పిల్లలతో కలిసి తల్లి దారుణం.. సడన్‌ బ్రేక్‌ వేసినా ఫలితం లేకపోయింది

A Women Suicide After Pulling Her Kids Into Railway track - Sakshi

పిల్లలను రైలుకిందకు తోసి.. అనంతరం తానూ దూకి..

అక్కడికక్కడే తల్లి మృతి..చికిత్స పొందుతూ చిన్నారి కూడా..

గాయాలతో బయటపడిన మరో బాబు

రామగుండం: అన్యోన్యంగా సాగిపోతున్న కుటుంబంలో కలహాలు చెలరేగాయి. రోజూ తాగొచ్చి వేధిస్తున్న భర్తతో వేగలేక ఆమె మరణమే శరణ్యమని భావించింది. తాను లేకుంటే పిల్లలెలా బతుకుతారనుకుందో ఏమో.. వారినీ తన వెంటే తీసుకెళ్లాలని కఠిన నిర్ణయం తీసుకుంది. అంతే ఇద్దరు పిల్లలను ఎదురుగా వస్తున్న రైలుకింద తోసి.. తాను దూకింది. ఈ సంఘటనలో తల్లి అక్కడికక్కడే మృత్యువాత పడగా.. గాయపడిన పిల్లలిద్దరినీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అక్కడ ఓ చిన్నారి కన్నుమూసింది. 

పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. రామగుండం జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి గంగారపు తిరుపతి కథనం ప్రకారం.. స్థానిక యైటింక్లయిన్‌కు చెందిన జంగేటి ప్రవీణ్‌కు ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న ఓరుగంటి వెంకటరమణ కూతురు అరుణతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు సాత్విక్‌ (5), కూతురు సాత్విక (2) ఉన్నారు. 

భర్త మద్యానికి బానిస కావడంతో..
కాగా, ప్రవీణ్‌ కొంత కాలంగా పనికి వెళ్లకుండా మద్యానికి బానిసయ్యాడు. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని అరుణను వేధించసాగాడు. ఆ వేధింపులు భరించలేక అరుణ జీవితంపై విరక్తి చెంది.. తాను చనిపోతే పిల్లలు ఒంటరి వారవుతారని భావించి పిల్లలతో సహా రామగుండం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. మధ్యాహ్నం రెండుగంటలకు సికింద్రాబాద్‌ నుంచి దాణాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వస్తున్న క్రమంలో ముందుగా పిల్లలను తోసింది. అనంతరం తానూ రైలు కింద పడింది. అయితే రైలు కొద్దిదూరంలో ఉండడంతో గమనించిన లోకోపైలట్‌ హారన్‌ మోగించాడు. సడన్‌ బ్రేక్‌ వేసినా ఫలితం లేకపోయింది.

రైలు తల్లితోపాటు ఇద్దరు చిన్నారులపైకి కొద్దిదూరం దూసుకెళ్లింది. రైలు ఆగాక లోకోపైలట్‌ జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ముగ్గురినీ రైలు కింద నుంచి బయటకు తీశారు. అరుణ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. పిల్లలు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా.. వారిని 108లో గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాత్విక మృతిచెందింది. బాబు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. అరుణ తండ్రి వెంకటరమణ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top