ఆవుదూడపై కుక్కల దాడి
అమలాపురం టౌన్: సుమారు ఐదు నెలల వయసున్న జెర్సీ ఆవుదూడపై కుక్కలు దాడి చేశాయి. ఏకంగా ఆ దూడ ఎడమ చెవిని పూర్తిగా తినేశాయి. అలాగే దాని శరీరంపై పలు చోట్ల తీవ్రంగా గాయాలు చేశాయి. ఇలా పాణప్రాయస్థితిలో ఉన్న ఆవు దూడను గుర్తు తెలియని వ్యక్తులు అమలాపురంలోని ప్రాంతీయ పశువైద్యశాల వద్ద మంగళవారం ఉదయం వదిలేసి వెళ్లిపోయారు. ఆస్పత్రి ప్రధాన వైద్యుడు, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎల్.విజయరెడ్డి తీవ్రంగా గాయపడిన ఆ ఆవుదూడకు తక్షణమే వైద్యం అందించారు. అనంతరం కోలుకుంటున్న దూడను ప్రస్తుతానికి అమలాపురం రూరల్ మండలం ఇమ్మిడివరప్పాడు రైతు మారి భేతాళస్వామి సంరక్షణలో ఉంచారు. ఆవుదూడకు చెందిన సంబంధిత రైతు.. అమలాపురం ప్రాంతీయ పశువైద్యశాలను సంప్రదించాలని డాక్టర్ విజయరెడ్డి కోరారు.
భర్త మృతి చెందిన వారానికే భార్య కన్నుమూత
కడియం: భర్త మృతి చెందిన వారం రోజులకే భార్య కూడా మృతి చెందిన ఘటన బుర్రిలంకలో జరిగింది. గ్రామానికి చెందిన శివరామ నర్సరీ రైతు, శివరామ ఫ్లవర్ మర్చంట్స్ వ్యవస్థాపకుడు పాటంశెట్టి రామారావు (98) ఈ నెల 15న వృద్ధాప్యంతో కన్ను మూశారు. ఆయన దశదిన కార్యక్రమాలను నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే భర్త మరణించిన నాటి నుంచి తీవ్ర దుఖంలో కూరుకుపోయిన ఆయన భార్య వెంకటలక్ష్మి (90) మంగళవారం ఉన్నట్టుండి ప్రాణాలు విడిచారు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. వారం వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ కన్నుమూయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వీరికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్ట్
కె.గంగవరం: కోటిపల్లి శివారు ఏటిగట్టు వద్ద గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను కె.గంగవరం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై జి.సోమేంద్ర మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కోటిపల్లి శివారు ఏటిగట్టు రహదారి వద్ద గంజాయిని రవాణా చేస్తున్నారనే సమాచారంతో ఎస్సై, సిబ్బంది అక్కడకు వెళ్లారు. వీరి వాహనాన్ని చూసి పారిపోతున్న ఇద్దరు యువకులను పట్టుకున్నారు. వారిలో బ్రహ్మపూరి గ్రామానికి చెందిన కుమార స్వామి నుంచి 50 గ్రాముల గంజాయి, మోటారు సైకిల్, యానానికి చెందిన వెంకట కార్తిక్ నుంచి 130 గ్రాముల గంజాయి, రూ.2500 స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
ఆవుదూడపై కుక్కల దాడి
ఆవుదూడపై కుక్కల దాడి


