కవులు అభ్యుదయ రచనలు చేయాలి
● శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కత్తిమండ
● ఘనంగా జాతీయ శతాధిక కవి సమ్మేళనం
అమలాపురం టౌన్: సామాజిక చైతన్యంతో, అభ్యుదయ భావాలతో కవిత్వం రాయాలని శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ కవులకు పిలుపునిచ్చారు. శ్రీశ్రీ కళా వేదిక జిల్లా శాఖ. కోనసీమ రచయితల సంఘం, జిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అమలాపురం పట్టణం వడ్డిగూడెంలోని వేమన కోనసీమ రెడ్డి జన సమైక్య కమ్యూనిటీ హాలులో ఆదివారం జరిగిన 160వ జాతీయ శతాధిక కవి సమ్మేళనానికి డాక్టర్ ప్రతాప్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. కవి సమ్మేళనంతో పాటు, పాటల స్వర వేదిక కూడా రస రమ్యంగా జరిగింది. రాజమహేంద్రవరం కమాండర్ ఏపీ ఎస్‌పీఎఫ్ ఎస్పీ డాక్టర్ కొండా నరసింహారావు దంతపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని వారి శంఖారావంతో సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కత్తిమండ సేవలను నరసింహారావు కొనియాడారు. మరో ముఖ్య అతిథి నిడదవోలు శ్రీశ్రీ కళా వేదిక ప్రతినిధి అరవెల్లి నరేంద్ర 160 సమ్మేళనాలు నిర్వహించడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి 126 మంది కవులు హాజరై తమ కవితా గానాలను వినిపించారు. అలాగే 30 మంది వివిధ కళలకు చెందిన కళాకారులు పాల్గొని తమ కళలను ప్రదర్శించారు. తొలుత మహా కవులు శ్రీశ్రీ, బోయి భీమన్న, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటాలకు వారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేదిక జిల్లా అధ్యక్షుడు, కవి నల్లా నరసింహమూర్తి రచించిన నడక విజయం పుస్తకాన్ని డాక్టర్ నరసింహరావు దంపతులు ఆవిష్కరించారు. అలాగే విశాఖపట్నానికి చెందిన కవి డాక్టర్ ఆర్.మణి భూషణం రచించిన చందనోత్సవం ఏఐ గీతాన్ని నల్లా నరసింహమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవులను వేదిక తరఫున సత్కరించారు. అలాగే డాక్టర్ ప్రతాప్, వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.పార్థసారధి, ఎస్పీ డాక్టర్ నరసింహరావు దంపతులను కోనసీమ రచయితల సంఘం అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయణ, వేదిక జాతీయ కార్యదర్శి మాకే బాలార్జున సత్యనారాయణ ఘనంగా సత్కరించారు. సభకు వ్యాఖ్యాతగా బాలార్జున సత్యనారాయణ వ్యవహరించారు. ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ సబ్బెళ్ల మహాలక్ష్మి సమ్మేళనం వివరాలను నివేదించారు.


