‘తూర్పు’ డ్వామా ఏపీడీగా నరేష్‌ కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

‘తూర్పు’ డ్వామా ఏపీడీగా నరేష్‌ కుమార్‌

Jul 22 2026 12:24 AM | Updated on Jul 22 2026 12:24 AM

కొత్తపేట: స్థానిక ఎంపీడీఓ పీఎస్‌ నరేష్‌ కుమార్‌కు డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి (డీఎల్‌డీఓ) పోస్టింగ్‌ను రద్దు చేసి, డ్వామా ఏపీడీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలలో ఆయనకు డీడీఓగా ఉద్యోగోన్నతి కల్పించి, పోలవరం జిల్లా చింతూరు డీఎల్‌డీఓగా నియమించింది. ప్రతి అధికారీ విధిగా ఏజెన్సీ ప్రాంతంలో పని చేయాలనే నిబంధన ఉంది. నరేష్‌ కుమార్‌ గతంలో ఎటపాక ఎంపీడీఓగా పని చేయడంతో పాటు దేవీపట్నం మండలానికి అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. ఈ విషయాన్ని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా చింతూరు డీఎల్‌డీఓ పోస్టింగ్‌ను ప్రభుత్వం రద్దు చేసి, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం క్లస్టర్‌ డ్వామా ఏపీడీగా నియమించింది. ఈ మేరకు ఆయన మంగళవారం కొత్తపేట ఎంపీడీఓ బాధ్యతల నుంచి రిలీవ్‌ అయ్యారు. రాజమహేంద్రవరంలో డ్వామా ఏపీడీగా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నట్టు నరేష్‌ కుమార్‌ తెలిపారు.

ట్రాక్టర్‌ ట్రక్కుల

దొంగలకు 8 నెలల జైలు

గండేపల్లి: ట్రాక్టర్‌ ట్రక్కులను (ట్రైలర్లు) అపహ రిస్తున్న నలుగురికి పెద్దాపురం కోర్టు 8 నెలల జైలు, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. ఎస్సై యూవీ శివనాగబాబు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కడియం గ్రామానికి చెందిన బేదంపూడి రత్నరాజు, మంగళగిరి శ్రీను, ప్రతిపాటి తరుణ్‌, మద్దుకూరి వినయ్‌ కుమార్‌లు మురారి, తాళ్లూరు, సమిశ్రగూడెం, అనకాపల్లి జిల్లా నాతవరాల్లో ఒక్కొక్కటి చొప్పు న నాలుగు ట్రాక్టర్‌ ట్రక్కులను చోరీ చేశారు. తాళ్లూరులో ట్రక్కును దొంగిలించుకుపోతూండగా పోలీసులు గత ఏడాది ఆగస్టు 30న వారిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4 లక్షల విలువై న 4 ట్రాక్టర్‌ ట్రక్కులు, రూ.25 వేల నగదు, ఒక ట్రాక్టర్‌, ఒక స్కూటర్‌, రెండు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేయగా, విచారణ అనంతరం పెద్దాపురం సివిల్‌ జడ్జి ఎల్‌.దేవీరత్నకుమారి పైవిధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున వాదనలు వినిపించిన ఎ.లీలానాగరోజా, కేసు దర్యాప్తులో సహకరించిన కానిస్టేబుల్‌ నాగార్జునను ఉన్నతాధికారులు అభినందించారు.

రైలు నుంచి

జారిపడి వ్యక్తి మృతి

తుని: హంసవరం – అన్నవరం మధ్యలో రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందాడని జీఆర్పీ ఎస్సై వి.సత్తిబాబు మంగళవారం తెలిపారు. మృతుడి శరీరంపై ఓం, లిజ అనే పచ్చబొట్టు, కుడి చేతిపై బీఆర్‌ఏ పచ్చబొట్టు ఉన్నాయి. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిస్తే తుని జీఆర్పీకి సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement