సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కోటిలింగాల డీసిల్టేషన్ రీచ్‌లో సోమవారం సీజ్ చేసిన 13 డ్రెడ్జింగ్ బోట్ల యజమానులపై అధికారులు ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నూతన ఇసుక విధానం–2024 పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ బోట్లను సీజ్ చేసినట్లు అధికారులు ప్రకటించిన తెలిసిందే. రాజమహేంద్రవరం ఆర్‌డీఓ సమక్షంలో గనులు, భూగర్భ శాఖ అధికారులు, సాంకేతిక సిబ్బంది, రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్, రెవెన్యూ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు కలసి ర్యాంపులో తనిఖీలు చేసి, ఈ బోట్లను సీజ్ చేశారు. వీటిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం నీటిపారుదల శాఖకు అప్పగించారు. వీటి యజమానులపై క్రిమినల్ చర్యలు చేపట్టనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అంతే.. ఆ తరువాత ఇప్పటి వరకూ ష్.. గప్‌చుప్ అన్నట్లు మౌనంగా ఉండిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో మొత్తం 28 డ్రెడ్జింగ్ బోట్లు పట్టుకుని 13 మాత్రమే సీజ్ చేసి, మిగిలిన 15 వదిలేశారంటూ జరిగిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. సాయిరామ్ శాండ్ అండ్ బోట్స్‌మెన్ సొసైటీ పరిధిలో ఈ 13 డ్రెడ్జింగ్ బోట్లు అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు, రవాణా కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు గుర్తించారు. వీటిలో గుంటూరు జిల్లా వైకుంఠపురం మాదిగపల్లికి చెందిన నండూరి రాజుకు చెందినవి 3, విజ్జేశ్వరం రామాలయం వీధికి చెందిన ముత్యాల వెంకట రమణకు చెందినవి 3, గుంటూరు జిల్లా గరుడాచలపాలేనికి చెందిన కూచిపూడి బాలస్వామికి చెందినవి 3 చొప్పున ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 4 డ్రెడ్జింగ్ బోట్ల యజమానులను గుర్తించకపోవడంతో వాటిని అన్‌క్లెయిమ్డ్‌గా నిర్ధారించారు.
24 గంటలు గడిచినా..
ఇంతవరకూ బాగానే ఉన్నా బోట్లు సీజ్ చేసి, 24 గంటలు గడిచినా వాటిపై అధికారులు మంగళవారం సాయంత్రం వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. తమ వారికి చెందిన ఈ బోట్లను వదిలిపెట్టాలంటూ అధికార పార్టీ నేత ఒకరు ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాటిపై జరిమానా విధించలేదని అంటున్నారు. గతంలో కూడా అధికారులు 11 బోట్లను సీజ్ చేసి, నామమాత్రపు ఫైన్ విధించి, వదిలేసినట్లు వినికిడి. దీంతో, మర్నాడే ఆ బోట్లు కోటిలింగాల ర్యాంపుల్లో మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోట్లు బోట్స్‌మెన్ సొసైటీ సభ్యుల పేరిట ఉండటంతో వారి పైనే కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టినా వెంటనే బోట్లను బయటకు తెచ్చేస్తామంటూ ఇసుక దోచుకుంటున్న ప్రజాప్రతినిధులు వారికి నచ్చజెబుతున్నారు.
ఫ కోటిలింగాల ర్యాంపులో 13 డ్రెడ్జింగ్ బోట్లు సీజ్
ఫ 24 గంటలు గడిచినా
చర్యలు తీసుకోని అధికారులు
ఫ టీడీపీ నేత ఒత్తిళ్లే కారణమని అనుమానాలు


