వీరేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణంపై గ్రామసభ
ఐ.పోలవరం: మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి కంచి స్వామీజీ సలహాలు, సూచనలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నట్లు ఆలయ అర్చకుడు యనమండ్ర సత్య సీతారామశర్మ తెలిపారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు అధ్యక్షతన ఆలయ ఆవరణలో మంగళవారం గ్రామ సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని కోరారు. స్వామి, అమ్మవార్ల మూల విరాట్‌ను కదిలించకుండా నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్, ఈవో వి.సత్యనారాయణ మాట్లాడుతూ పునర్నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు ఆహ్వానించామన్నారు. అలాగే 2026 ఫిబ్రవరి 15న జరిగే మహాశివరాత్రి ఏర్పాట్లపై చర్చించారు.
ఉత్సాహంగా ముగిసిన టీచర్స్ గేమ్స్
కొత్తపేట: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, జెడ్పీ బాలికోన్నత పాఠశాలల క్రీడా మైదానాల్లో రెండు రోజులు జరిగిన జిల్లా స్థాయి టీచర్స్ గేమ్స్ మంగళవారం సాయంత్రం ముగిశాయి. మహిళల త్రోబాల్‌లో పి.గన్నవరం మండలం, పురుషుల క్రికెట్‌లో ఉప్పలగుప్తం మండలం విజేతలుగా నిలిచాయి. ఈ సందర్భంగా సాయంత్రం డీవైఈఓ పి.రామ లక్ష్మణమూర్తి అధ్యక్షతన జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఎంపీపీ గంగాధరరావు, జెడ్పీటీసీ సభ్యురాలు గూడపాటి రామాదేవి, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మిద్దే ఆదినారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. క్రికెట్ విజేతలకు మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ వీరవల్లి శ్రీనివాస్ తన తల్లి జ్ఞాపకార్థం ట్రోపీలు సమకూర్చారు. అక్కిరెడ్డి సూర్యనారాయణ, కోలా సురేష్, తొత్తుపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కొపెల్ల భాస్కరశాస్త్రి షీల్డ్‌లు అందించారు. కార్యక్రమంలో ఎంఈఓ మట్టపర్తి హరిప్రసాద్, జిల్లా సమగ్ర శిక్షా కోఆర్డినేటర్ డిప్యూటీ కలెక్టర్ జి.మమ్మీ పాల్గొన్నారు.
వీరేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణంపై గ్రామసభ


