బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరికలకు హడావుడి మొదలైంది. దీనికిగాను కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. గత ఏడాది జూలై 7న షెడ్యూల్ ప్రారంభించగా, ఈ ఏడాది పదమూడు రోజులు ఆలస్యంగా ప్రక్రియ ప్రారంభించింది. కౌన్సెలింగ్‌ను ఈ నెల 20వ తేదీ సోమవారం నుంచి ప్రారంభించి, ఆగస్టు 7న కళాశాలల్లో చేరేలా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలో, ఏ కళాశాలలో చేరాలో వంటి వాటిపై విద్యార్థులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 24 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 16,650 సీట్లు ఉండగా, ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు నన్నయ, జేఎన్‌టీయూకేలో 750 సీట్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా ఇంజినీరింగ్ విభాగంలో కాకినాడ జిల్లాలో 4,090, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2,323, తూర్పుగోదావరిలో 6,746 మంది అర్హత సాధించారు. వెబ్ ఆప్షన్ల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించి నిర్ణయం తీసుకోవాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.
సంప్రదాయ కోర్సులతో పాటు కొత్తగా..
ఈసీఈ, మెకానికల్, ఈఈఈ, సీఎస్‌ఈ, సివిల్ వంటి సంప్రదాయ కోర్సులతో పాటు పలు కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. సీఎస్‌ఈలో ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్, అగ్రికల్చర్, మైరెన్, మైనింగ్, స్కిల్ అండ్ టెక్స్‌టైల్ వంటి నైపుణ్యంతో కూడిన కొత్త కోర్సులు వచ్చాయి.
ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ఇలా...
ముందుగా సీఏపీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అడ్మిషన్‌పై క్లిక్ చేయాలి. వచ్చిన ఫామ్స్‌తో హాల్‌టికెట్, పుట్టిన తేదీతో రిజిస్ట్రేషన్ ఫామ్‌లోకి ప్రవేశించి అడిగిన సమాచారం క్షణ్ణంగా నింపి సబ్మిట్ కొట్టాలి. రిజిస్ట్రేషన్ ఫీజు ఓసీ, బీసీలు రూ.1,200, ఎస్సీ, ఎస్టీలు రూ.600 చెల్లించాలి.
పదో తరగతి, ఇంటర్ మార్కుల జాబితా, 6 నుంచి ఇంటర్ స్టడీ, టీసీ, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ (జనవరి 1వ తేదీ 2023వ సంవత్సరం తరువాత), ఈడబ్ల్యూఎస్ అయితే 2026–27లో మీసేవా ద్వారా పొంది ఉండాలి. ర్యాంక్ కార్డు, హాల్‌టిక్కెట్, రేషన్‌కార్డుల పత్రాలు అన్ని అప్‌లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ కుల ధ్రువీకరణ పత్రం ఉన్నవారికి 10 శాతం రిజర్వేషన్‌ను 2022 నుంచి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఆన్‌లైన్‌లో పొందుపరిచిన అన్ని నకళ్లు కళాశాలలో చేరేటప్పుడు తీసుకెళ్లాలి.
షెడ్యూల్ ఇదే..
ఈ నెల 20 నుంచి 29 తేదీ వరకూ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు.
22 నుంచి 31 తేదీ వరకూ ఆన్‌లైన్ సర్టిఫికెట్ల పరిశీలన.
25 నుంచి 31 వరకూ వెబ్ ఆప్షన్ల నమోదు, ఆగస్టు 1న వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం.
ఆగస్టు 6న సీట్ల కేటాయింపు, 7 నుంచి 13వ తేదీ వరకూ కళాశాలలో చేరికకు సమయం ఇస్తారు.
జిల్లాలో హెల్ప్‌లైన్ కేంద్రాలు: జేఎన్టీయూ కాకినాడ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ బ్లాక్, ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల (జగన్నాథపురం).
నేటి నుంచి ఈఏపీ సెట్ కౌన్సెలింగ్
ఇంజినీరింగ్ కోర్సుల షెడ్యూల్ విడుదల
కాకినాడలో రెండు హెల్ప్‌లైన్ కేంద్రాలు
కౌన్సెలింగ్‌లో జాగ్రత్తలు
అవసరమంటున్న విద్యావేత్తలు


