రైతులకే మొదటి ప్రాధాన్యం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వ్యవసాయ రంగంలో రైతులకే తమ మొదటి ప్రాధాన్యమని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ (నిర్కా) డైరెక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యాన రాజమహేంద్రవరంలోని నిర్కా సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జాతీయ రైతు దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వాణిజ్యం తరహాలో వ్యవసాయం చేయడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు.
కేవీకే అధిపతి వీఎస్‌జీఆర్ నాయుడు మాట్లాడుతూ, ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీ జీ రామ్ జీ) ద్వారా ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 125కు పెంచారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, గిడ్డంగులు, మార్కెట్ సౌకర్యాల వంటి శాశ్వత ఆస్తులను సృష్టించేందుకు, జల సంరక్షణ పనులకు ఈ చట్టం పెద్దపీట వేసిందన్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరిగే నాట్లు, కోతల సమయాల్లో ఉపాధి హామీ పనులకు బ్రేక్ వేయడం ద్వారా రైతులకు కూలీల కొరత లేకుండా చేసేందుకు ఈ చట్టం దోహదపడుతుందన్నారు. నిర్దిష్ట సమయంలో హామీ ఇచ్చిన పని దినాలు కల్పించకుంటే కూలీలకు నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పారు.
జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు మాట్లాడుతూ, అధిక మోతాదులో రసాయనిక ఎరువుల వాడకం వలన జరిగే నష్టాలను రైతులకు వివరించారు. వివిధ ప్రభుత్వ పథకాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరి ఎగుమతిదారుల సదస్సు కూడా నిర్వహించారు. వివిధ కాలాల్లో ఎగుమతికి గిరాకీ ఉన్న వరి రకాల గురించి మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త సీహెచ్ శ్రీనివాసరావు వివరించారు. వివిధ సంస్థల ప్రతినిధులు కూడా ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మాధవరావును, అమలాపురానికి చెందిన రైతు సోమరాజును అభ్యుదయ రైతుగా ఎంపిక చేసి సత్కరించారు. కార్యక్రమంలో డాట్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త నరసింహారావు, ఏపీసీఎంఎఫ్ డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ బి.తాతారావు, కేవీకే అధికారులు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 100 మంది రైతులు పాల్గొన్నారు.
ఫ నిర్కా డైరెక్టర్ శేషుమాధవ్
ఫ ఘనంగా జాతీయ రైతుల దినోత్సవం


