ద్వారకా తిరుమల: అమెరికాతో ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) వ్యతిరేకిస్తూ మండలంలోని ఎం.నాగులపల్లిలో పాడి రైతులు మంగళవారం నిరసన చేపట్టారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, పాడి రైతుల సంఘం ఆధ్వర్యాన జరిగిన ఈ ఆందోళనలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. దేశీయ వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, ఏలూరు జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం అమెరికాతో ఎఫ్‌టీఏ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే అమెరికా నుంచి పాలు, పాల ఉత్పత్తులు, కోడి మాంసం, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ తదితర వ్యవసాయ ఉత్పత్తులు సుంకాలు లేకుండా దిగుమతి అవుతాయని, దీంతో, మన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం ఇప్పటికే సంక్షోభంలో ఉందని, ఇలాంటి ఒప్పందాలు రైతులను మరింత కష్టాల్లోకి నెట్టేస్తాయని అన్నారు. దేశ ఆహార స్వయంసమృద్ధి, సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించే ఈ ఎఫ్‌టీఏపై సంతకం చేయరాదని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ ఒప్పందం కుదిరితే దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మరో చరిత్రాత్మక రైతు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు, రైతు సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు.


