తొమ్మిది నెలల గర్భిణికి న్యూరో సర్జరీ
● విజయవంతంగా నిర్వహించిన
కాకినాడ వైద్యులు
● తల్లీబిడ్డా క్షేమం
కాకినాడ రూరల్: రాజోలుకు చెందిన తొమ్మిది నెలల గర్భిణికి అత్యంత క్లిష్టమైన న్యూరో సర్జరీని కాకినాడ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఆ మహిళకు 12 ఏళ్ల వయసులో తీవ్రమైన జ్వరం రావడంతో మెదడులో నీరు చేరే (హైడ్రోసెఫలస్) సమస్య ఏర్పడింది. మెదడులో చేరిన నీటిని కడుపు భాగానికి మళ్లించేందుకు వీపీషెంట్ శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు సమస్య నుంచి అప్పట్లో ఉపశమనం కలిగించారు. ప్రస్తుతం ఆమె తొమ్మిది నెలల గర్భిణి. ప్రసవానికి రోజులు దగ్గరపడుతుండగా మెదడుపై ఒత్తిడి పెరగడంతో అప్పటి సమస్య తిరిగి తలెత్తింది. తీవ్రమైన వాంతులు, తలనొప్పి, చూపు మసకబారడం వంటి సమస్యలతో ఆమె మెడికవర్ ఆస్పత్రిలో చేరింది. స్కాన్ ద్వారా మెదడులో నీటి ఒత్తిడి పెరిగినట్టు వైద్యులు గుర్తించారు. ప్రసవంతో తల్లీబిడ్డలను కాపాడేందుకు, మెదడుకు శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యులు అన్ని విభాగాల నుంచి ప్రణాళికతో ముందుకు సాగడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ వివరాలను మెడికల్ ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గైనకాలజిస్టు డాక్టర్ శ్రావణి సాక్షి, న్యూరో సర్జన్ చందు లింగోలు వెల్లడించారు. ఆస్పత్రి సెంటర్ హెడ్ శుభాకరరావు మాట్లాడుతూ 24 గంటల పాటు వైద్యులు, అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండడంతో విజయవంతంగా శస్త్రచికిత్స చేయగలిగామని, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారన్నారు. సమావేశంలో వైద్యుడు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.


