ముస్లిం సంపదను ఐటీ పార్కుకు ఇస్తారా?
వైఎస్సార్ సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిది మీర్జా మౌలా అలీ
రాజమహేంద్రవరం రూరల్: ముస్లింల సంపద అంజుమన్–ఏ ఇస్లామియ సంస్థ ఆస్తులను చంద్రబాబు సర్కారు ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే ప్రయత్నం దారుణమని, దానిని వెంటనే విరమించుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి మీర్జా మౌలా అలీ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. 1915వ సంవత్సరంలో అంజుమన్–ఏ ఇస్లామియా సంస్థకు చిన్న కాకానిలో సర్వే నంబర్ 187/1, 201/ఏ,బి, 201/2బి, 202/బి, 203/ఏ,బి, 204/ఏ, సి అండ్ డి, 222/2 ఏ, అండ్ 2బి నంబర్లలోగల 81.23 ఎకరాల భూమిని ముస్లిం సమాజ అభ్యున్నతి కోసం దాతలు ఇచ్చారని, దానికి సంబంధించి పత్రాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. ముస్లింలకు స్కిల్ డెవలప్‌మెంట్ కోసం, లైబ్రరీ, ముస్లిం పిల్లలకు స్కాలర్ షిప్‌ల కోసం, ముస్లింలకు విధ్యా సంస్థల కోసం ఈ భూమిని అప్పగించారన్నారు. వక్ఫ్ బోర్డుకు ఐటీ శాఖ మంత్రి ఓఎస్‌డీ, పర్సనల్ పిఏ వక్ఫ్‌బోర్డుకు ఈ 81.23 ఎకరాల భూమిలో 71.57 ఎకరాల భూమిని ఐటీ పార్క్ కోసం ఇవ్వాల్సిందిగా కోరారని, దీంతో రాష్ట్ర వక్ఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), వక్ఫ్ బోర్డు చైర్మన్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎందుకంత హడావుడిగా వక్ఫ్‌బోర్డు కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. కమిటీకి ఇష్టం లేకపోయినా బలవంతంగా సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసిందని తెలిపారు.
దీనికి కలెక్టర్ స్వయంగా పచ్చ మీడియాకు టెండర్లు పిలుస్తూ ప్రకటనలు ఇవ్వడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ భూముల జోలికి రాకుండా ముస్లిం సమాజ అభ్యున్నతికి పాటుపడాలన్నారు. దీని వెనుక ఉన్న వక్ఫ్‌బోర్డు సీఈఓపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలని, కమిటీకి సూత్రధారిగా వ్యవహరిస్తున్న తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌పై చర్యలు తీసుకుని వక్ఫ్ ఆస్తులను కాపాడాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకుంటే వైఎస్సార్ సీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.


