ఘోర రోడ్డు ప్రమాదం.. భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు | One dead in road accident | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు

Mar 28 2024 7:11 AM | Updated on Mar 28 2024 7:13 AM

One dead in road accident  - Sakshi

కోటి ఆశలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు వారు.. విధి వక్రీకరించడంతో రోడ్డు ప్రమాదం వారి ఆశలను గల్లంతు చేసింది. వివాహమైన ఐదు నెలలకే భర్తను బలి తీసుకుంది. భార్తను తీవ్రగాయాలపాలు జేసింది. కళ్లెదుటే కట్టుకున్నవాడు విగతజీవిగా పడిఉండడంతో ఆ ఇల్లాలు గుండెలవిసేలా రోదిస్తోంది.   

రాజంపేట: కడప–రేణిగుంట జాతీయ రహదారిలోని ఊటుకూరు సమీపంలోని అశోక్‌గార్డెన్స్‌(రాజంపేట) వద్ద బుధవారం ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. భార్య తీవ్రగాయాల బారిన పడింది. వివరాలిలా ఉన్నాయి.. పుల్లంపేట మండలం (వత్తలూరు) దేవసముద్రం వడ్డిపల్లెకు చెందిన ఊర్సు బీ.హరి(24), చిట్వేలి మండలం వడ్డిపల్లెకు చెందిన శ్రీలేఖతో ఐదునెలల కిందట వివాహమైంది. ఈ నేపథ్యంలో భార్యభర్తలిద్దరూ చిట్వేలి వడ్డిపల్లె నుంచి బైకులో రాజంపేట మండలం గోపమాంబపురం వడ్డిపల్లెకు వస్తుండగా అశోక్‌గార్డెన్‌ వద్ద లారీ ఢీ కొంది.

దీంతో భర్త హరి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య శ్రీలేఖకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం ఆమెను  రాజంపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఐదునెలల క్రితం వివాహం కావడం, ప్రమాదంలో భర్తను కోల్పోవడంతో భార్య పరిస్థితిని చూసిన పలువురు కంటతడి పెట్టారు. కాగా హరి ఒక్కగానొక్క  కొడుకు కావడంతో అతడి తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement