ఈ కుర్చీకో దండం | - | Sakshi
Sakshi News home page

ఈ కుర్చీకో దండం

Dec 24 2025 4:08 AM | Updated on Dec 24 2025 4:08 AM

ఈ కుర

ఈ కుర్చీకో దండం

అన్నవరం: ఒకప్పుడు అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా పని చేయడానికి దేవదాయ శాఖ అధికారులు పోటీ పడేవారు. ఈ కుర్చీ కోసం ప్రజాప్రతినిధులతో పెద్ద ఎత్తున సిఫారసులు చేయించుకునేవారు. కానీ, నేడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఈఓ కుర్చీ అంటే.. వద్దు బాబోయ్‌.. దీనికో దండమని అంటున్నారు. ఏడాది కాలంగా దేవస్థానంలో నెలకొన్న పరిస్థితులు, పరిపాలనలో మితిమీరిన రాజకీయ జోక్యంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఇన్‌చార్జి ఈఓగా బాధ్యతలు చేపట్టిన వి.త్రినాథరావు సైతం తనను ఈ బాధ్యతల నుంచి తప్పించాలంటూ సంబంధిత శాఖ మంత్రిని వేడుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే కనుక నిజమైతే రత్నగిరిపై పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరం లేదు.

ప్రస్తుతం రాజకీయ జోక్యం

చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత దేవస్థానం ఈఓగా దేవదాయ శాఖ అధికారుల స్థానంలో గ్రూప్‌–1 అధికారి, డిప్యూటీ కలెక్టర్‌ వీర్ల సుబ్బారావును గత ఏడాది డిసెంబర్‌లో నియమించారు. దేవస్థానంపై ఆయనకు పెద్దగా అవగాహన లేకపోవడానికి తోడు దేవస్థానం పరిపాలన అంతా ప్రజాప్రతినిధుల చేతుల్లో పెట్టడం, పని చిన్నదైనా, పెద్దదైనా వారు చెప్తే చేయడమే పరిపాలననే విధంగా పరిస్థితులు దిగజారిపోయాయి. అలాగే, ఆయన కుటుంబ సభ్యుల జోక్యం బాగా పెరిగిపోవడం దేవస్థానం సిబ్బందిలో అసంతృప్తికి కారణమైంది. సుబ్బారావు నియామకంపై ఈ ఏడాది మార్చి నాటికే దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ, రాజకీయ జోక్యంతో కొనసాగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కాలంలో ఉన్నతాధికారులు తరచూ జోక్యం చేసుకుని, పరిపాలనను చక్కదిద్దాల్సి వచ్చింది. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో అన్నవరం ఐదు, ఆరు, ఏడు ర్యాంకులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈఓ మారినా..

శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాలకు ఈఓలుగా నియమించిన డిప్యూటీ కలెక్టర్ల పదవీ కాలాన్ని ఇటీవల మరో ఏడాది పొడిగించారు. అన్నవరం దేవస్థానం ఈఓ సుబ్బారావును మాత్రం రెవెన్యూ విభాగానికి సరెండర్‌ చేశారు. ఆయన స్థానంలో దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌ (ఆర్‌జేసీ) త్రినాథరావును ఇన్‌చార్జిగా నియమించారు. గతంలో మూడుసార్లు ఈఓగా పని చేసిన అనుభవం ఉండటంతో ఆయన పరిస్థితులను చక్కదిద్దుతారని ఉన్నతాధికారులు భావించారు. కానీ, ఎవ్వరూ చక్కదిద్దలేనంతగా ఇక్కడి పరిస్థితులు దిగజారిపోయాయనే విషయం ఇప్పుడిప్పుడే తేటతెల్లమవుతోంది. ఇక్కడ ఏ పని చేయాలన్నా ప్రజాప్రతినిధుల జోక్యం చేసుకుంటున్నారు. ప్రతి పనీ తమకు చెప్పిన తర్వాతే చేయాలనే విధంగా పరిస్థితులు మారిపోయాయి. దీంతో, ఇక్కడ స్వేచ్ఛగా ఏ పనీ చేయలేమనే నిర్ణయానికి అధికారులు వచ్చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ సీటు ఆశించిన వారందరూ ఇప్పుడు మిన్నకున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఈఓ త్రినాథరావు కూడా తనను ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని సంబంధిత మంత్రిని కోరినట్లు ప్రచారం జరుగుతోంది.

గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అన్నవరం దేవస్థానం అభివృద్ధి పథంలో పయనించింది. 2021–22 మధ్య కూడా త్రినాథరావు ఇక్కడ ఈఓగా ఉన్నారు. ఆ సమయంలో రత్నగిరి రామాలయం ముందు భక్తుల కోసం దాతల సహకారంతో సుమారు రూ.కోటితో విశ్రాంతి షెడ్డు నిర్మించారు. స్వామివారి వార్షిక కల్యాణ మండపం, ప్రసాద తయారీ భవనం నిర్మించి, ప్రారంభించారు. అలాగే, 2022–23లో కూడా దాతల సహకారంతో వనదుర్గ ఆలయం వద్ద డార్మెట్రీ నిర్మించారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఈఓగా ఉన్న సమయంలో కేవలం 8 నెలల్లోనే సత్యగిరి రోడ్డు నుంచి నేరుగా మూడో ఘాట్‌ రోడ్డు మలుపులోకి చేరేలా ఆదిశంకర మార్గ్‌ రోడ్డు, కొండ దిగువన టూరిస్టు బస్సులలో వచ్చే భక్తుల కోసం 5 విశ్రాంతి షెడ్లు నిర్మించారు. జాతీయ రహదారి వద్ద ఆక్రమణలో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకుని, అందులో సత్యదేవుని నూతన నమూనా ఆలయం, రత్నగిరిపై పార్కింగ్‌ స్థలాల అభివృద్ధి, సహజ, ప్రకాష్‌ సదన్‌ సత్రాల మధ్య నుంచి పశ్చిమ రాజగోపురం సమీపానికి వాహనాలు చేరుకునేలా రోడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టి పూర్తి చేశారు. శివసదన్‌ సత్రం కూడా 135 గదులతో త్వరితగతిన నిర్మించి, భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. దూర ప్రాంతాల భక్తులకు కనిపించేలా విద్యుద్దీపాలతో శంఖచక్ర నామాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ రాజగోపురం ముందు విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి లారెస్‌ ఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని, సత్యదేవ అతిథి గృహాన్ని కూల్చేశారు. వివిధ కారణాలతో ఆ షెడ్డు నిర్మాణం ఆలస్యమైనప్పటికీ ఇటీవల పూర్తి చేశారు. సుమారు 45 వ్రత పురోహిత పోస్టులు భర్తీ చేశారు. వ్రత పురోహితుల పారితోషికాన్ని 30 నుంచి 40 శాతానికి పెంచారు. ఆ ఐదేళ్లూ ఎటువంటి వివాదాలూ లేకుండా దేవస్థానం పరిపాలన సాఫీగా సాగిపోయింది.

ఫ రత్నగిరిపై మితిమీరిన రాజకీయ జోక్యం

ఫ ఏ పనైనా తమకు చెప్పి చేయాల్సిందే

నంటున్న ప్రజాప్రతినిధులు

ఫ బెంబేలెత్తిపోతున్న అధికారులు

ఫ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని

కోరిన ఈఓ

ఫ మళ్లీ డిప్యూటీ కలెక్టర్‌నే

నియమిస్తారంటూ ప్రచారం

ఈ కుర్చీకో దండం1
1/1

ఈ కుర్చీకో దండం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement