వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ

Dec 24 2025 4:08 AM | Updated on Dec 24 2025 4:08 AM

వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ

వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ

రాజమహేంద్రవరం రూరల్‌: బొమ్మూరులోని ఎన్‌టీఆర్‌ నైపుణ్యాభివృద్ధి, సాధికార సంస్థ (మహిళా ప్రాంగణం) లో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వివిధ కోర్సు లలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్‌ (ఇన్‌చార్జి) పి.విమల ఒక ప్రకటనలో తెలిపారు. హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ, టైలరింగ్‌ (8వ తరగతి ఆపైన), బ్యూటీషియన్‌ (10వ తరగతి), డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (10వ తరగతి) కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అలాగే, షార్ట్‌ టర్మ్‌ కోర్సులైన టైలరింగ్‌ బేసిక్స్‌, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌, మిల్లెట్స్‌ స్నాక్స్‌ మేకింగ్‌ (8వ తరగతి) అందిస్తున్నామన్నారు. రెసిడెన్షియల్‌, నాన్‌ రెసిడెన్షియల్‌ పద్ధతిలో శిక్షణ ఇస్తామన్నారు. 18 నుంచి 40 సంవత్సరాల్లోపు ఆసక్తి కలిగిన మహిళలు ఆధార్‌ కార్డు, విద్యార్హత ధ్రువపత్రం, రేషన్‌ కార్డు లేదా ఆదాయ ధ్రువపత్రం, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులు బొమ్మూరు మహిళా ప్రాంగణంలో ఇస్తామని తెలిపారు. ఇతర వివరాలకు 83339 21340 నంబర్‌లో కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలని సూచించారు. ఎంబ్రాయిడరీ, టైలరింగ్‌, బ్యూటీషియన్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సుల దరఖాస్తులను ఈ నెల 31లోగా.. టైలరింగ్‌, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌, మిల్లెట్స్‌ స్నాక్స్‌ మేకింగ్‌ కోర్సుల దరఖాస్తులను జనవరి 5లోగా మహిళా ప్రాంగణంలో అందజేయాలని విమల సూచించారు.

పోస్టుల భర్తీకి

దరఖాస్తుల ఆహ్వానం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కేవీ శివప్రసాద్‌ మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఆఫీస్‌ సబార్డినేట్‌, అనస్తీషియా టెక్నీషియన్‌, కార్డియాలజీ టెక్నీషియన్‌, ల్యాబ్‌, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్లు, జనరల్‌ డ్యూటీ, స్టోర్‌, ల్యాబ్‌ అటెండెంట్లు, ఈసీజీ టెక్నీషియన్‌, లైబ్రరీ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఈ నెల 26 ఉదయం 10 గంటల నుంచి జనవరి 9వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో వ్యక్తిగతంగా మాత్రమే సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు ఈస్ట్‌గోదావరి.ఏపీ.జీఓవీ.ఇన్‌, జీఎంసీరాజమహేంద్రవరం.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఏపీఎన్‌జీవోనూతన కార్యవర్గ ఎన్నిక

ప్రకాశం నగర్‌ (రాజమహేంద్రవరం): ఏపీఎన్‌జీవో సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ఆ సంఘం కార్యాలయంలో మంగళవారం ఏకగ్రీవంగా జరిగింది. రాజమహేంద్రవరం యూనిట్‌ అధ్యక్షుడిగా పిచ్చుక అనిల్‌ కుమార్‌ (మున్సిపల్‌), కార్యదర్శిగా ఆర్‌.రాజేష్‌ (ఖజానా శాఖ), కోశాధికారిగా ప్రతాప్‌ (పంచాయతీరాజ్‌), సహాధ్యక్షుడిగా యర్రంశెట్టి సత్యమూర్తి (పంచాయతీరాజ్‌), ఉపాధ్యక్షులుగా ఎం.సత్యనారాయణరాజు (రిజిస్ట్రేషన్స్‌), డి.చటర్జీ (మెడికల్‌), రాఘవరావు (పబ్లిక్‌ హెల్త్‌), జి.కుమార్‌ (సెంట్రల్‌ జైలు) ఎన్నికయ్యారు. వీరితో పాటు మహిళా ఉపాధ్యక్షులుగా ఎం.సత్యవతి (మెడికల్‌), కార్యనిర్వాహక కార్యదర్శిగా జె.వెంకట్రావు (అగ్రికల్చర్‌), సంయుక్త కార్యదర్శులుగా డి.జగ్గారావు (వార్డ్‌ సచివాలయం), రోజారాణి (శిశు సంక్షేమం), ఎస్‌కే సహానా (ఖజానా శాఖ), వి.రత్నకుమార్‌ (కమర్షియల్‌ ట్యాక్స్‌), టి.శ్రీనివాస్‌ (విద్య), మహిళా సంయుక్త కార్యదర్శిగా పి.కామేశ్వరి (మున్సిపల్‌) ఎన్నికయ్యారు.

డ్రమ్‌ సీడర్‌తో వరి విత్తనాలు వేయాలి

పెరవలి: డ్రమ్‌ సీడర్‌ ద్వారా జిల్లావ్యాప్తంగా 3,500 ఎకరాల్లో రబీ వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సేంద్రియ వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ సాకా రామకృష్ణ తెలిపారు. మండలంలోని కాపవరంలో డ్రమ్‌ సీడర్‌ ద్వారా రైతులతో మంగళవారం విత్తనాలు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రమ్‌ సీడర్‌తో విత్తనాలు వేస్తే ఎక్కువ కుదుళ్లు ఏర్పడి, దిగుబడి పెరుగుతుందని, కూలీల ఖర్చు తగ్గు తుందని చెప్పారు. ఎకరానికి 8 నుంచి 10 కిలోల విత్తనాలు సరిపోతాయన్నారు. డ్రమ్‌ సీడర్‌తో విత్తనాలు వేసే రైతులు కృషి ట్రాక్టర్‌కు రోటోవేటర్‌ను అమర్చి దమ్ము చేసి, నేలను చదును చేయాలని సూచించారు. నీరు పల్చగా ఉంచి, కోర వచ్చిన విత్తనాలను డ్రమ్ముల్లో వేసి నాటాలన్నారు. డ్రమ్‌ సీడర్‌లోని నాలుగు డ్రమ్ములుంటాయని, ఒక్కొక్క దానిలో కిలో చొప్పున విత్తనా లు వేస్తే, 10 నుంచి 12 సెంటీమీటర్ల ఎడంతో పడతాయని చెప్పారు. డ్రమ్‌ సీడర్‌ లాగినప్పుడు లైనుకు లైనుకు మధ్య 22 సెంటీమీటర్ల వ్యత్యా సం ఉంటుందన్నారు. ఎకరానికి 20 కిలోల విత్తనాలు ఆదా అవుతాయని తెలిపారు. పైగా, ఈ చేలు బాగా దుబ్బు చేసి, వారం ముందే కోతకు వస్తాయని, చీడపీడల సమస్య తక్కువగా ఉండి, దిగుబడి 3 నుంచి 5 బస్తాలు ఎక్కువ గా వస్తుందని, వివరించారు. ఎకరానికి ఖర్చు రూ.5 వేల వరకూ తగ్గుతుందని రామకృష్ణ చెప్పారు.

23ఎన్‌డిడి41: కాపవరంలో డ్రమ్‌ సీడర్‌ను లాగుతున్న రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement