చైన్‌ స్నాచింగ్‌కు మహిళ బలి

Woman victim of chain snatching - Sakshi

ప్రతిఘటించడంతో గాయపరిచిన ఆగంతకుడు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు మృతి

గజ్వేల్‌రూరల్‌: మహిళ మెడపై ఉన్న బంగారు ఆభరణాలను ఓ ఆగంతకుడు చోరీకి యత్నించాడు. ప్రతిఘటించేక్రమంలో ఆమెకు గాయాలై అపస్మారక స్థితిలో వెళ్లింది. ఆపై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం కొల్గూరులో చోటు చేసుకుంది. అడిషనల్‌ డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం..కొల్గూరుకు చెందిన చెన్న శ్రీనివాస్‌– శ్యామలత(55) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలు జరగ్గా, కొడుకు హైదరాబాద్‌లో జాబ్‌ చేస్తూ అక్కడే ఉంటున్నాడు. దంపతులిద్దరూ స్థానికంగా ఉంటూ కిరాణ దుకాణం నడుపుతున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు నిద్రలేచిన శ్యామలత ఇంటి వెనుక భాగంలో ఉన్న డోర్‌ తీసి బాత్‌రూమ్‌కు వెళ్లింది.

ఇదే సమయంలో ఓ ఆగంతకుడు ఇంటి వెనుక నుంచి లోపలికి ప్రవేశించాడు. శ్యామలత భర్త శ్రీనివాస్‌ బెడ్‌రూమ్‌లో నిద్రిస్తుండగా, ఆగంతకుడు తలుపు లకు గొళ్లెం పెట్టాడు. బాత్‌ రూమ్‌ నుంచి శ్యామలత ఇంట్లోకి వస్తున్న  సమ యంలో ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు గొ లుసు, చెవికి ఉన్న అరతులం కమ్మలను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. శ్యామలత ప్రతిఘటిండంతో ఆమె ముఖంపై దిండు(మెత్త)ను అదిమి పట్టి ఆభరణాలను దొంగిలించాడు.

ఈ క్రమంలోనే ఆమె చెవికి గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భారతమ్మ పాలు పోసేందుకు వస్తుండగా, మంకీ క్యాప్‌ పెట్టుకున్న ఆగంతకుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించింది. ఇంట్లోకి వెళ్లి బెడ్‌రూమ్‌ గొళ్లెం తీయగా భర్త శ్రీనివాస్‌ బయటకు వచ్చాడు. శ్యామలతను వెంటనే గజ్వేల్‌లోని ప్రైవే టు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు మెరుగైన చికిత్స అవసరమని చెప్పడంతో గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ శ్యామలత మృతి చెందింది.

whatsapp channel

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top