భంగపాటు చేయాలని భంగపడిన దుష్టచతుష్టయం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వనవాసం చేస్తున్న పాండు సుతులకు ఘోష యాత్ర మిషతో భంగపాటు కలిగించాలని వచ్చిన ధార్తరాష్ట్రులు భంగపాటుకు గురయ్యారని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. వ్యాస భారతంపై ప్రవచనాన్ని స్థానిక హిందూ సమాజంలో మంగళవారం ఆయన కొనసాగించారు. ‘‘గంధర్వుని చేతిలో దుర్యోధనుడు బందీ అయినప్పుడు.. కావలసిన కార్యాన్ని గంధర్వులే సరి చేశారని భీముడు ఆనందిస్తాడు. అతడిని ధర్మరాజు వారిస్తాడు. ‘ఇతరులతో విభేదాలు వస్తే మనం 105 మంది సోదరులం. ఇతర సందర్భాల్లో వారు వంద మంది, మనం ఐదుగురం. వెంటనే దుర్యోధనుడిని విడిపించు’ అని అర్జునుడిని ఆదేశిస్తాడు. తిరిగి వచ్చిన దుర్యోధనుడిని భీష్ముడు మందలిస్తాడు. ‘నీవు నమ్ముకున్న కర్ణుడు గంధర్వులతో జరిగిన పోరులో పలాయనవాదం చిత్తగించాడు. పాండవుల పరాక్రమంలో కర్ణుడు పావు భాగానికి సరిపోడు’ అని అంటాడ’’ని వివరించారు. భీష్ముడు దుష్టచతుష్టయాన్ని మందలించలేదని వచ్చే విమర్శల్లో సత్యం లేదని సామవేదం చెప్పారు. ‘‘తమ వద్దకు వచ్చిన దూర్వాస మహర్షిని దుర్యోధనుడుఅన్ని విధాలా సహనంతో సేవించాడు. ఆయన అర్థరాత్రీ, అపరాత్రీ వచ్చి భోజనం కావాలని ఆదేశించినా, చక్కని అన్నపానీయాలను అందించేవాడు. సంతృప్తి చెందిన దూర్వాసుడు వరం కోరుకోవాలని దుర్యోధనుడిని అడుగుతాడు. ‘మీరు పాండవుల వద్దకు వెళ్లి, సేవలు అందుకుని వారిని కూడా తరింపజేయాలి. ద్రౌపది కూడా భుజించిన తరువాత భోజనం పెట్టాల్సిందిగా వారిని ఆదేశించాలి’ అని దుర్యోధనుడు కోరుతాడు. వేలాది శిష్యులతో దూర్వాసుడు పాండుసుతుల వద్దకు వెళ్తాడు. ద్రౌపది భుజించిన తరువాత వెళ్లి, తనకూ, తనతో వచ్చిన వేలాది మంది శిష్యులకు భోజనం సిద్ధం చేయాలని కోరుతాడు. స్నానానికి వెళ్లిన దూర్వాసుడు, ఆయన శిష్యగణాలకు కృష్ణుని అనుగ్రహంతో మృష్టాన్న భోజనం చేసిన తృప్తి కలిగి, ధర్మరాజుకు చెప్పకుండా వెళ్లిపోతారు’’ అని కథా భాగాన్ని వివరించారు. హరి భక్తులకు ఇబ్బందులు కలిగిస్తే వచ్చే ప్రమాదాలు దూర్వాసునికి అంబరీషుని ద్వారా గతంలోనే అవగాహనకు వచ్చిందని చెప్పారు. అనంతరం, పాండవులకు మార్కండేయ మహర్షి రామకథ వివరిస్తాడని, పురాణాలు రామకథతో పవిత్రమవుతాయని, భాగవతంలో కూడా రామకథ కనిపిస్తుందని సామవేదం చెప్పారు. నలదమయంతుల కథ, సీతారాముల కథ, సావిత్రీసత్యవంతుల కథలతో కూడిన భారత కథా శ్రవణం ద్వారా యజ్ఞఫలం లభిస్తుందని అన్నారు.


