ఉమ్మడి జిల్లా ఖోఖో జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా ఖోఖో జట్టు ఎంపిక

Dec 24 2025 4:01 AM | Updated on Dec 24 2025 4:01 AM

ఉమ్మడి జిల్లా ఖోఖో జట్టు ఎంపిక

ఉమ్మడి జిల్లా ఖోఖో జట్టు ఎంపిక

సామర్లకోట: రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఉమ్మడి జిల్లా పురుషుల జట్టును మంగళవారం ఎంపిక చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని సుమారు 52 మంది క్రీడాకారులకు ఐదు రోజుల పాటు పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్తు హైస్కూల్లో శిక్షణ ఇచ్చారు. వారిలో ఉత్తమ ప్రతిభ చూపిన 15 మంది క్రీడాకారులను ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. వారికి వెన్నా వెంకటేష్‌ సహకారంతో జెర్సీలు అందజేశారు. గుడివాడలో ఈ నెల 25, 26 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని వెంకటేష్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులను డీసీసీబీ చైర్మన్‌ తుమ్మల బాబు అభినందించారు.

చదువు భారం..

బాలికల అదృశ్యం

మలికిపురం: చదువుకోవడం భారంగా మారిందని భావించిన రాజోలుకు చెందిన ఇద్దరు ఇంటర్మీడియట్‌ విద్యార్థినులు మంగళవారం అదృశ్యం అయ్యారు. వారి బంధువుల ఫిర్యాదు మేరకు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్‌ ఆధ్వర్యంలో పోలీసులు గాలించి, నాలుగు గంటల్లోనే వారి ఆచూకీ కనుగొన్నారు. ఆ వివరాలను మలికిపురం పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ విలేకరులకు తెలిపారు. రాజోలు చెందిన ఆ ఇద్దరు విద్యార్థినులకు చదవుకోవడం భారంగా మారింది. ఇంట్లో చెప్పినా బలవంతంగా కాలేజీకి పంపుతుండడంతో పారిపోవాలని అనుకున్నారు. రాజమహేంద్రవరం వెళ్లి దుస్తుల దుకాణంలో పనిచేసుకుంటూ బతకాలని వెళ్లిపోయారు. వారి సెల్‌ఫోన్ల ఆధారంగా పోలీసులు ఆ బాలికలను గుర్తించారు. వారి తల్లిదండ్రులు విదేశాలలో ఉండడంతో ఇక్కడి బంధువులకు వీరి బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో బాలికలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. సమావేశంలో సీఐ టీవీ నగేష్‌ కుమార్‌, రాజోలు, మలికిపురం ఎస్సైలు రాజశేఖర్‌, పీవీవీఎస్‌ సురేష్‌ పాల్గొన్నారు.

నల్లజర్లలో చోరీ

దేవరపల్లి: నల్లజర్లలోని ఒక ఇంట్లో దొంగలు పడి బంగారం ఆభరణాలు, నగదును దోచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నల్లజర్ల సెంటర్‌లో మెడికల్‌ షాపు మురళీకి చెందిన రెండు పోర్షన్ల ఇల్లు ఉంది. వాటిలో వల్లూరి శ్రీలక్ష్మి, వట్టికూటి వెంకటేశ్వరరావు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వారందరూ సోమవారం రాత్రి 8 గంటలకు తమ పోర్షన్లకు తాళాలు వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం 6 గంటలకు తిరిగి వచ్చే సరికి, తాళాలు పగులకొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా వెంకటేశ్వరరావు బీరువాలో 6.50 కాసుల బంగారం ఆభరణాలు, రూ.30 వేల నగదు, వెండి, శ్రీలక్ష్మి పోర్షన్‌లో సీసీ కెమెరాలు, డీవీఆర్‌ బాక్సు మాయమయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్‌ టీం వచ్చి వేలిముద్రలను సేకరించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై దుర్గాప్రసాద్‌ తెలిపారు.

పాల ట్యాంకర్‌ ఢీకొని

యువకుడి మృతి

రాజానగరం: పాల ట్యాంకర్‌ ఢీకొని యువకుడు మృతి చెందాడు. జాతీయ రహదారిపై జీఎస్‌ఎల్‌ పెట్రోలు బంకు సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లా మాకవారిపాలెం మండలం పెదపాడుకు చెందిన పైలా సత్య షణ్ముఖసాయి (22) మోటారు సైకిల్‌పై రాజమహేంద్రవరం వైపు వెళుతున్నాడు. అతడిని వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్‌ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో షణ్ముఖ సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బ్యాంకు మేనేజర్‌కు

ఐదేళ్ల జైలు, జరిమానా

విశాఖ లీగల్‌: ప్రభుత్వ సంస్థను మోసం చేసి, ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా వ్యవహరించిన బ్యాంకు మేనేజర్‌తో పాటు మరో నలుగురికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ నగరంలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పి.విజయదుర్గ మంగళవారం సంచలన తీర్పు చెప్పారు. జైలు శిక్షతో పాటు నిందితులు ఒక్కొక్కరూ రూ.1,10,000 జరిమానా చెల్లించాలని, ఒకవేళ చెల్లించని పక్షంలో అదనంగా మరో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో స్పష్టం చేశారు. ఇదే కేసులో ప్రమేయం ఉన్న మరో నలుగురికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.45,000 జరిమానా విధించారు. సీబీఐ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌ మేనేజర్‌గా పనిచేసిన చాగంటి చలపతిరావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ పూడూరు సుబ్బారావు 2010–2011 కాలంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. లకిడేపల్లిలో చేపల చెరువుల సాగు పేరుతో ఎటువంటి నిర్దిష్టమైన తనిఖీలు, సరైన పత్రాలు లేకుండానే ప్రైవేటు వ్యక్తులకు మూడు దఫాలుగా భారీగా రుణాలు మంజూరు చేశారు. అయితే క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రాజెక్టులు చేపట్టకుండానే కేవలం కాగితాలపైనే రుణాలను చూపి నిందితులు సత్తి సత్యనారాయణరెడ్డి, టి.శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి లక్షల రూపాయల బ్యాంకు నిధులను స్వాహా చేశారు. అలాగే లక్ష్మీప్రసన్న సీఫుడ్స్‌ పేరుతో మేడపాటి కనకదుర్గ ప్రసాద్‌, అతని భార్య ఝాన్సీ లక్ష్మీరాణి, చర్ల శ్రీ లక్ష్మీదేవి కూడా మరో నకిలీ ప్రాజెక్టును సృష్టించి బ్యాంకును మోసగించారు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ శిక్షలు ఖరారు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement