పెళ్లిళ్ల పేరయ్య పేరిట టోకరా! | - | Sakshi
Sakshi News home page

పెళ్లిళ్ల పేరయ్య పేరిట టోకరా!

Jun 18 2024 2:28 AM | Updated on Jun 18 2024 12:54 PM

పెళ్ల

పెళ్లిళ్ల పేరయ్య పేరిట టోకరా!

రూ.కోటికి ఎగనామం

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

ఆలమూరు: పెళ్లి సంబంధాలు కుదుర్చుతానంటూ అమాయక ప్రజలను నమ్మించి రూ.కోటి వరకూ ఓ వ్యక్తి టోకరా వేసిన ఘటన ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారంలో జరిగింది. పెళ్లిళ్ల పేరయ్య అవతారమెత్తి వయసుకు వచ్చిన యువతకు, కొంచెం లోపాలు ఉన్నవారికి పెళ్లి సంబంధాలు చూస్తానంటూ రూ.లక్షల విలువైన బంగారం, నగదు స్వాహా చేసిన వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకూ ఆరుగురు బాఽధితులు వెలుగులోకి రాగా అనేక మంది మోసపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మూలస్థాన అగ్రహారానికి చెందిన యర్రంశెట్టి దుర్గయ్య దివ్యాంగుడు. అతను పెళ్లి సంబంధాలు చూసే దళారీగా అవతారమెత్తాడు.

 ఇదే క్రమంలో గ్రామంలో దొడ్డా రాంబాబు, వరలక్ష్మి దంపతుల కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తానంటూ నమ్మబలికాడు. వధువు కుటుంబానికి కొంత నగదు అవసరమంటూ దశల వారీగా రూ.20 లక్షల వరకూ తీసుకున్నాడు. దీంతో పాటు రాంబాబు కుటుంబ సభ్యుల వద్ద సుమారు రూ.12 లక్షల విలువైన 20 కాసుల బంగారాన్ని కూడా తన మాయమాటలతో స్వాహా చేశాడు. ఆ బంగారం ఆ ఆశ చూపి, తక్కువకు వస్తుందంటూ గ్రామానికి చెందిన విజయ, నవాబుపేటకు చెందిన సింగంశెట్టి సురేష్‌ను నమ్మించాడు. విజయ వద్ద రూ.5.5 లక్షలు, సురేష్‌ వద్ద రూ.4.10 లక్షలు తీసుకుని మాట మార్చేశాడు. 

దీంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనేక మంది వద్ద రూ.లక్షలు తీసుకోవడంతో స్వాహా చేసిన సొమ్ము రూ.కోటి పైనే ఉంటుందని సమాచారం. పెళ్లి సంబంధాలకు సంబంధించి అవతలి వారు ఒప్పుకున్నారని ఇతరులతో డమ్మీ ఫోన్లు చేయించేవాడు. జల్సాలకు అలవాటు పడిన దుర్గయ్య స్వాహా చేసిన సొమ్మును అంతా విలాసాలకు ఖర్చు చేశాడు. పెళ్లి సంబంధాలు చూస్తున్నానంటూ కాలయాపన చేస్తున్న దుర్గయ్య ప్రవర్తనపై బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో వారంతా సోమవారం దుర్గయ్య ఇంటికి వెళ్లి అతని భార్య రాణి, తల్లి వెంకాయమ్మ, సోదరుడు మురళీని నిలదీయగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితులంతా ఆలమూరు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఎస్సై ఎల్‌.శ్రీను నాయక్‌కు ఫిర్యాదు చేశారు.

జల్సాలకు అలవాటు పడి..
మాయమాటలతో బాధితులను నమ్మించి స్వాహా చేసిన సొమ్మును అనతికాలంలోనే దేశమంతా తిరిగి జల్సాలకు, విలాసాలకు ఖర్చు చేశాడని భార్య రాణి పోలీసులకు వివరించింది. తన భర్త పెళ్లి సంబంధాల పేరిట డబ్బులు తీసుకున్నది వాస్తవమేనన్నారు. సోదరుడు మురళీ, తల్లి వెంకాయమ్మ ప్రోద్భలంతో స్వాహా చేసిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేశాడని తెలిపింది. ఇలాంటివి వద్దని పలుమార్లు చెప్పినా పట్టించుకోకుండా చేతిలో ఉన్న డబ్బును చూసి విచ్చలవిడిగా ఖర్చు చేశాడంది.

 ఈ సొమ్ము దుర్వినియోగంలో కొంత భాగం సోదరుడు, తల్లి ప్రమేయం ఉందని ఆరోపించింది. భార్య, ఇద్దరు పిల్లలను పట్టించుకోకుండా పెళ్లి సంబంధాల పేరిట తీర్థయాత్రలు, విలాసవంతమైన ప్రాంతాలకు వెళ్లేవాడంది. ఇప్పటి వరకూ తమకు సొంత ఇల్లు కూడా లేదని, అద్దె ఇంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నామని ఆమె పేర్కొంది. ప్రస్తుతం తన భర్త దుర్గయ్య ఒక్క పైసా కూడా లేకుండా ఖర్చు చేశాడని వివరించింది.

బాధితులకు న్యాయం చేస్తాం..
పెళ్లి సంబంధాల పేరిట మోసపోయిన బాధితులందరికీ తగిన న్యాయం చేస్తామని ఎస్సై శ్రీను నాయక్‌ భరోసా ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేస్తున్నామని, విచారణ జరిపి నిందితుడు దుర్గయ్యతో పాటు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుంటామన్నారు. స్వాహా చేసిన నగదు, బంగారాన్ని రికవరీ చేసేందుకు చర్యలు తీసుంటామని అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement