breaking news
marriage brokers
-
పెళ్లిళ్ల పేరయ్య పేరిట టోకరా!
ఆలమూరు: పెళ్లి సంబంధాలు కుదుర్చుతానంటూ అమాయక ప్రజలను నమ్మించి రూ.కోటి వరకూ ఓ వ్యక్తి టోకరా వేసిన ఘటన ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారంలో జరిగింది. పెళ్లిళ్ల పేరయ్య అవతారమెత్తి వయసుకు వచ్చిన యువతకు, కొంచెం లోపాలు ఉన్నవారికి పెళ్లి సంబంధాలు చూస్తానంటూ రూ.లక్షల విలువైన బంగారం, నగదు స్వాహా చేసిన వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకూ ఆరుగురు బాఽధితులు వెలుగులోకి రాగా అనేక మంది మోసపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మూలస్థాన అగ్రహారానికి చెందిన యర్రంశెట్టి దుర్గయ్య దివ్యాంగుడు. అతను పెళ్లి సంబంధాలు చూసే దళారీగా అవతారమెత్తాడు. ఇదే క్రమంలో గ్రామంలో దొడ్డా రాంబాబు, వరలక్ష్మి దంపతుల కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తానంటూ నమ్మబలికాడు. వధువు కుటుంబానికి కొంత నగదు అవసరమంటూ దశల వారీగా రూ.20 లక్షల వరకూ తీసుకున్నాడు. దీంతో పాటు రాంబాబు కుటుంబ సభ్యుల వద్ద సుమారు రూ.12 లక్షల విలువైన 20 కాసుల బంగారాన్ని కూడా తన మాయమాటలతో స్వాహా చేశాడు. ఆ బంగారం ఆ ఆశ చూపి, తక్కువకు వస్తుందంటూ గ్రామానికి చెందిన విజయ, నవాబుపేటకు చెందిన సింగంశెట్టి సురేష్‌ను నమ్మించాడు. విజయ వద్ద రూ.5.5 లక్షలు, సురేష్ వద్ద రూ.4.10 లక్షలు తీసుకుని మాట మార్చేశాడు. దీంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనేక మంది వద్ద రూ.లక్షలు తీసుకోవడంతో స్వాహా చేసిన సొమ్ము రూ.కోటి పైనే ఉంటుందని సమాచారం. పెళ్లి సంబంధాలకు సంబంధించి అవతలి వారు ఒప్పుకున్నారని ఇతరులతో డమ్మీ ఫోన్లు చేయించేవాడు. జల్సాలకు అలవాటు పడిన దుర్గయ్య స్వాహా చేసిన సొమ్మును అంతా విలాసాలకు ఖర్చు చేశాడు. పెళ్లి సంబంధాలు చూస్తున్నానంటూ కాలయాపన చేస్తున్న దుర్గయ్య ప్రవర్తనపై బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో వారంతా సోమవారం దుర్గయ్య ఇంటికి వెళ్లి అతని భార్య రాణి, తల్లి వెంకాయమ్మ, సోదరుడు మురళీని నిలదీయగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితులంతా ఆలమూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎస్సై ఎల్.శ్రీను నాయక్‌కు ఫిర్యాదు చేశారు.జల్సాలకు అలవాటు పడి..మాయమాటలతో బాధితులను నమ్మించి స్వాహా చేసిన సొమ్మును అనతికాలంలోనే దేశమంతా తిరిగి జల్సాలకు, విలాసాలకు ఖర్చు చేశాడని భార్య రాణి పోలీసులకు వివరించింది. తన భర్త పెళ్లి సంబంధాల పేరిట డబ్బులు తీసుకున్నది వాస్తవమేనన్నారు. సోదరుడు మురళీ, తల్లి వెంకాయమ్మ ప్రోద్భలంతో స్వాహా చేసిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేశాడని తెలిపింది. ఇలాంటివి వద్దని పలుమార్లు చెప్పినా పట్టించుకోకుండా చేతిలో ఉన్న డబ్బును చూసి విచ్చలవిడిగా ఖర్చు చేశాడంది. ఈ సొమ్ము దుర్వినియోగంలో కొంత భాగం సోదరుడు, తల్లి ప్రమేయం ఉందని ఆరోపించింది. భార్య, ఇద్దరు పిల్లలను పట్టించుకోకుండా పెళ్లి సంబంధాల పేరిట తీర్థయాత్రలు, విలాసవంతమైన ప్రాంతాలకు వెళ్లేవాడంది. ఇప్పటి వరకూ తమకు సొంత ఇల్లు కూడా లేదని, అద్దె ఇంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నామని ఆమె పేర్కొంది. ప్రస్తుతం తన భర్త దుర్గయ్య ఒక్క పైసా కూడా లేకుండా ఖర్చు చేశాడని వివరించింది.బాధితులకు న్యాయం చేస్తాం..పెళ్లి సంబంధాల పేరిట మోసపోయిన బాధితులందరికీ తగిన న్యాయం చేస్తామని ఎస్సై శ్రీను నాయక్ భరోసా ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేస్తున్నామని, విచారణ జరిపి నిందితుడు దుర్గయ్యతో పాటు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుంటామన్నారు. స్వాహా చేసిన నగదు, బంగారాన్ని రికవరీ చేసేందుకు చర్యలు తీసుంటామని అన్నారు. -
బాలికతో అరబ్ షేక్ వివాహం... అడ్డుకున్న పోలీసులు
చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): పేదరికం, నిరక్ష్యరాస్యతను ఆసరాగా చేసుకొని బాలికను వివాహం చేసుకునేందుకు ఓ అరబ్ షేక్ చేసిన ప్రయత్నాన్ని రెయిన్‌బజార్ పోలీసులు అడ్డుకున్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... ఒమన్ దేశం మస్కట్ ప్రాంతానికి చెందిన అల్ బాలుచీ బాదర్ యూసుఫ్ సేద్(37) గత నెల 16వ తేదీన టూరిస్ట్ వీసాపై హైదరాబాద్‌కు వచ్చాడు. హిమాయత్‌నగర్ హైదర్‌గూడలోని హోటల్ హన్షు గ్రాండ్లో 18వ తేదీన దిగాడు. అక్కడ ఉన్న సమయంలోనే అయేషా అనే పెళ్లిళ్ల బ్రోకర్‌తో చర్చలు జరిపాడు. దీంతో అయేషా రెయిన్‌బజార్ అరబ్గల్లీకి చెందిన బస్సుడ్రైవర్ ఖయ్యూం, సయ్యదా హైదరీ ఫాతిమాల కుమార్తె(17) విషయం తెలిపింది. పేదరికంతో బాధ పడుతున్న వారికి రూ.5 లక్షలు ఇప్పిస్తానని, అరబ్ షేక్‌తో పెళ్లికి ఒప్పుకోవాలని ఆశపెట్టింది. తల్లిదండ్రులు అంగీకరించటంతో ఈ నెల 2వ తేదీన వివాహం చేయాలని నిశ్చయించి, ముందుగా ఖర్చుల కోసం అయేషా షేక్ నుంచి రూ.30 వేలు తీసుకుంది. దీంతో పాటు పాస్, పోర్టు వీసా వచ్చేంత వరకు రెండు నెలల సమయం పడుతుందని, అప్పటి వరకు కూతురితో కలసి ఉండేందుకు ఒక గది అద్దెకు తీసుకోవాలని బాలిక తండ్రి ఖయ్యూంకు రూ.15 వేలు అందజేసింది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 10 గంటలకు వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో రెయిన్‌బజార్ ఎస్సై జి.శ్రీనివాస్ రెడ్డి అక్కడికి చేరుకొని విషయాన్ని పసిగట్టి వివాహాన్ని అడ్డుకున్నారు. వెంటనే అరబ్ షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. విలేకర్ల సమావేశంలో మీడియా ముందుకు అరబ్ షేక్‌ను తీసుకొచ్చిన సమయంలో అతడు నవ్వులు చిందిస్తూ కనిపించడం గమనార్హం.