రెండు తాటాకిళ్లు దగ్ధం
రూ.5 లక్షల ఆస్తినష్టం
పి.గన్నవరం: మండలంలోని పోతవరం శివారు మాతావారిపేటలో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరొక డాబా ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. మొత్తం ఐదు కుటుంబాల వారు నిరాశ్రయులు కాగా, రూ.5 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్టు స్థానికులు చెబుతున్నారు. మాతా చంద్రరావు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్ల మంటలు చెలరేగడంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆ మంటలు పక్కనే ఉన్న మాతా శ్రీరాములు ఇంటికి వ్యాపించి, అతడి ఇల్లు కూడా అగ్నికి ఆహూతైంది. పక్కనే ఉన్న మాతా వెంకట్రావుకు చెందిన డాబా ఇల్లు దెబ్బతింది. అర్ధరాత్రి ఇళ్లల్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో బాధితులంతా కట్టుబట్టలతో ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రమాదం నుంచి బయట పడ్డారు. చంద్రరావు ఇంట్లో నివసిస్తున్న అతడి కుమారులు శ్రీనుబాబు, రాంబాబు కుటుంబాలవారు కూడా నిరాశ్రయులయ్యారు. ఇళ్లలోని సామాన్లు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, విద్యార్థుల సర్టిఫికెట్లు సర్వం కాలిపోవడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. చంద్రరావు కోడలు పద్మ ఇటీవల కువైట్ నుంచి వచ్చింది. ఆమె ఇల్లు కట్టుకుందామని తెచ్చుకున్న రూ.90 వేలు, బంగారు వస్తువులు కాలిపోవడంతో బోరున విలపించింది. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని బాధితులు విలపించారు. అమలాపురం అగ్నిమాపక కేంద్ర సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేశారు. బాధిత కుటుంబాలకు రెవెన్యూ అధికారులు బియ్యం పంపిణీ చేశారు. సర్పంచ్ వడలి కొండయ్య, వీఆర్వో పద్మావతి సహాయక చర్యలు చేపట్టారు. తహసీల్దార్ పి.శ్రీపల్లవి, ఆర్‌ఐ వెన్నపు డాంగే, గిడ్డి ఆనంద్ బాధిత కుటుంబాలను పరామర్శించారు.


