జడ్జిగా ఆదర్శంగా ఉండాల్సిన తండ్రి 'మాకు అన్యాయం చేస్తున్నారు'.. | 9-year-old girl approaches High Court against father who is a judicial officer | Sakshi
Sakshi News home page

జడ్జిగా ఆదర్శంగా ఉండాల్సిన తండ్రి 'మాకు అన్యాయం చేస్తున్నారు'..

Jul 5 2026 5:29 AM | Updated on Jul 5 2026 5:29 AM

9-year-old girl approaches High Court against father who is a judicial officer

భరణం ఇవ్వకపోవడం వల్ల మా జీవనం కష్టతరమవుతోంది

నా తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ ఏడాదిన్నరగా ‘సాగుతోంది’ 

ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయండి

న్యాయాధికారి అయిన తండ్రిపై హైకోర్టును ఆశ్రయించిన 9 ఏళ్ల చిన్నారి

సాక్షి, అమరావతి: తన పోషణ, చదువు తదితరాల నిమిత్తం జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తన తండ్రి నుంచి తన తల్లికి భరణం ఇప్పించాలని కోరుతూ 4వ తరగతి చదువుతున్న ఓ తొమ్మిదేళ్ల చిన్నారి న్యాయ పోరాటానికి దిగింది. తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా జగిత్యాలలో రెండో అదనపు జుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌గా జగిత్యాలలో పని చేస్తున్న తన తండ్రి వినీల్‌ కుమార్‌ తమకు కనీసం తాత్కాలిక భరణం కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతూ హైకోర్టును ఆశ్రయించింది. భరణం విషయంలో తన తల్లి నాగలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడంలో ఒంగోలు కోర్టు తీవ్ర జాప్యం చేస్తోందని శుక్రవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ‘తన అధికారిక సామర్థ్యంలోనే కాక, తన వ్యక్తిగత ప్రవర్తనలో కూడా రోల్‌ మోడల్‌గా ఉండాల్సిన తండ్రి మాకు అన్యాయం చేస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. తన పెంపకం భారాన్ని నా తల్లే మోస్తోందని పేర్కొంటూ తన బాగోగుల నిమిత్తం కనీసం రూ.40 వేల తాత్కాలిక భరణం ఇప్పించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆ చిన్నారి తన పిటిషన్‌లో హైకోర్టును అభ్యర్థించింది. 

లేదా నిర్దిష్ట మొత్తాన్ని కోర్టులో జమ చేసేలా కూడా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. భరణం కోసం ఏడాదిన్నరగా పెండింగులో ఉన్న పిటిషన్‌ను రోజూ వారీ పద్దతిలో విచారణ జరిపి  వీలైనంత త్వరగా పరిష్కరించేలా ఒంగోలు కోర్టును ఆదేశించాలని కోరింది.  ‘‘వేగవంతమైన పరిష్కారం అనేది కేవలం న్యాయపరమైన విచక్షణ మాత్రమే కాదు. అది ఒక రాజ్యాంగపరమైన బాధ్యత. మరీ ముఖ్యంగా చిన్న వయసున్న నాలాంటి మైనర్‌ బాలిక సంక్షేమం ప్రమాదంలో ఉన్నప్పుడు వేగవంతమైన పరిష్కారం చాలా అవసరం.’ అని చిన్నారి తన పిటిషన్‌లో పేర్కొంది. ‘‘నా తల్లి తాత్కాలిక భరణం కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌తో పాటు రూ. 50 వేల మెయింటినెన్స్‌కు ప్రధాన పిటిషన్‌లో విచారణను ఆలస్యం చేయడానికి నా తండ్రి వరుస దరఖాస్తులు దాఖలు చేస్తున్నారు. తద్వారా ఆయన కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారు’’ అని కూడా చిన్నారి పేర్కొంది.  


  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement