విరి విలాపం | - | Sakshi
Sakshi News home page

విరి విలాపం

Dec 25 2025 8:17 AM | Updated on Dec 25 2025 8:17 AM

విరి

విరి విలాపం

పూలు.. ఎంత అందమైనవో.. ఎంత సుకుమారమైనవో.. అంత సున్నితమైనవి. పాపం పూలు.. ఉదయిస్తూనే స్వామి సేవకో.. దేవి కొప్పులోకో చేర్చి జన్మను సార్థకం చేయమని వేనోళ్ల ప్రార్థిస్తాయి. రేయి గడిస్తే వసి వాడిపోయి.. సుగంధాలు వీడిపోయి.. కళావిహీనమై చెత్తపాలవుతాయి. నాటి జంధ్యాల పాపయ్య శాస్త్రి ఖండకావ్యం పుష్ప విలాపంలో ‘మా కుత్తుకలు కోసి మా ప్రాణం తీయవద్ద’ని ప్రార్థించిన పూలు.. నేడు మమ్మల్ని చరితార్థులను చేయమని దేవుని అభ్యర్థిస్తున్నాయి. మమ్ములనే నమ్ముకుని జీవిస్తున్న వనమాలి జీవితాన్ని మూడు పువ్వులు ఆరు రూకలుగా వర్ధిల్లజేయమని వినమ్రంగా అర్థిస్తున్నాయి. వనంలో మేము.. వ్యాపారంలో మాలి ఎవరూ లాభపడక ఏం ఉపయోగమని ప్రశ్నిస్తున్నాయి. మాకిచ్చిన అల్పాయువును తోటమాలికి పోసి వారి జీవితాన్ని వికసింపజేయమని ముకుళిత హస్తాలతో వేడుకుంటున్నాయి.

పెరవలి: మార్కెట్‌లో పూల ధరలు పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది మూఢం ముందే రావడంతో శుభ ముహూర్తాలు లేక వినియోగం తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీని వల్ల రైతులకు నష్టం వస్తుంటే పూలతోటలపై ఆధారపడిన కూలీలకు పనులు లేక ఉపాధి కరువై విలవిలలాడుతున్నారు. జిల్లాకు తలమానికంగా ఉన్న కడియం, కాకరపర్రు పూల మార్కెట్లు నేడు కొనుగోలుదారులు లేక కళావిహీనంగా కనిపిస్తున్నాయి. వ్యాపారులకు విక్రయాలు లేక.. దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర లేక.. కూలీలకు ఉపాధి దొరకక.. రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం శుభ మూహుర్తాలు, పండుగలు లేకపోవటం వలన పూల వినియోగం తక్కువగా ఉందని వ్యాపారులు చెప్తున్నారు. 20 రోజుల క్రితం చామంతి కిలో రూ.300, కాగడాలు కిలో రూ.900, కనకాంబరాలు రూ.1200 పలికితే నేడు పూల రకాలు, నాణ్యతను బట్టి కిలో రూ.20 నుంచి రూ.150కి కొనుగోలు చేస్తున్నారని రైతులు చెప్తున్నారు. రైతులు మార్కెట్‌కు పట్టుకువచ్చిన పూలు రెండు మూడు రోజుల వరకు విక్రయాలు జరగకపోవడంతో వ్యాపారుల దగ్గరే రెండు నుంచి మూడు రోజులు నిల్వ ఉండిపోతున్నాయి. నాలుగు రోజులు దాటితో పూలు వసి వాడిపోయి రోడ్డు పక్కన పాడేయాల్సిన పరిస్థితి నెలకొందని వ్యాపారులు వాపోతున్నారు. వాతావరణం అనుకూలించడంతో పూల దిగుబడి చాలా బాగుందని, మార్కెట్‌లో పూల ధరలు లేకపోవటం వల్ల వారానికి రెండు కోతలు కోయాల్సిన పూలు నేడు ఒక్కకోతే కోస్తున్నామని రైతులు చెప్తున్నారు. తీరా కోసిన తరువాత కనీసం కూలీల ఖర్చులు కూడ రావడం లేదని, దీంతో కోయకుండానే నష్టపోతున్నామని రైతులు చెప్తున్నారు. పూల రైతులు గ్రామాల బాట బట్టి కిలో పూలు సమయాన్ని బట్టి రూ.30 నుంచి రూ.50కి విక్రయిస్తున్నారు. మార్కెట్లకు పూలను తీసుకువెళ్తుంటే వ్యాపారులు కొనుగోలు చేయడం లేదని.. దీంతో మళ్లీ తామే తమ గ్రామాలకు తీసుకువెళ్లి వచ్చినకాడికి విక్రయిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో పూలసాగు ఇలా..

జిల్లాలో 4897 ఎకరాల్లో పూల సాగు చేస్తుంటే దీనిపై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. పూలకు మార్కెట్‌లో ధరలు పలకకపోవడం వల్ల సగానికి సగం మందికి ఉపాధి కరువైయ్యిందని రైతులు అంటున్నారు. చిరు వ్యాపారులు సైతం తమకు కనీసం కూలి ఖర్చులు రావడం లేదని వాపోతున్నారు.

నాడు కళకళ నేడు వెలవెల

రైతులు, వ్యాపారులతో కళకళలాడే కాకరపర్రు పూల మార్కెట్‌ నేడు వెలవెలబోతోంది. శుభమూర్తాలు, పండగలు లేకపోవడంతో పూల వినియోగం భారీగా తగ్గిపోయింది. దీనితో పూలధరలు హఠాత్తుగా తగ్గిపోయి రైతులు విలవిలలాడుతున్నారు.

పనులు లేక ఇబ్బంది

పూల కోతలు, పూల తోటలకు ఎరువులు, పురుగు మందులు కొట్టే కూలీలకు, దండలు కట్టే కూలీలకు, చిరు వ్యాపారాలు చేసే సైకిల్‌ వ్యాపారులకు పని అంతంతమాత్రంగా లభించడంలో వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నిత్యం పూలు కోసే కూలీలకు వారానికి ఒక్కరోజు మాత్రమే పనులు లభిస్తుంటే, పూల దండలు కట్టే మహిళలు పనులు లేక అల్లాడిపోతున్నారు.

ధరలు తగ్గటానికి కారణాలు

ఈ ఏడాది ఊహించని విధంగా ముందుగానే మూఢం రావడంతో శుభ ముహర్తాలు లేకపోవటం వల్ల ధరలు పతనమయ్యాయి. ఏటా సంక్రాంతి వెళ్లిన తరువాత మార్చి వరకు ముహూర్తాలు ఉండేవి కావు. కానీ ఈ ఏడాది డిసెంబర్‌లోనే మూఢం రావల్ల వలన ధరలు తగ్గాయి. అదే సమయంలో ఎటువంటి పండగలు లేకపోవడం మరో ఇబ్బంది. దీనితో పూల వినియోగం హఠాత్తుగా పడిపోయింది.

కాకరపర్రులో

లిల్లీ పూల తోట

అన్నవరప్పాడులో ఆటోలో పూలు అమ్ముతున్న రైతు

తోటలోనే మగ్గిపోతున్న పూలు

పూలధరలు తగ్గడంతో వాటిని కోయకుండా రైతుల చేలల్లోనే వదలేస్తున్నారు. ఎందుకంటే కోయిస్తే కనీసం కూలీ ఖర్చులు కూడా రావటం లేదని, దీనితో పూల కోసేకంటే వదిలేయడమే మేలని చెప్తున్నారు. నిత్యం పదిమందితో పూలు కోయించే రైతులు నేడు వారానికి ఒక్కసారి మాత్రమే కోయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు బంతి పూలు ఒక్కకోతకు 10 కూలీలు అవసరం వస్తే వీరికి రోజుకు రూ.350 కూలి ఇవ్వాలి. మార్కెట్‌లో కిలో పూలు రూ.20 పలుకుతున్నాయి. ఒక్క కోతకు సుమారు 100 కిలోలు కోయిస్తే కూలీలకు రూ.3500, కాఫీ, టిఫిన్లు, సంచులు, రవాణా కలిపి రూ.వెయ్యి ఖర్చు అవుతుంది. దీనితో పూలకు మార్కెట్‌లో వంద కిలోలకు రూ.రెండు వేలు వస్తే ఖర్చు రూ.4500 అవుతోందని రైతులు చెప్తున్నారు. అందుకే పూలను కోయకుండా వదలివేస్తున్నామని వాపోతున్నారు. అన్ని రకాల పూల సాగు పరిస్థితీ ఇలానే ఉందని రైతులు అంటున్నారు.

మార్కెట్‌లో ధరలు ఇలా..

పూల మార్కెట్‌లో 20 రోజుల వ్యవధిలో ధరలు పరిశీలిస్తే సగానికి సగం పడిపోయాయి.

పూల రకం 20 రోజుల ప్రస్తుత

క్రితం (రూ.) ధర (రూ.)

బంతి పూలు 80 20

చామంతి 300 30-50

గులాబీలు 250 140

లిల్లీ పూలు 300 80

కాగడాలు 900 400

కనకాంబరాలు 1200 600

వచ్చింది కూలీలకే సరిపోతోంది

ఒక ఎకరంలో కాగడాలు తోట వేశాను. 20 రోజుల క్రితం వరకు కిలో రూ.900కు విక్రయించగా నేడు రూ.400కు పడిపోయింది. కాగడాల కోతకు 10 మంది కూలీలు అవసరం. 10 కిలోలు పూలు కోస్తున్నారు. మర్కెట్‌కు తీసుకువెళ్తే రూ.4 వేలు వస్తోంది, వచ్చిన సొమ్ము కూలీలకే సరిపోతోంది.

– మానేపల్లి శ్రీనివాస్‌, పూల రైతు, కాకరపర్రు

కోయకపోతే చేను.. కోస్తే నేను నష్టపోతాం

ఒక ఎకరంలో చామంతి తోట వేశాను. పూల దిగుబడి బాగుంది. రోజు విడిచి రోజు కోత కోసే వాడిని కానీ ధరలు పతనం కావడంతో వచ్చిన సొమ్ము కోత ఖర్చులకు కూడ రావటం లేదు. పూలు కోయకపోతే చేను పాడైపోతుంది, కోస్తే జేబులో సొమ్ములు ఇవ్వాల్సి వస్తోంది. ఏం చేయాలో తెలియడం లేదు.

– ఇంటి నారాయుడు, చామంతి రైతు, కాకరపర్రు

అదనపు పెట్టుబడి వృథా

ఈ ఏడాది పూల దిగుబడి చాలా బాగుంది. నాలుగు రూపాయలు వస్తాయనుకున్నాను. కానీ మార్కెట్‌లో ధర పతనం కావడంతో గిట్టుబాటు కావడం లేదు. ఆదాయం రావాల్సిన సమయంలో అదనపు పెట్టుబడి పెట్టి నష్టాల పాలవుతున్నాం.

– గుడాల వెంకటేశ్వరరావు, పూల రైతు కాకరపర్రు

విరివిగా పూసినా సిరులు అంతంతే

ధరలు లేక మందగించిన వ్యాపారాలు

గగ్గోలు పెడుతున్న రైతులు

పనులు లేక కూలీలు..

ఉపాధి దొరక్క పనివారు విలవిల

జిల్లాలో 4897 ఎకరాల్లో పూల సాగు

ప్రత్యక్షంగా, పరోక్షంగా

15వేల మందిపై ప్రభావం

విరి విలాపం1
1/7

విరి విలాపం

విరి విలాపం2
2/7

విరి విలాపం

విరి విలాపం3
3/7

విరి విలాపం

విరి విలాపం4
4/7

విరి విలాపం

విరి విలాపం5
5/7

విరి విలాపం

విరి విలాపం6
6/7

విరి విలాపం

విరి విలాపం7
7/7

విరి విలాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement