క్రీస్తు మందిరం.. నూత్న శోభితం | - | Sakshi
Sakshi News home page

క్రీస్తు మందిరం.. నూత్న శోభితం

Dec 24 2025 4:08 AM | Updated on Dec 24 2025 4:08 AM

క్రీస

క్రీస్తు మందిరం.. నూత్న శోభితం

నిడదవోలు: ప్రేమ, శాంతి, క్షమ, దయ, త్యాగం వంటి సద్గుణాలనే ప్రపంచ మానవాళికి తన సందేశంగా ఇచ్చిన కరుణామయుడైన క్రీస్తు జన్మదినం.. క్రిస్మస్‌ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో నిర్వహించుకునేందుకు జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు సిద్ధమయ్యారు. తమ ఇళ్లతో పాటు చర్చిలు, ప్రార్థనా మందిరాలను అందంగా ముస్తాబు చేశారు. విద్యుద్దీపతోరణాలతో అలంకరించారు. క్రిస్మస్‌ ట్రీలు, ఇతర అలంకరణ సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. పాలస్తీనా దేశంలోని బేత్లెహేము గ్రామంలోని పశువుల పాకలో ఆ దైవ కుమారుడు జనియించిన వృత్తాంతాన్ని కళ్లకు కట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

క్రీస్తు జాడను చూపిన నక్షత్రానికి సూచికగా విశ్వాసుల ఇళ్లు, చర్చిల వద్ద విద్యుద్దీపాలతో ఏర్పాటు చేసిన స్టార్‌లు ఇప్పటికే కొత్త కాంతులు విరజిమ్ముతున్నాయి. ఆ మహనీయుని బోధను అనుసరించి.. దీన జనులకు కొంత మంది నూతన వస్త్రాలు, కానుకలు, ఆహార పదార్థాలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. క్రీస్తు జననాన్ని వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సామూహికంగా స్తుతి ఆరాధనలు చేయనున్నారు.

కేరల్స్‌

ఏసుక్రీస్తు జనన వర్తమానాన్ని ప్రకటిస్తూ ఆయా క్రైస్తవ సంఘాల ఆధ్వర్యాన క్రిస్మస్‌ వేడుకలకు ముందు సంఘ కాపరితో పాటు యువజనులు రాత్రి వేళ ఇంటింటికీ తిరిగి కేరల్స్‌ నిర్వహిస్తారు. సంగీత వాయిద్యాలతో క్రీస్తు స్తుతి గీతాలు ఆలపిస్తూ ఆయా ఇళ్లను సందర్శిస్తారు. కేరల్స్‌ వలన క్రైస్తవుల్లో ప్రేమ, ఐక్యత పెంపొందుతాయి.

క్రిస్మస్‌ ట్రీ

ఆధునిక జర్మనీ ఆవిర్భవించాక క్రిస్మస్‌ ట్రీ ప్రాచుర్యంలోకి వచ్చింది. 16వ శతాబ్దంలో మార్టిన్‌ లూథర్‌ మొదటిసారి ఎవర్‌గ్రీన్‌ అనే చెట్టును కొవ్వొత్తులతో అలంకరించినట్లు చెబుతారు. ట్రీ వర్షిప్‌ అనేది యూరోపియన్లలో అతి సాధారణం. నిత్య జీవానికి సంకేతంగా క్రిస్మస్‌ ట్రీని అలంకరిస్తారు. ఈజిప్షియన్లు, చైనీయులు, హీబ్రూస్‌ ఈ ట్రీని అలంకరించేవారు. ఈ సంప్రదాయం 20వ శతాబ్దంలో చర్చిలకు, కాలక్రమేణ అన్ని దేశాలకూ, 1982లో వాటికన్‌ సిటీలోని కేథలిక్‌ చర్చిలకు విస్తరించింది. ఈ ట్రీలో త్రికోణ ఆకారంలోని అగ్రభాగం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ ఐక్యరూపానికి ప్రతీకగా చెబుతారు. పైన అలంకరించిన నక్షత్రం క్రీస్తు జననానికి సూచన. అపవాదుని పారదోలేదిగా భావిస్తూ క్రైస్తవులు క్రిస్మస్‌ దినాల్లో ఇళ్లు, చర్చిల్లో ఈ ట్రీలు అలంకరిస్తారు.

క్రిస్మస్‌ సంరంభం ఆరంభమైతే చాలు.. ఎర్రని రంగు దుస్తులు.. తెల్లని పండు జుట్టు, గెడ్డం, మీసాలతో క్రిస్మస్‌ తాత (శాంటాక్లాజ్‌) అనేకచోట్ల ప్రత్యక్షమవుతాడు. అతడిని చూస్తే చాలు.. పిల్లలు తెగ సంబరపడిపోతూంటారు. ఈ క్రిస్మస్‌ తాత ఎలా వచ్చాడంటే.. గ్రీకు బిషప్‌ సెయింట్‌ నికోలస్‌ స్ఫూర్తితో శాంటాక్లాజ్‌ పాత్ర రూపుదిద్దుకుంది. 1823లో అమెరికా, కెనడా, బ్రిటన్‌ దేశాల్లో శాంటాక్లాజ్‌ వర్ణనపై రచించిన ‘ఏ విజిట్‌ ఫర్‌ సెయింట్‌ నికోలస్‌’ కవిత ఆధారంగా థామస్‌ నేస్ట్‌ అనే రాజకీయ, వ్యంగ్య చిత్రకారుడు శాంటాక్లాజ్‌ ఊహాచిత్రం గీశారు. ఈ చిత్రాన్ని కోకాకోలా కంపెనీ తమ ఉత్పత్తుల ప్రచారానికి వినియోగించుకుంది. ఆ క్రమంలో శాంటాక్లాజ్‌ వస్త్రధారణ ఇప్పుడున్న ఎరుపు, తెలుపు రంగుల్లోకి మారింది. క్రిస్మస్‌ రోజు రాత్రి వేళ.. దుప్పులతో నడిచే రథంపై ఆకాశ మార్గాన క్రిస్మస్‌ తాత వస్తాడని, మంచి ప్రవర్తన ఉన్న పిల్లలకు ఎన్నో బహుమతులు తెస్తాడని, చెడు ప్రవర్తన ఉన్న పిల్లలకు బొగ్గు మాత్రమే ఇస్తాడని తల్లిదండ్రులు చెబుతూంటారు. దీనిని విశ్వసిస్తూ పిల్లలు మంచి ప్రవర్తన కనబరుస్తారు. దీనిని గుర్తు చేసేలా క్రిస్మస్‌ వేడుకల్లో క్రిస్మస్‌ తాత అలంకరణలో ఓ వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. క్రీస్తు ప్రేమను ప్రదర్శిస్తూ.. కానుకలు పంచుతూ పిల్లలను, పెద్దలను అలరిస్తాడు.

ఫ జిల్లావ్యాప్తంగా క్రిస్మస్‌ సంరంభం

ఫ వేడుకలకు ముస్తాబైన చర్చిలు

ఫ పలుచోట్ల ప్రత్యేక ప్రార్థనలు

ఫ ఆకట్టుకుంటున్న విద్దుద్దీపాలంకరణలు

క్రీస్తు మందిరం.. నూత్న శోభితం1
1/3

క్రీస్తు మందిరం.. నూత్న శోభితం

క్రీస్తు మందిరం.. నూత్న శోభితం2
2/3

క్రీస్తు మందిరం.. నూత్న శోభితం

క్రీస్తు మందిరం.. నూత్న శోభితం3
3/3

క్రీస్తు మందిరం.. నూత్న శోభితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement