శివాజీనగర: తొలిసారిగా అసెంబ్లీ భవనం విధానసౌధ ముంగిట్లో ఫ్రీడం హబ్బ పేరుతో స్వాతంత్య్ర దినోత్సవాలు కనులపండువగా సాగాయి. ఉదయం 11 గంటల నుంచి వివిధ కార్యక్రమాలు ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3:30 గంటలకు సీఎం డీ.కే.శివకుమార్ ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. బాలలు, విద్యార్థులు, సామాన్య ప్రజలతో సహా వేలాది మంది పాల్గొన్నారు. విధానసౌధ, కబ్బన్ పార్కు, కే.ఆర్.సర్కిల్ చుట్టుపక్కల ప్రాంతాలు జనసందోహంతో నిండిపోయాయి. రహదారులను స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలతో అలంకరించారు. విధానసౌధలో మెట్ల ముందు భారీ వేది మీద కర్ణాటక సంస్కృతిని ప్రతిబింబించే 25 కళా బృందాల ప్రదర్శనలు, సంగీత కచేరీలు ప్రజలను రంజింపజేశాయి. సౌధ లోపల ప్రజలు ఉత్సాహంగా తిరుగుతూ సెల్ఫీలు తీసుకున్నారు. సాయంత్రం రస సంజె సంగీత వేడుకలో సంజిత్ హెగ్డే, వి.బోధ రఘు దీక్షిత్, సిద్దార్థ బేలమన్ను, వరిజశ్రీ వేణుగోపాల్ తదితర సంగీతకారుల ప్రదర్శనలు ముగ్ధుల్ని చేశాయి.


