ఉషోరుమంటూ..
యానాం: పర్యాటక ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయల ఖర్చుతో చేపట్టిన నిర్మాణాలకు నిర్లక్ష్యపు గ్రహణం పట్టింది. వాటి నిర్వహణ లేకపోవడంతో అలంకారప్రాయంగా మారుతున్నాయి. ఎన్నో ఆశలతో వాటిని చూసేందుకు వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. యానాం పట్టణంలో బొటానికల్ గార్డెన్, దానిలో నిర్మించిన మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షో ఈ కోవలోకే వస్తాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ నిర్మాణాలు ఇప్పుడు పనిచేయడం లేదు. బొటానికల్ గార్డెన్ నిత్యం తెరిచే ఉంటుంది. మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షోలను ఏటా సంక్రాంతి పండగ సమయంలో మూడు రోజుల పాటు ప్రదర్శించేవారు. ప్రస్తుతంగా గార్డెన్ అధ్వానంగా మారింది. మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షోకు సంబంధించిన యంత్రాలు నిర్వహణ లేక మూలన పడ్డాయి.
రూ.8 కోట్లతో నిర్మాణం
బొటానికల్ గార్డెన్‌ను 2013లో సుమారు రూ.8 కోట్ల పర్యాటక శాఖ నిధులతో నిర్మించారు. ముఖ్యంగా సైన్స్ విద్యార్థులకు ఉపకరించేలా దాన్ని తీర్చిదిద్దాలని భావించారు. కానీ కేవలం ఒక భవంతిని నిర్మించి వదిలేశారు. గార్డెన్‌లో మొక్కలను మాత్రం ఏర్పాటు చేయలేదు. దాన్ని 2016లో సీఎం రంగసామి ప్రారంభించారు. అనంతరం మళ్లీ అదే స్థలంలో రూ.2 కోట్ల నిధులతో మ్యూజికల్ ఫౌంటెయిన్ ఏర్పాటు చేశారు. దానికి అనుసంధానంగా లేజర్ షోకు కూడా ఏర్పాట్లు చేశారు. 2019 జనవరిలో సౌండ్ అండ్ లైట్ షోను అప్పటి సీఎం నారాయణసామి ప్రారంభించారు. అప్పటి నుంచి కొంత కాలం పనిచేసిన తర్వాత మానేసింది.
నిర్వహణ గాలికి..
మ్యూజికల్ ఫౌంటెయిన్‌కు సంబంధించిన యంత్రాలు, మోటార్లను సంబంధిత పీడబ్ల్యూడీ యంత్రాంగం నిర్వహణ చేయాల్సి ఉంది. ఎప్పటికప్పుడు ఆ యంత్రాలను పర్యవేక్షిస్తూ ఉండాలి. కానీ రెండేళ్లుగా వాటిపై అధికారులు దృష్టి సారించలేదు. దీంతో యంత్రాలు పనిచేయని స్థితిలోకి వచ్చాయి. అక్కడ నీరు కూడా రంగు మారి అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. బొటానికల్ గార్డెన్ ప్రాంతం సంబంధిత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది పర్యవేక్షణలో ఉంటుంది. దాని నిర్వహణ బాధ్యత అంతా వారిదే. అయితే సంబంధిత అధికారులు మాత్రం దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బొటానికల్ గార్డెన్‌లో మొక్కలు, పచ్చదనం సైతం లేకుండా కళావిహీనంగా మారింది. పర్యాటకులకు కనీస సౌకర్యాలు కూడా లేవు. దీంతో అక్కడకు వచ్చిన వారందరూ ఇబ్బంది పడుతున్నారు.
ఈసారి నిరాశే..
ప్రతి ఏటా సంక్రాంతి పండగ సమయంలో మూడు రోజుల పాటు మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షో ప్రదర్శిస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం ప్రదర్శనలు లేకుండా చేశారు. మ్యూజికల్ పౌంటెయిన్‌కు సంబంధించి యంత్రాలను సకాలంలో బాగు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.
ఈ సంక్రాంతికి లేజర్ షో లేనట్టే
మూలన పడిన మ్యూజికల్ ఫౌంటెయిన్
నిర్వహణ లేక పనిచేయని యంత్రాలు
అధ్వానంగా మారిన యానాం బొటానికల్ గార్డెన్
పర్యాటకులకు నిరాశ
ఉషోరుమంటూ..
ఉషోరుమంటూ..
ఉషోరుమంటూ..


