కోడి దొంగతనంపై గొడవ..హత్యాయత్నం.. అత్యాచారం కేసులో 10 ఏళ్ల జైలు

- - Sakshi

అమలాపురం టౌన్‌: భార్యాభర్తలపై హత్యాయత్నం చేయడమే కాకుండా భార్యపై అత్యాచారం చేసిన నేరం రుజువు కావడంతో పి.గన్నవరం మండలం ఊడిమూడి శివారు చింతావారిపేటకు చెందిన పచ్చిమాల శ్రీనివాసరావుకు రాజమహేంద్రవరంలోని జిల్లా 8వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి పీఆర్‌ రాజీవ్‌ పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. ముద్దాయికి రూ.5 వేల జరిమానా కూడా విధించారు. అమలాపురం జిల్లా ఎస్పీ కార్యాలయం ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ సంవత్సరం జనవరి నెలలో ఊడిమూడి శివారు చింతావారిపేటలో తమ సొంత ఇంట్లో భార్యాభర్తలు నివసిస్తున్నారు. అదే ఇంట్లో ఓ పోర్షన్‌లో ఉంటున్న పచ్చిమాల శ్రీనివాసరావు హత్యాయత్నం, అత్యాచారం కేసుల్లో నిందితుడు. కోడి దొంగతనంపై జరిగిన విషయమై ఆరా తీసిన భర్తపై కోపంతో పచ్చిమాల శ్రీనివాసరావు ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. తొలుత భర్త తలపై సన్నికల్లు పొత్రంతో కొట్టి తీవ్రంగా గాయపరిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా భార్యను కూడా తీవ్రంగా కొట్టి గాయపరిచాడు.

ఇదే సందర్భంగా ఆమైపె అత్యాచారం కూడా చేశాడన్నది ముద్దాయి శ్రీనివాసరావుపై అభియోగం. అప్పట్లో ఈ కేసులకు సంబంధించి శ్రీనివాసరావుపై పి.గన్నవరం పోలీసు స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అప్పటి డీఎస్పీ వై.మాధవరెడ్డి సమగ్ర దర్యాప్తు చేసి బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా చార్జి షీటు నమోదు చేశారు. కోర్టులో సోమవారం జరిగిన తుది విచారణలో ముద్దాయి శ్రీనివాసరావుపై మోపిన నేరాలు రుజువు కావడంతో న్యాయమూర్తి రాజీవ్‌ పై విధంగా తీర్పు చెప్పారు. ఈ కేసులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మారిశెట్టి వెంకటేశ్వరరావు ప్రాసిక్యూషన్‌ తరఫున వాదనలు వినిపించారు. ప్రత్యేక పర్యవేక్షణ వల్ల ఘటన జరిగిన నాలుగు నెలల్లోనే ముద్దాయికి శిక్షలు పడ్డాయని ఎస్పీ సుసరాపు శ్రీధర్‌ తెలిపారు.

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top