క్రీస్తు జననం శాంతికి సంకేతం
జిల్లా ప్రజలకు వైఎస్సార్ సీపీ జిల్లా
అధ్యక్షుడు చెల్లుబోయిన శుభాకాంక్షలు
రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్టియన్ మైనార్టీ సోదరులు పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. క్రీస్తు జననం శాంతికి సంకేతమని, తన జీవితం, మరణం ద్వారా లోకానికి సరైన మార్గాన్ని ఏసు ప్రభువు చూపారని తెలిపారు. ప్రేమ, కరుణకు ప్రతీక ఏసు ప్రభువని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్ సంస్థలు సేవా తత్పరతతో ముందుకు సాగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరు స్వార్థాన్ని వీడితేనే సమ సమాజ స్థాపన సాధ్యమవుతుందని తెలిపారు. సమాజంలో చెడును పక్కన పెట్టి మంచిని పెంపొందించాలని సూచించారు. ఏసుక్రీస్తు బోధనలు సన్మార్గంలో నడిచేలా చేస్తాయని పేర్కొన్నారు. ప్రపంచమానవాళికి శాంతియుతమైన, ప్రేమ పూర్వకమైన జీవన మార్గాన్ని ఉపదేశించి సమాజాన్ని సంస్కరించిన యుగకర్త ఏసు ప్రభువు అని అన్నారు. క్రీస్తు జన్మదినం సర్వ మానవాళికి పవిత్రదినం అని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.
భార్య దేవుడిచ్చిన మిత్రము
సమన్వయ సరస్వతి సామవేదం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): గృహస్థునకు భార్య దేవుడిచ్చిన మిత్రము అని ధర్మరాజు యక్షుని ప్రశ్నకు సమాధానం చెబుతాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. బుధవారం హిందూ సమాజంలో ఆయన వ్యాస భారతం 28వ రోజు ప్రవచనం కొనసాగించారు. అష్టకష్టాలలో భార్యా వియోగం ఒకటి, పురుషుని జీవితం భార్య మీద ఆధారపడి ఉన్నదని ఆయన వివరించారు. భారతీయ సారస్వతంలో భార్యకు ఉన్నతస్థానం ఉన్నదని ఆయన వివరించారు. యక్షప్రశ్నలు ఒక ఉపనిషత్తుగా స్వీకరించాలన్నారు. కర్ణుని గురించి విశ్లేషణ చేస్తూ, దానవీరశూర కర్ణ అనడం అతిశయోక్తి అని ఆయన అన్నారు. ఇంద్రుడు విప్రుని రూపంలో వచ్చి సహజ కవచ కుండలాలు యాచించినప్పుడు, దానికి ప్రతిగా శక్తిని ఇమ్మని కర్ణుడు అడిగాడు. దానానికి ప్రతిగా కోరడం వ్యాపారమవుతుంది. ఉత్తమ శ్రేణికి చెందిన దానం కాదు. వచ్చిన వాడు ఇంద్రుడేనని కర్ణునికి తెలుసు. కనుక ఇంద్రుడు కర్ణుని మోసం చేశాడనడం సరికాదని సామవేదం అన్నారు. క్షత్రియ కాంత రెండు వరాలు దాటి కోరుకోరాదని ద్రౌపది అంటుంది. మరో సాధ్వి సావిత్రి యమధర్మరాజును నాలుగు వరాలు ఎలా కోరిందని ప్రశ్న తల ఎత్తవచ్చు. యమధర్మరాజు కాలస్వరూపుడు, ధర్మస్వరూపుడు, జగత్తును నియంత్రించేవాడు, దైవం. దైవాన్ని రెండు వరాలే కోరాలన్న నియమం లేదు. ద్రౌపది క్షత్రియుడయిన ధృతరాష్ట్రుని వరాలు కోరింది కనుక, రెంటికే పరిమితమైందని అన్నారు.
జిల్లాలో 7.75 వేల టన్నుల యూరియా నిల్వలు
డీఏఓ మాధవరావు
దేవరపల్లి: జిల్లాలో ప్రస్తు తం 7.75 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్టు జిల్లా వ్యవసాయధికారి ఎస్.మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24 నుంచి రాబోవు 8 రోజులకు 2.58 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, అదనంగా సుమారు 5.17 వేల మెట్రిక్ టన్నులను సొసైటీలు, ఆర్‌ఎస్‌కేలు, మార్క్‌ఫెడ్ గోదాములు, రిటైల్, హోల్ సేల్ దుకాణాలు, కంపెనీ గోదాములలో రైతులకు అందుబాటులో ఉంచినట్టు ఆయన చెప్పారు. జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని ఆయన చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, ఎరువులను మళ్లించినా, ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయించినా లైసెన్స్ రద్దు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
వైఎస్ జగన్ వాలీబాల్ టోర్నీ
విజేతగా వైజాగ్
అమలాపురం రూరల్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎ.వేమవరం గ్రామంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రీజినల్ కో ఆర్డినేటర్ జిల్లెళ్ల రమేష్ ఆధ్వర్యంలో మూడు రోజులు జరిగిన వైఎస్ జగన్ వాలీబాల్ చాంపియన్ షిప్ విజేతగా వైజాగ్ జట్టు నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 32 జట్లు పోటీ పడగా, రన్నర్‌గా మాగం టీమ్ నిలిచింది. విజేతలకు వైఎస్సార్ సీపీ నాయకుడు కుంచే రమణారావు మొదటి బహుమతిగా రూ.25 వేల చెక్కు, ట్రోఫీ బహూకరించారు. రన్నర్‌కు మాజీ ఎంపీ, పార్టీ సీఈసీ సభ్యురాలు చింతా అనురాధ రూ.15 వేల చెక్కు ట్రోఫీ అందజేశారు.
క్రీస్తు జననం శాంతికి సంకేతం
క్రీస్తు జననం శాంతికి సంకేతం


