నమో వసంత వల్లభ | - | Sakshi
Sakshi News home page

నమో వసంత వల్లభ

Aug 16 2026 5:21 AM | Updated on Aug 16 2026 5:21 AM

బనశంకరి: శ్రావణ మాసం సందర్భంగా బెంగళూరు ఉత్తరహళ్లి సమీపంలోని వసంతపురలో వెలసిన వసంత వల్లభరాయస్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు వీఆర్‌.రఘురామ భట్టర్‌ ఆధ్వర్యంలో మూల విరాట్టుకు ప్రత్యేక అర్చన, అభిషేకం చేసి నేత్రపర్వంగా అలంకరించారు. ఉదయం 11.30 గంటలకు మంగళవాయిద్యాలతో స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఆలయంలో ఊరేగించారు. వందలాదిగా భక్తులు వసంత వల్లభున్ని దర్శించుకున్నారు.

కేపీఎస్‌సీని సంస్కరిస్తాం

దొడ్డబళ్లాపురం: రాబోయే రోజుల్లో యూపీఎస్‌సీ తరహాలో కేపీఎస్‌సీలో మార్పులు చేయాలని అధికారులు, సభ్యులు చర్చించారు. బెంగళూరులోని కేపీఎస్‌సీ కార్యాలయంలో కేపీఎస్‌సీ నూతన ఈడీగా నియమితులైన హెచ్‌ ప్రసన్నను కమిటీ సభ్యులు స్వాగతించారు. టెక్నాలజీని ఉపయోగించుకుని 3 నుంచి 5 నెలల లోపు ఉద్యోగ నియామకాల పరీక్షల ఫలితాలను వెల్లడించాలని ఈ భేటీలో నిర్ణయించారు. నియామకాలు సక్రమరీతిలో, త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రసన్న తెలిపారు.

నన్ను హత్య చేసినా

పర్లేదు: హోంమంత్రి

దొడ్డబళ్లాపురం: బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాల్లో కార్యక్రమాలు జరపాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలనే బిల్లు తప్పనిసరి అని హోంమంత్రి ప్రియాంక్‌ ఖర్గే చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ లేదా బీజేపీకి వ్యతిరేకంగా కాదని, సుప్రీంకోర్టు సూచనలతోనే ఈ బిల్లు తీసుకువస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ స్థలాలు లేదా రోడ్ల మీద ఎటువంటి కార్యక్రమాలు జరపాలనుకున్నా అనుమతి తప్పనిసరి అన్నారు. ఈ నియమాలు అందరికీ వర్తిస్తాయన్నారు. బిల్లులో ఎక్కడా నిషేధం అనే పదం వాడలేదని, ఏ సంఘం లేదా పార్టీ పేరు ప్రస్తావించలేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి మాట్లాడితే తాను సర్వ నాశనం అవుతానని బీజేపీ నేత ఆర్‌.అశోక్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ తనను నాశనం చేసేట్టయితే చెయ్యాలన్నారు. ఎవరి బెదిరింపులకూ తాను భయపడనని, మహా అయితే హత్య చేస్తారు అంతే కదా అన్నారు.

బిడది టౌన్‌షిప్‌కు

రైతులు వ్యతిరేకం

దొడ్డబళ్లాపురం: సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి వి.గోపాలగౌడ కమిటీ జరిపిన సర్వేలో 85 శాతం మంది రైతులు బిడది టౌన్‌షిప్‌కు వ్యతిరేకమని చెప్పారని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు బడగలపుర నాగేంద్ర తెలిపారు. మైసూరులో శనివారంనాడు టౌన్‌షిప్‌ న్యాయ విరోధి అనే 34 పేజీల నివేదికను విడుదల చేసి మాట్లాడారు. జస్టిస్‌ గోపాలగౌడ ఆధ్వర్యంలోని కమిటీ బిడదిలో పర్యటించి రైతులు, ప్రజలు, కూలీలు అందరినీ కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుని నివేదిక తయారు చేశారన్నారు. బిడది టౌన్‌షిప్‌ అంటే రైతుల నుంచి 9,600 ఎకరాలు భూమి కాజేసే రియల్‌ ఎస్టేట్‌ భూ దందా అన్నారు. ఈ టౌన్‌షిప్‌ ఏర్పాటుకు న్యాయపరమైన అనుమతి లేదన్నారు. అందువల్ల ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిలిపివేయాలన్నారు. సాహితీవేత్త దేవనూర మహాదేవ, సామాజిక కార్యకర్త ఎస్‌ఆర్‌ హిరేమఠ పాల్గొన్నారు.

అగర వెంకన్నకు శ్రావణ పూజలు

బొమ్మనహళ్లి: శ్రావణ శనివారం సందర్భంగా నగరంలో బొమ్మనహళ్ళి నియోజకవర్గం అగరలో శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. అర్చకులు అనంతపురం చంద్రమౌళి ఆధ్వర్యంలో తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో స్వామివార్లు, పద్మావతి ఆమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, అలంకారం సాగించారు. పెద్దసంఖ్యలో భక్తులు వైకుంఠవాసున్ని దర్శించుకున్నారు.

ఏడాదిలోగా మేకెదాటుకు పునాది: మంత్రి

మండ్య: కావేరి వివాదానికి శాశ్వత పరిష్కారం కల్పించే మేకెదాటు ప్రాజెక్టుకు ఏడాదిలోగా శంకుస్థాపన చేయాలని నిర్ణయించినట్లు జలవనరుల శాఖా మంత్రి ఎన్‌.చలువరాయ స్వామి చెప్పారు. మండ్యలో స్వాతంత్య్ర దిన వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. మేకెదాటు పథకానికి 20 వేల ఎకరాల భూమి అవసరం ఉండగా, ఇప్పటికే 12,500 ఎకరాలకు గుర్తించామన్నారు. ఈ పథకంపై సీఎం తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు. నూతన డీపీఆర్‌ను సరిచేసి ఆన్‌లైన్‌ అప్‌లోడ్‌ చేశామన్నారు. ఆనకట్ట నిర్మాణానికి తమిళనాడు అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకానికి సహకరించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement