కోడిగుడ్డు.. ఆల్‌టైమ్ రికార్డు..
● పౌల్ట్రీ ఫామ్
● పౌల్ట్రీ వద్ద ఒక గుడ్డు ధర రూ.7.05
● రిటైల్ మార్కెట్‌లో రూ.7.50పై మాటే..
● పౌల్ట్రీ రైతుల ఆనందం
● గతంలో అత్యధిక ధర రూ.6.30 మాత్రమే
రాయవరం: కోడిగుడ్డు ధర రోజు రోజుకూ ఎగబాకుతోంది. హోల్‌సేల్‌గా పౌల్ట్రీ వద్ద 100 కోడిగుడ్లు రూ.700 వరకు ఉండగా, రిటైల్ మార్కెట్‌లో ఒక గుడ్డును రూ.7.50కు విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరల మాదిరిగానే కోడిగుడ్డు ధర నిలకడ లేకుండా పెరుగుతోంది. దీంతో ప్రతి రోజూ గుడ్డు తినే వినియోగదారులు రెండు మూడు రోజులకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో రోజుకు దాదాపుగా 1.02 కోట్ల గుడ్ల వినియోగం జరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు.
ఇతర రాష్ట్రాలకు ఎగుమతి
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక పౌల్ట్రీలు ఉన్నాయి. ప్రస్తుతం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 4 కోట్ల వరకూ పౌల్ట్రీ కోళ్లను పెంచుతున్నారు. వీటి ద్వారా రోజుకు 85 శాతం అనగా 3.40 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే గుడ్లలో దాదాపు 35 శాతాన్ని జిల్లా ప్రజలు వినియోగిస్తున్నారు. దాదాపు 2.21 కోట్ల కోడిగుడ్లను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, అసోం రాష్ట్రాలకు ఉమ్మడి జిల్లాలోని పౌల్ట్రీల నుంచి గుడ్ల ఎగుమతి జరుగుతుంది. ప్రతి రోజు జిల్లాలో 35 నుంచి 40 లారీల ద్వారా కోడిగుడ్లను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.
కలిసొచ్చిన కాలం
ప్రస్తుతం పౌల్ట్రీ రైతులకు కాలం కలిసొచ్చింది. ఇటీవల పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. ముఖ్యంగా కోళ్లకు తెగుళ్లు రావడంతో ఒడిదుడుకులకు గురైంది. ఈ సమస్యలతో దాదాపు 5 కోట్ల వరకు ఉన్న లేయర్ కోళ్ల సంఖ్య 4 కోట్లకు పడిపోయింది. దీంతో పౌల్ట్రీ యజమానులు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొన్నారు. జిల్లాలో పలు కోళ్ల ఫారాలు కూడా మూతబడ్డాయి.
మరింత పెరిగే అవకాశం
సాధారణంగా వేసవి కాలంలో, కార్తిక మాసంలో గుడ్ల అమ్మకాలు తగ్గుముఖం పడతాయి. కానీ ఈ కార్తిక మాసం ప్రారంభంలో రిటైల్‌లో ఒక కోడిగుడ్డు ధర రూ.5.44 ఉండగా, రాను రాను పెరుగుతూ నేటికి రూ.7.05కు చేరింది. ఇప్పటికిప్పుడు ఉత్పత్తి పెరగడం కష్టమని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. చికెన్ పిల్లలను పెంచి, గుడ్లు పెట్టే దశకు రావాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతోంది. అందువలన ఇప్పటికిప్పుడు ఉత్పత్తి పెరగడం సాధ్యమయ్యే పనికాదు. అదే సమయంలో శీతాకాలం కావడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో కోడిగుడ్ల వినియోగం బాగా పెరుగుతోంది. ముఖ్యంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, అసోం రాష్ట్రాల్లో వినియోగం అధికంగా ఉండడం, దీనికి తోడు మన జిల్లాలో ఉత్పత్తి అయ్యే కోడిగుడ్లకు ఆయా రాష్ట్రాల్లో డిమాండ్ ఉండడంతో కోడిగుడ్ల ధర మరికొంతకాలం నిలకడగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మున్ముంది ఒకకోడిగుడ్డు రిటైల్‌లో రూ.8 వరకూ పలకవచ్చని భావిస్తున్నారు.
ఊహించని ధర
గతంలో పౌల్ట్రీ యజమానులు ఎన్నడూ ఇంతటి ధరను చూడలేదు. ఇప్పటి వరకు ఆల్‌టైమ్ రికార్డ్ ధర పౌల్ట్రీ వద్ద రూ.6.30 గా ఉంది. ఇప్పుడు ఆ రికార్డు బద్ధలైంది. ప్రస్తుతం పౌల్ట్రీ వద్ద హోల్‌సేల్‌గా 100 కోడిగుడ్లను రూ.750కు విక్రయిస్తున్నారు. సాధారణంగా కోడిగుడ్డు ధర రూ.5 ఉంటేనే పౌల్ట్రీ వ్యాపారం నిలదొక్కుకోగలుగుతుందని పౌల్ట్రీ రైతులుచెబుతున్నారు.
ధర పెరగడానికి కారణాలివే..
కోడిగుడ్ల ధర పెరగడానికి పలు కారణాలున్నాయి. కోళ్లకు జబ్బులు రావడంతో లేయర్ కోళ్ల సంఖ్య తగ్గి, గుడ్ల ఉత్పత్తి తగ్గినట్లుగా పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. శీతాకాలంలో సహజంగా గుడ్ల ఉత్పత్తి 10 నుంచి 15 శాతం తగ్గుతుంది. ఇలా ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతో సహజంగానే కోడిగుడ్లకు ధర పెరిగింది. దేశ వ్యాప్తంగా కూడా కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గడం కూడా ప్రస్తుతం ఇక్కడి పౌల్ట్రీ పరిశ్రమకు ఊరటనిచ్చింది.
కోడిగుడ్డు.. ఆల్‌టైమ్ రికార్డు..


