మండ్య: కావేరి జల నిర్వహణ కమిటీల ఆదేశాలకు తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి మండ్య జిల్లాలోని కృష్ణరాజసాగర్ జలాశయం 10 గేట్లను ఎత్తి తమిళనాడుకు నీటిని విడుదల చేసింది. 15 రోజుల పాటు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని కమిటీలు ఆదేశించడం తెలిసిందే. మొదట కబిని జలాశయం నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేస్తున్నారు. కానీ అందులోకి వరద తగ్గడంతో బంద్ చేసి, కేఆర్‌ఎస్ గేట్లను ఎత్తినట్లు తెలిసింది. రాత్రి భారీగా నీటిని విడుదల చేశారని, ఉదయానికల్లా తగ్గించారని రైతుసంఘాలు తెలిపాయి.
అధికారుల వాదన..
కేఆర్‌ఎస్ నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేయడం లేదు. జిల్లాలో పంటల కోసం నదులు, కాలువలకు వదిలాము.. అని అధికారులు చెప్పారు. ఇది అబద్ధమని రైతు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వినూత్న నిరసన
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కళ్ళను మూసివేసి, కావేరీ నదీజలాలను తమిళనాడుకు విడుదల చేస్తోందని ఆరోపిస్తూ భూమి తాయి పోరాట సమితి సభ్యులు కావేరీ నదిలోకి దిగి నిరసన తెలిపారు. శ్రీరంగపట్నంలోని స్నాన స్నానఘట్టాలలో కేఎస్. నంజుగౌడ, బల్లెనహళ్లి కృష్ణగౌడ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి ఎన్.చలువరాయస్వామికి, జిల్లా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు, ప్రజలు వద్దని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే కేఆర్‌ఎస్ డ్యాం 10 గేట్లను ఎత్తి నీటిని వదలడం బాధాకరమని ఆరోపించారు. కానీ నీటిని విడుదల చేయలేదని జిల్లా కలెక్టర్ ద్వారా అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు.
కేఆర్‌ఎస్ నుంచి విడుదల


