ఈదురు గాలులతో బీభత్సం.. | Two lives lost due to power lines being snapped | Sakshi
Sakshi News home page

ఈదురు గాలులతో బీభత్సం..

Jun 14 2026 4:35 AM | Updated on Jun 14 2026 4:35 AM

Two lives lost due to power lines being snapped

తండ్రీకూతుళ్లను బలిగొన్న విద్యుత్‌ తీగలు 

అల్వాల్‌లో విషాదం

అల్వాల్‌: నగరంలో అర్ధరాత్రి కురిసిన వర్షం, ఈదురు గాలులు ఓ కుటుంబంలో తీరని విషాదం నింపాయి. విద్యుత్‌ తీగలు తెగిపడి రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా పనిచేసే సందీప్‌ (44) తన భార్య శ్వేత (39), కుమార్తె రితిక (16)తో కలిసి కానాజీగూడ టెలికం కాలనీలో నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి వర్షం కురవడంతో కాసేపు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 

అయితే అర్ధరాత్రి సుమారు 2:30 గంటల సమయంలో ఇంటి బయట భారీ శబ్దం వినిపించడంతో సందీప్‌ నిద్రలేచి బయటకు వచ్చి చూడగా ఓ చెట్టు కొమ్మలు తన కారుకు అతిసమీపంగా విరిగిపడ్డాయి. దీంతో కారు దెబ్బతింటుందేమోనని ఆందోళన చెందిన ఆయన.. కారును పక్కకు జరిపేందుకు ప్రయత్నించగా భార్య చెట్టు కొమ్మలను తొలగించే ప్రయత్నం చేసింది. అయితే కొమ్మల మధ్య తెగిపడిన విద్యుత్‌ తీగను గుర్తించకపోవడంతో కరెంట్‌ షాక్‌కు గురై కుప్పకూలింది. 

తల్లి పడిపోవడం గమనించిన కుమార్తె రితిక.. ఆమెను రక్షించే ప్రయత్నం చేయగా ఆమె కూడా విద్యుత్‌ షాక్‌కు గురైంది. వారిని కాపాడేందుకు ప్రయత్నించే క్రమంలో సందీప్‌ సైతం షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత సందీప్, శ్వేత స్పృహలోకి వచ్చినా రితిక మాత్రం కదలలేదు. కూతురిని రక్షించాలనే ఆరాటంలో సందీప్‌ మరోసారి ఆమె వద్దకు వెళ్లగా అక్కడే ఉన్న విద్యుత్‌ తీగ తగిలి మళ్లీ కరెంట్‌ షాక్‌కు గురయ్యారు. శ్వేత ఆర్తనాదాలు విని ఉలిక్కిపడిన కాలనీవాసులు హుటాహుటిన అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. 

ఘటనాస్థలికి చేరుకున్న వైద్య సిబ్బంది సందీప్, రితిక మృతిచెందినట్లు నిర్ధారించారు. అయితే తీగలు తెగిపడ్డాయని విద్యుత్‌ శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు ఆలస్యంగా స్పందించారని స్థానికులు ఆరోపించారు. ఒకవేళ వారు వెంటనే స్పందించి ఉంటే కనీసం సందీప్‌ అయినా బ్రతికేవారని చెప్పారు. తాము వద్దని వారిస్తున్నా కుమార్తె వద్దకు వెళ్లి చెట్టు కొమ్మగా భావించి విద్యుత్‌ తీగను పట్టుకోవడంతో మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement