మాట్లాడాలని పిలిపించి స్నేహితుడి హత్య | man murdered by man | Sakshi
Sakshi News home page

మాట్లాడాలని పిలిపించి స్నేహితుడి హత్య

May 12 2024 8:13 AM | Updated on May 12 2024 8:13 AM

man murdered by man

దొడ్డబళ్లాపురం: బార్‌లో ఉన్న స్నేహితుడిని మాట్లాడాలని తీసికెళ్లి మరో మిత్రుడు తన సహచరులతో కలిసి దారుణంగా హత్య చేసిన సంఘటన దొడ్డ గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. దొడ్డ తాలూకా హుస్కూరు గ్రామం నివాసి శశికుమార్‌ కుమారుడు హేమంత్‌గౌడ (27) హత్యకు గురైన యువకుడు. రౌడీషీటర్‌ నరసింహమూర్తి తన సహచరులతో కలిసి హత్యకు పాల్పడ్డ నిందితుడు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో హేమంత్‌గౌడ తన స్నేహితులతో కలిసి బాశెట్టిహళ్లి వద్ద ఉన్న జేపీ బార్‌లో పార్టీ చేసుకుంటుండగా నిందితుడు నరసింహమూర్తి ఫోన్‌ చేసి మాట్లాడాలని బయటకు రమ్మని పిలిచాడు.

హేమంత్‌ బార్‌లో నుండి బయటకు రాగానే నరసింహమూర్తితో వచ్చిన సుమారు 10 మంది సహచరులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గాయపడ్డ హేమంత్‌ను టెంపోలో వేసుకుని ఊరంతా తిప్పారు. చావుబతుకుల మధ్య పోరాడుతున్న హేమంత్‌ను చూసి పైశాచికానందం పొందారు. హేమంత్‌పై దాడి జరగగానే పక్కనే ఉన్న స్నేహితులు వెంటనే హేమంత్‌ తండ్రికి సమాచారం ఇచ్చారు. హేమంత్‌ తండ్రి, కుటుంబ సభ్యులు బార్‌ వద్ద వచ్చి చూడగా హేమంత్‌ జాడ లేదు.

హేమంత్‌ ఊపిరి ఆగిపోయే వరకూ టెంపోలో ఊరంతా తిప్పిన నరసింహమూర్తి చివరకు శవాన్ని బెంగళూరు రోడ్డులో ఉన్న నవోదయ పాఠశాల వద్ద రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. మృతుడు హేమంత్‌ రియల్‌ ఎస్టేట్, సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. నిందితుడు నరసింహమూర్తి పేకాట క్లబ్బులు నడుపుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు. దీంతో అతడిపై పోలీసులు రౌడీషిట్‌ తెరిచారు. అయితే మృతుడు, హతుడు ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య ఎందుకు శత్రుత్వం పెరిగిందనేది తెలీడంలేదు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు అందరూ పరారీలో ఉన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement