గోదావరి జిల్లాల్లోకి ఆయిల్ అక్రమ రవాణా
● యానాం నుంచి తరలిస్తున్న మాఫియా
● ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ కుడుపూడి, పెట్రోల్ బంకుల యజమానులు
అమలాపురం టౌన్: ఉభయ గోదావరి జిల్లాల్లోకి యానాం నుంచి పెట్రోలు, డీజిల్ అక్రమంగా రవాణా జరుగుతోందని, దీని అరికట్టాలంటూ జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావుతో పాటు జిల్లా పెట్రోలు బంకుల యాజమానులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీకి సమస్యను వివరించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్సీ కుడుపూడి, జిల్లా బంక్ యాజమానులు స్థానిక మీడియాతో మాట్లాడారు. యానానికి వచ్చే పెట్రోలు, డీజిల్ ధర.. ఆంధ్రా ధర కంటే దాదాపు రూ.13 నుంచి రూ.17 వరకూ తక్కువగా ఉంటుందన్నారు. దీనివల్ల అక్కడి నుంచి ఆయిల్‌కు అక్రమంగా రవాణా చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ కుడుపూడి మాట్లాడుతూ యానానికి దిగుమతి అయిన పెట్రోలు, డీజిల్ నిత్యం ఉభయ గోదావరి జిల్లాలోకి అక్రమంగా రవాణా అవుతోందన్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.కోట్లతో టాక్సుల రూపంలో ఆదాయం తగ్గుతోందన్నారు. ఈ అక్రమ రాకెట్‌ను ఓ మాఫియా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ అక్రమ ఆయిల్ మాఫియా విషయాన్ని తాను శాసన మండలిలో చర్చకు తీసుకుని వస్తానని, కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నేతలకు జిల్లా బంక్‌ల యజమానులతో కలసి త్వరలోనే అక్కడ కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. యానాం ఆయిల్స్ అక్రమ రవాణాతో బంక్‌ల నిర్వహణ, వ్యాపారాలు చేయడం కష్టంగా మారిందన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో జిల్లా పెట్రోల్ బంక్‌ల యాజమానుల బృందం ప్రతినిధులు బీవీ తిరుమలరావు, జవ్వాది తాతబాబు, కె.అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. అనంతరం అమలాపురం ఎంపీ క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఎంపీ గంటి హరీష్ మాధుర్‌కు వినతి పత్రం అందజేశారు.


