శ్వేతా నువ్వు లేక ఉండలేకపోతున్నా.. ఈ జీవితం వ్యర్థం | Selfie Video Suicide | Sakshi
Sakshi News home page

శ్వేతా నువ్వు లేక ఉండలేకపోతున్నా.. ఈ జీవితం వ్యర్థం, సెల్ఫీ వీడియో చిత్రీకరణ

Jul 2 2023 3:45 AM | Updated on Jul 2 2023 10:35 AM

Selfie Video Suicide - Sakshi

షాద్‌నగర్‌: ‘మూడు రోజులు అవుతుంది.. శ్వేతా నువ్వు లేక ఉండలేకపోతున్నా.. నువ్వు లేని జీవితం వ్యర్థం.. ఇక చనిపోతున్నా’ అంటూ ఓ భర్త సెల్ఫీ వీడియో తీసుకుంటూ అన్నంలో గుళికల మందు కలుపుకొని తిని బలవన్మరణానికి పాల్పడాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని కొండన్నగూడలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

కొండన్నగూడ గ్రామానికి చెందిన కందనోళ్ల రాజేష్‌ (35)కు అదే గ్రామానికి చెందిన శ్వేతతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కొంతకాలంగా షాద్‌నగర్‌లోని రాంనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. రాజేష్‌ డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవ జరిగింది. ఈ క్రమంలోనే భార్య శ్వేత పుట్టింటికి వెళ్లింది. 

మనస్తాపంతో..
భార్య తిరిగి రావడం లేదన్న మనస్తాపంతో రాజేష్‌ శుక్రవారం రాత్రి గుళికల మందు ప్యాకెట్‌ తీసుకొని కొండన్నగూడ గ్రామ శివారులోని తమ పొలానికి వెళ్లాడు. ‘నీతో గొడవ పడినా అర్ధరాత్రి వచ్చి అయినా నీతో మాట్లాడేవాడిని.. మూడు రోజుల నుంచి ఒంటరిగా ఉన్నా.. ఒంటరిగానే తిరుగుతున్నా.. నా కన్నతల్లికంటే నీవే ఎక్కువ కదా.. నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయావు.. నీవు లేని జీవితం వ్యర్థం.. ఇక చనిపోతున్నా.. నా భార్య నా వల్ల ఇబ్బందులు పడింది..  ఆమెపై కేసులు పెట్టొద్దు.. నా చావుకు నేనే కారణం..’ అంటూ చివరిసారిగా సెల్ఫీ వీడియో తీసుకొన్నాడు.

తండ్రి నారాయణగౌడ్‌ సమాధి వద్ద అన్నంలో గుళికల మందు కలుపుకొని తిని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం అటువైపు వెళ్లిన స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకుని భోరున విలపించారు. సీఐ ప్రతాప్‌లింగం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement