్ణయించుకుంది.

ఫ కుమార్తెను చుట్టుముట్టిన

అనారోగ్య సమస్యలు

ఫ వృద్ధురాలైన తల్లికి ఎవరూ చూడరేమోనని కలత

ఫ ఇద్దరూ కాలువలో దూకి

తనువు చాలించాలని నిర్ణయం!

ఫ కుమార్తె మృతి..

తల్లి ఆచూకీ గల్లంతు

ఫ ఊబలంకలో సంఘటన..

చొప్పెల్లలో విషాదం

తల్లిని వృద్ధాశ్రమంలో చేరుస్తానంటూ..

ఈ నేపథ్యంలో తల్లి బూరమ్మను వృద్ధాశ్రమంలో చేర్పిస్తానంటూ ఆమెను తీసుకుని సూర్యవతి ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరింది. రావులపాలెం మండలం ఊబలంక షిరిడీ సాయి గుడి వద్ద ఉన్న మెయిన్‌ వంతెన పైకి చేరుకుని, తొలుత తల్లిని ముక్తేశ్వరం బ్యాంక్‌ కాలువలోకి తోసేసింది. ఆ వెంటనే తాను కూడా దూకేసింది. గమనించిన స్థానికులు వారిని రక్షించడానికి ప్రయత్నించారు. అయితే, ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఇద్దరూ నీటిలో మునిగి, కొంత దూరం కొట్టుకుపోయారు. ప్రవాహ వేగం చూసి కాలువలో దిగడానికి స్థానికులు భయంతో వెనుకంజ వేశారు. దాదాపు కిలోమీటరు తరువాత సూర్యవతి పైకి తేలింది. దీంతో, గ్రామానికి చెందిన యువకుడు నడింపల్లి నాగసాయి ధైర్యం చేసి, కాలువలో దూకి ఆమెను ఒడ్డుకు చేర్చాడు. అయితే, అప్పటికే సూర్యవతి మృతి చెందింది. తాను చనిపోతే తన తల్లిని ఎవరు చూస్తారనే బెంగతో కాలువలో దూకి చనిపోతానని సూర్యవతి తరచూగా వాపోయేదంటూ ఆమె కుమార్తె రోదించిన తీరు చూపరులను కలచివేసింది. పోలీసులు బూరమ్మ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సూర్యవతి భర్త సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement