కోటి ఇవ్వవా.. పెళ్లి షాపింగ్‌ చేసుకుంటా! | Siya took Rs 1 cr from Ketan for wedding shopping, gave it to lover Chetan | Sakshi
Sakshi News home page

కోటి ఇవ్వవా.. పెళ్లి షాపింగ్‌ చేసుకుంటా!

Jun 29 2026 4:44 PM | Updated on Jul 3 2026 2:05 PM

Siya took Rs 1 cr from Ketan for wedding shopping, gave it to lover Chetan

పూణే: కేతన్‌ అగర్వాల్‌ మర్డర్ కేస్.. ఇందులో సియా గోయల్‌, చేతన్‌ చౌదరిల పాత్ర చూస్తుంటే థ్రిల్లర్ మలయాళం సినిమా క్రైమ్‌ స్టోరీ కూడా నథింగ్ అనిపిస్తోంది! నిందితురాలు 20 ఏళ్ల సియా గోయల్, తన ప్రియుడు 22 ఏళ్ల చేతన్ చౌదరితో కలిసి ఈ హత్యకు ముందే పక్కా స్కెచ్ వేసింది. అంతటితో ఆగకుండా, పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు.. నేరం జరిగిన కొన్నేళ్ల తర్వాత వివాహం చేసుకోవాలంటూ తమ భవిష్యత్తును కూడా ముందే ప్లాన్‌ చేసుకోవడం కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారుల్ని సైతం విస్మయానికి గురిచేస్తోంది.

పెద్దలు నిర్ణయించిన వివాహం చేసుకోవడం ఇష్టం లేని సియా గోయల్‌, తన ప్రియుడు చేతన్‌ చౌదరితో కలిసి కాబోయే భర్త కేతన్‌ అగర్వాల్‌ను పూణే సమీపంలోని లోహ్‌గఢ్‌ కోట వద్ద లోయలోకి తోసేసి అత్యంత క్రూరంగా హత్య చేసింది. ఈ కేసులో దర్యాప్తు అధికారులు పలు కీలక విషయాల్ని వెలికి తీశారు.

లోహ్‌గఢ్‌ కోట వద్ద కేతన్‌ అగర్వాల్‌ను ఎలా హత్య చేయాలి?.. హత్య చేసే సమయంలో కేతన్‌ తప్పించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి?.. కేతన్‌ను హత్య చేసిన తర్వాత పోలీసులకు అనుమానం రాకుండా పెళ్లెప్పుడు చేసుకోవాలి?.. పెళ్లి చేసుకోవడంతో పాటు సియా, చేతన్‌ల జీవితం ఎలా ఉండాలి?.. ఇందుకోసం డబ్బులు ఎలా సంపాదించాలి?.. అని వీరంతా ముందే ప్లాన్‌ చేసినట్లు తేలింది.

కేతన్‌ అగర్వాల్‌ హత్య తర్వాత తమ భవిష్యత్‌ను కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దేందుకు సియా గోయల్‌, చేతన్‌ చౌదరి ముందే మాట్లాడుకున్నారు. ఇందులో భాగంగానే, అనుమానం రాకుండా ఉండేందుకు నేరం జరిగిన మూడేళ్ల తర్వాత వివాహం చేసుకోవాలని అనుకున్నారు.ఈ ప్లాన్‌లో భాగంగా సియా.. పెళ్లి షాపింగ్ చేసే సాకుతో కాబోయే భర్త కేతన్‌ అగర్వాల్‌ వద్ద నుంచి ఏకంగా రూ.కోటి రూపాయలు తీసుకుంది. ఆ రూ.కోటి మొత్తాన్ని పెళ్లి షాపింగ్‌కు ఖర్చు చేయకుండా, సియా తన ప్రియుడైన చేతన్‌కు ఇచ్చేసింది. చేతన్‌తో పాటు తన భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశ్యంతో.. ఆ కోటి రూపాయలతో చేతన్‌ లైఫ్‌ సెటిల్‌ చేయడం, కొత్త బిజినెస్‌ను ప్రారంభించడం, ఆ తర్వాత కేతన్‌ను హత్య చేసిన మూడేళ్లకు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇదిలా ఉండగా.. ఈ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు మరికొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు. లోహగడ్ కోట పైనుంచి కేతన్ అగర్వాల్‌ను లోయలోకి తోసివేయమని ప్రియుడు చేతన్ చౌదరికి సంకేతం ఇవ్వడానికి సియా గోయల్ ఒక వింత ప్లాన్ వేసింది.

తాను తోసేసే సమయంలో కింద పడుతూ పడుతూ కేతన్ తనని పట్టుకుంటే.. ఆ కంగారులో సియా కూడా ఎక్కడ లోయలో పడిపోతుందోనని వారు ముందే భయపడ్డారు. అందుకే సియా భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ప్రాణాంతకమైన ఆ తోపుడు సమయంలో కేతన్‌కు ఆమె ఏమాత్రం అందకుండా ఉండేందుకు, సియా కింద కూర్చోవాలని వారు పక్కాగా స్కెచ్ వేశారు.

లోహగడ్ కోటపై నడుస్తున్నప్పుడు.. నీళ్లు తాగడానికో లేదా షూలేసులు కట్టుకునే నెపంతోనో సియా కింద కూర్చోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అలా సియా కింద కూర్చోవడమే చేతన్ చౌదరికి గ్రీన్ సిగ్నల్!

ప్లాన్ ప్రకారం.. సియా కింద కూర్చోగానే, వెనుక నుంచి వచ్చిన చేతన్ చౌదరి..కేతన్ అగర్వాల్‌ను గట్టిగా లోయలోకి తోసి చంపేశాడని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. ఇది సియాను ప్రమాదం నుంచి రక్షించుకోవడానికి వారు బాగా ఆలోచించి వేసిన ఘోరమైన ఎత్తుగడ అని పోలీసులు వెల్లడించారు.

మరోవైపు, జూన్ 18న కేతన్, సియాలను అనుసరించిన చేతన్ చౌదరి.. కేసులో ఇరుక్కోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. టోల్ ప్లాజాల వద్ద కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు తనను సులభంగా గుర్తిస్తారనే భయంతో.. అతను కారును వాడలేదు. పూణే నుండి లోహగడ్ కోటకు, సుమారు 90 కిలోమీటర్ల దూరం.. ఒక స్కూటర్‌పై ప్రయాణించాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం హత్యకు ఉపయోగించిన ఆ స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement