రజకులను ఎస్సీల్లో చేర్చాలి
● రజకులకు రక్షణ చట్టం చేయాలి
● పలువురు వక్తలు డిమాండ్
● ముమ్మిడివరంలో రజక ఆకాంక్ష సభ
ముమ్మిడివరం: వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మాదిరిగా రాష్ట్రంలో కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, వారి రక్షణకు చట్టం చేయాలని జిల్లా రజకులు ఆకాంక్ష సభ–4 సమావేశం తీర్మానించింది. ముమ్మిడివరం డీఎల్‌ఎఫ్ సంక్షన్ హాలులో ఆదివారం ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సి.సావిత్రి అధ్యక్షతన ఈ సభ నిర్వహించారు. సభలో వక్తలు మాట్లాడుతూ 50 ఏళ్లు నిండిన రజకులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, జీవో 27 ప్రకారం ధోబి పోస్టులను రజకుల తోనే భర్తీ చేయాలని తీర్మానించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్మే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ రజకుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తామన్నారు. మరో ముఖ్య అతిథి శాసన మండలి ఉప సభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజంలోని మురికిని వదల గొట్టడానికి రజకులంతా చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత ముమ్మిడివరంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రజకులు భారీ ర్యాలీ చేశారు.


