చోరీలు, చైన్ స్నాచింగ్‌లలో ఆరితేరారు
● పోలీసులకు చిక్కిన ముగ్గురు నిందితులు
● అంతర్రాష్ట్ర స్థాయిలో కేసులు నమోదు
● 4 కేసుల్లో రూ.35.5 లక్షల సొత్తు రికవరీ
అమలాపురం టౌన్: అమలాపురం టౌన్, రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట పోలీస్ స్టేషన్ల పరిధుల్లో జరిగిన పలు చోరీ కేసుల్లో నిందితులు ముగ్గురు పోలీసులకు చిక్కారు. అమలాపురం టౌన్‌లో చోరీకి పాల్పడిన దొంగ 70 కేసుల్లో సంబంధం ఉన్న అంతర్రాష్ట్ర నేరగాడు. కొత్తపేటలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డ మరో అంతర్రాష్ట దొంగ, రావులపాలెం, ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ల పరిధుల్లో పలు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన నిందితుడు పోలీసులకు వేర్వేరుగా దొరికిపోయారు. వీరి నుంచి ఆ నాలుగు పోలీస్ స్టేసన్ల సీఐలు, ఎస్సైలు మొత్తం రూ.35.5 లక్షల సొత్తును రికవరీ చేశారు. ఎస్పీ రాహుల్ మీనా స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
‘అమలాపురం’ అంతర్రాష్ట దొంగ 70 చోరీలు:
అమలాపురం పట్టణం కొంకాపల్లికి చెందిన పతివాడ లోవరాజు (31) అంతర్రాష్ట దొంగ. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల రెండు చోరీలు, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, తెలంగాణ రాష్ట్రం హయత్‌నగర్‌లో ఒక చోరీకి పాల్పడ్డాడు. అతడి నుంచి 185 గ్రాముల బంగారం, 1750 గ్రాముల వెండి, ఒక బైక్‌ను మొత్తం రూ. 25 లక్షల సొత్తును రికవరీ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 70 చోరీ కేసులు అతనిపై ఉన్నాయి. తాళాలు వేసి ఇళ్లను తలుపులను ఐరెన్ రాడ్‌తో బద్దలు కొట్టడంలో అతడు దిట్ట.
చైన్ స్నాచర్ నుంచి రూ.6 లక్షల రికవరీ:
రావులపాలెం, ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ల పరిధుల్లో రోడ్లపై నడిచి వెళుతున్న మహిళల మెడల్లో బంగారు నగలను పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సీతలం కొండేపాడుకు చెందిన చైన్ స్నాచర్ కవురు మూర్తి (24)ని అరెస్ట్ చేశారు. రావులపాలెం, ఆత్రేయపురం పోలీసులు ఇతడిని వేర్వురుగా అరెస్ట్‌లు చూపారు. అతడి నుంచి 49.800 గ్రాముల బంగారు నగలు, ఒక బైక్‌ను మొత్తం రూ. 6 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు.
కొత్తపేటలో మరొకరి అరెస్టు
కొత్తపేట బ్యాంక్ కాలనీలో ఓ ఇంట్లో పట్టపగలు చోరీకి పాల్పడ్డ అంబాజీపేట మండలం పుల్లేటికుర్రుకు చెందిన గంటి గౌతమ్ అంతర్రాష్ట్ర దొంగ. అతడు కూడా ఇంటి తాళాలను పగలగొట్టడంతో ఆరితేరాడు. అతడి నుంచి 39 గ్రాముల బంగారంతో మొత్తం రూ4.5 లక్షల సొత్తును రికవరీ చేశారు.
పోలీసులకు అభినందన, రివార్డులు
ఈ చోరీ కేసుల్లో దొంగలను చాకచక్యంగా పట్టుకుని రూ.35 లక్షలకు పైగా సొత్తు రికవరీ చేసిన పోలీసు అధికారులను ఎస్పీ మీనా అభినందించారు. అమలాపురం, కొత్తపేట డీఎస్పీలు టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, సుంకర మురళీమోహన్, అమలాపురం టౌన్, రావులపాలెం రూరల్, క్రైమ్ సీఐలు పి.వీరబాబు, విద్యాసాగర్, ఎం.గజేంద్రకుమార్, కొత్తపేట, ఆత్రేయపురం ఎస్సైలు సురేంద్ర, రాము, క్రైమ్ ఏఎస్‌ఐ అయితాబత్తుల బాలకృష్ణ, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.


