సాక్షి,బెంగళూరు: రాజరాజేశ్వరి నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటి కృతి తపండా నివాసంలో ఒక వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంతకాలంగా తీవ్ర మానసిక కుంగుబాటుతో బాధపడుతున్న వైశాఖ్ అనే వ్యాపారవేత్త ఈ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, నిన్న రాత్రి దాదాపు 8:30 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. ఆ సమయంలో నటి కృతి తపండా యలహంకలో ఉండటంతో ఆమె ఇంట్లో లేరు. మృతుడు వైశాఖ్ గత వారం రోజులుగా ఆమె నివాసంలోనే బస చేస్తున్నట్లు విచారణలో తేలింది. అయితే ఘటనా స్థలంలో పోలీసులకు ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించలేదు.
ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.మరణించిన వైశాఖ్ తీవ్రమైన వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. భార్యతో ఏర్పడిన వరుస వివాదాల వల్ల గత నెల రోజులుగా ఆయన ఆమెకు దూరంగా ఒంటరిగా జీవిస్తున్నారు.
ఇదిలావుండగా, గతంలో వ్యాపారవేత్త, న్యాయవాది అరవింద్ రెడ్డికి సంబంధించిన ఒక హైప్రొఫైల్ బ్లాక్‌మెయిల్, ఎక్స్‌టార్షన్ కేసులో వైశాఖ్ నిందితుడిగా ఉన్నారు. ఫిబ్రవరి నెలలో అరవింద్ రెడ్డికి రూ. 6 నుంచి 7కోట్ల డిమాండ్‌తో కూడిన బెదిరింపు లేఖ పంపిన కేసులో హెచ్ఏఎల్ పోలీసులు వైశాఖ్‌ను అరెస్ట్ చేసి ఐదు రోజుల పాటు విచారించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 6న కర్ణాటక హైకోర్టు ఈ విచారణపై స్టే విధించడంతో ఆయన విడుదలయ్యారు.
ప్రస్తుతం ఈ ఘటనపై వైశాఖ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాజరాజేశ్వరి నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం ప్రక్రియ ముగిసిన తర్వాత మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించనున్నారు.వైశాఖ్ ఆత్మహత్యకు దారితీసిన ఖచ్చితమైన కారణాలను కనుగొనేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు.


