ఆడిటర్‌ సహా.. విశాఖ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్‌ | MVV Satyanarayana wife and son along with auditor GV Kidnapped | Sakshi
Sakshi News home page

ఆడిటర్‌ సహా.. విశాఖ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్‌

Jun 16 2023 4:41 AM | Updated on Jun 16 2023 4:41 AM

MVV Satyanarayana wife and son along with auditor GV Kidnapped - Sakshi

నిందితుడు హేమంత్‌ కుమార్‌ (ఫైల్‌)

దొండపర్తి (విశాఖ దక్షిణ)/విశాఖ విద్య: విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడితో పాటు ప్రముఖ ఆడిటర్‌ జీవీ కిడ్నాప్‌ వ్యవహారం గురువారం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. సినీ ఫక్కీలో దుండగులు ఎంపీ  కుమారుడు శరత్‌ ఇంట్లోకి చొరబడి.. ముగ్గురి మెడపై కత్తిపెట్టి డబ్బులు డిమాండ్‌ చేశారు. 48 గంటల పాటు నిర్బంధించారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.

కానీ, పోలీసులు నాలుగు గంటల్లోనే కిడ్నా­పర్ల ఆచూకీ కనిపెట్టి సినిమా స్టైల్లో వెంబడించి రౌడీషీటర్‌ కోలా వెంకట హేమంత్‌కుమార్, రాజేష్‌లను అరెస్టుచేయడంతో కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. వారి చెర నుంచి ఎంపీ ఎంవీవీ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ప్రముఖ ఆడిటర్‌ గన్నమనేని వెంకటే­శ్వరరావు (జీవీ) సురక్షితంగా బయటప­డ్డారు. ఈ కిడ్నాప్‌ వ్యవహారంలో మరో ఐదుగురి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. వివరాలివీ..

కిడ్నాప్‌ జరిగింది ఇలా..
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు శరత్‌ రుషికొండ ప్రాంతంలో తారకరామ లేఅవుట్‌లో ఉంటున్నారు. ఈనెల 13వ తేదీ ఉదయం కొందరు దుండగులు ఆ ఇంట్లోకి చొరబడ్డారు. లోపల శరత్‌ ఒక్కడే ఉండడంతో అతడిని నిర్బంధించి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఇంకా డబ్బు కావాలని దాడిచేశారు. తన వద్ద లేదని చెప్పినా వినలేదు. దీంతో మరుసటి రోజు బుధవారం శరత్‌తో లాసెన్స్‌ బే కాలనీలో ఉంటున్న తల్లి జ్యోతికి ఫోన్‌ చేయించారు.

తన ఆరోగ్యం బాగోలేదని, ఇంటికి రావాలని బలవంతంగా చెప్పించారు. అది నిజమని నమ్మిన అతడి తల్లి జ్యోతి కంగారుగా బుధవారం కొడుకు ఇంటికి వచ్చారు. ఆమెను కూడా బంధించి ఆమె వద్ద ఉన్న బంగారు నగలను కాజేశారు. భారీగా డబ్బులు కావాలన్న ఉద్దేశంతో ఎంపీతో సన్నిహితంగా ఉండే ప్రముఖ ఆడిటర్‌ జీవీకి జ్యోతితో ఫోన్‌చేసి రప్పించారు. జీవీని కూడా నిర్బంధించి రూ.2 కోట్లు కావాలని డిమాండ్‌ చేశారు.

డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని ముగ్గురి మెడపై కత్తిపెట్టి బెదిరించారు. దీంతో జీవీ తనకు తెలిసిన వారికి ఫోన్‌చేసి రూ.1.75 కోట్లు సమకూర్చి వారికి అందించారు. అయినప్పటికీ వారిని విడిచిపెట్టకుండా ఇంకా డబ్బులు కావాలని కిడ్నాపర్లు డిమాండ్‌ చేశారు. మధ్యలో ఎంపీ తన కుమారుడు శరత్‌కు ఫోన్‌చేసినప్పటికీ కిడ్నాపర్ల సూచనల మేరకు మామూలుగానే మాట్లాడి ఫోన్‌ పెట్టేశారు. 

ఆడిటర్‌ ఫోన్‌ ట్రాక్‌కు ఎంపీ వినతి
ఐటీ రిటర్నుల పనుల నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్న ఎంపీ ఎంవీవీ.. ఆడిటర్‌ జీవీకి బుధవారం మధ్యాహ్నం నుంచి పలుమార్లు ఫోన్‌ చేసినప్పటికీ లిఫ్ట్‌ చేయలేదు. అతడి సన్నిహితులకు ఫోన్‌చేయగా.. శ్రీకాకుళం వెళ్లినట్లు చెప్పారు. అక్కడి వారికి ఫోన్‌చేసి ఆరా తీస్తే శ్రీకాకుళం కూడా రాలేదని సమాచారమిచ్చారు. గురువారం ఉదయం కూడా ఫోన్‌ చేసినప్పటికీ జీవీ స్పందించలేదు.

ఒకవైపు రిటర్నుల పనులు, మరోవైపు ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో జీవీకి ఏమైందన్న ఆందోళనతో ఎంపీ విశాఖ పోలీస్‌ కమిషనర్‌ త్రివిక్రమ్‌ వర్మకు ఫోన్‌చేసి అతని నెంబర్‌ను ట్రాక్‌ చేయాలని కోరారు. వెంటనే పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా జీవీ రుషికొండలోనే ఉన్నట్లు గుర్తించారు. అతని డ్రైవర్‌తో పాటు మరికొంత మంది ద్వారా సమాచారం సేకరించి సాంకేతికత సాయంతో విచారణ చేపట్టారు. దీంతో కిడ్నాప్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

సినీ ఫక్కీలో ఛేజ్‌ చేసి..
మరోవైపు.. రెండ్రోజులుగా ముగ్గురిని ఇంట్లోనే నిర్బంధించిన విషయాన్ని పోలీసులు గుర్తించే అవకాశం ఉందని గ్రహించిన కిడ్నాపర్లు వారిని అక్కడ నుంచి విజయనగరం వైపు తరలించేందుకు ప్రయత్నించారు. శరత్‌కు చెందిన ఆడి కారులో వారిని ఎక్కించుకుని పద్మనాభం నుంచి ఎస్‌.కోట మీదుగా విజయనగరం వెళ్లేందుకు బయల్దేరారు. పోలీసులు అప్పటికే మొబైల్స్, ఇతర టెక్నాలజీల ఆధారంగా ప్రతి ప్రాంతంలోనూ చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. అడుగడుగునా విస్తృత తనిఖీలు చేపట్టారు.

వారు ఆనందపురం మీదుగా పద్మనాభం వైపు వెళ్తున్నట్లు తెలుసుకుని వారి కారును వెంబడించారు. ఆనందపురం మండలం పందలపాక గ్రామానికి వారి కారు చేరుకోగానే ముందు నుంచి పద్మనాభం సీఐ బృందం, వెనుక నుంచి పీఎంపాలెం సీఐ బృందాల వాహనాలు అడ్డగించాయి. అయినప్పటికీ కిడ్నాపర్లు కారు ఆపకుండా ముందుకు వెళ్లే ప్రయత్నంలో పోలీస్‌ వాహనాన్ని బలంగా ఢీకొట్టారు.

వెంటనే కారులో ఉన్న కిడ్నాపర్లు రౌడీషీటర్‌ కోలా వెంకట  హేమంత్‌కుమార్, రాజేష్‌లు బయటకు దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఎంపీ కుటుంబ సభ్యుల కోసం ఆరా తీశారు. అయితే, వారిని బాకురుపాలెం ప్రాంతంలోనే విడిచిపెట్టినట్లు చెప్పడంతో మరో పోలీస్‌ బృందం వారికోసం గాలింపు చేపట్టింది. ఇంతలో వారు ఆర్టీసీ బస్సులో వెళ్తున్నట్లు తెలుసుకుని వారిని సురక్షితంగా కమిషనరేట్‌కు తరలించారు.

హేమంత్‌కుమార్‌పై 12 కేసులు..
భీమిలి ప్రాంతానికి చెందిన రౌడీషీటర్‌ హేమంత్‌కుమార్‌ ఇప్పటికే రెండు కిడ్నాప్‌ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా చెప్పుకుంటున్నప్పటికీ అతనిపై బ్లాక్‌మెయిలింగ్, కిడ్నాప్‌లు వంటి నేర చరిత్ర ఉంది. 2022లో రామకృష్ణ అనే వ్యక్తిని.. అలాగే, ఈ ఏడాది ఫిబ్రవరి 17న మధుసూధనరావు అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని కిడ్నాప్‌చేసి డబ్బులు డిమాండ్‌ చేశాడు.

ఈ రెండు కేసుల్లోను పోలీసులు హేమంత్‌కుమార్‌ను అరెస్టుచేసి జైలుకు పంపించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్దిరోజుల్లోనే మరో కిడ్నాప్‌కు పాల్పడి జైలుకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఇతడిపై మొత్తం 12 కేసుల వరకు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఎంపీని పరామర్శించిన మంత్రి అమర్‌నాథ్‌ 
ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్‌ ఉదంతాన్ని తెలుసుకున్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ నగరంలోని ఎంపీ ఇంటికి గురువారం సాయంత్రం వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కిడ్నాప్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనతో మాట్లాడి, వివరాలు తెలుసుకోమని పంపినట్లు అమర్‌నాథ్‌ చెప్పారు. కిడ్నాప్‌ ఉదంతాన్ని మంత్రికి ఎంపీ వివరించారు.

ఆ ఐదుగురు కోసం గాలింపు : సీపీ
ఇక కిడ్నాప్‌ విషయం తెలుసుకున్న వెంటనే 17 బృందాలను ఏర్పాటుచేశామని నగర పోలీస్‌ కమిషనర్‌ త్రివిక్రమ్‌ వర్మ మీడియాకు వెల్లడించారు. టెక్నాలజీ ఆధారంగా కిడ్నాపర్ల కదలికలపై నిఘా పెట్టి ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు చేశామని చెప్పారు. నాలుగు గంటల్లోనే కిడ్నాపర్లు కోలా వెంకటహేమంత్‌కుమార్‌తో పాటు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు.

మరో ఐదుగురి పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించామని, వారు పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వీరికోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు సీపీ వివరించారు. కేసు దర్యాప్తులో ఉందని, సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని త్రివిక్రమ్‌ వర్మ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement