బాలికపై గ్యాంగ్‌రేప్‌: వికారాబాద్‌ జిల్లా | minor girl gang raped in Vikarabad district | Sakshi
Sakshi News home page

బాలికపై గ్యాంగ్‌రేప్‌: వికారాబాద్‌ జిల్లా

Nov 2 2024 5:42 AM | Updated on Nov 2 2024 5:42 AM

minor girl gang raped in Vikarabad district

మాయమాటలతో లోబర్చుకొని.. ఆపై బ్లాక్‌మెయిల్‌ చేసి..

గర్భం దాల్చిన మైనర్‌.. ఐదుగురిపై పోక్సో కేసు..వీరిలో నలుగురు మైనర్లు

వికారాబాద్‌ జిల్లా దోమలో ఘటన

దోమ: మాయమాటలతో ఓ బాలికను లోబర్చుకున్న ఓ యువకుడు, నలుగురు మైనర్లు ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఎస్‌ఐ ఆనంద్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం...వికారాబాద్‌ జిల్లా దోమ మండలంలోని ఓ గ్రామంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక(13)తో అదే ఊరికి చెందిన సంతోష్‌ సన్నిహితంగా ఉండేవాడు. ఈ చనువును అవకాశంగా తీసుకొని ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

ఈ విషయం సంతోష్‌ స్నేహితులైన నలుగురు మైనర్లకు తెలియగా, బాలికను బ్లాక్‌మెయిల్‌ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. విషయం బయటకు చెప్పొద్దని హెచ్చరించడంతో వీరి అఘాయిత్యాలను ఆరు నెలలుగా మౌనంగా ఆ బాలిక భరిస్తోంది. ఈ క్రమంలో గత నెల 28వ తేదీన పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న బాలికను సంతోష్‌ తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే నలుగురు మిత్రులు అక్కడకు చేరుకున్నారు. అంతా కలిసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

సాయంత్రం వరకే స్కూల్‌ నుంచి రావాల్సిన బాలిక రాత్రి ఆలస్యంగా ఇంటికి రాగా, తల్లి నిలదీయడంతో బోరున విలపించింది. జరిగిన విషయాన్ని తల్లికి వివరించింది. దీంతో వెంటనే పీఎస్‌కు వెళ్లిన బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురిని పరిగిలోని డీఎస్పీ కార్యాలయానికి తరలించగా, నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. బాలికను సఖి సెంటర్‌కు తరలించి, వైద్య పరీక్షలు చేయించారు. ప్రస్తుతం బాలిక రెండు నెలల గర్భిణి అని వైద్యులు నిర్ధారించారు.

గంజాయి మత్తు కారణమా?
గ్రామాల్లో గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని, ఈ మత్తులోనే వారు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. నగరం నుంచి గ్రామాలకు గంజాయి సరఫరా అవుతోందని, దీనికి బానిసలుగా మారిన యువత విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement