ప్రగతి రథానికి వికాస మార్గం | - | Sakshi
Sakshi News home page

ప్రగతి రథానికి వికాస మార్గం

Aug 16 2026 5:21 AM | Updated on Aug 16 2026 5:21 AM

శివాజీనగర: రాష్ట్ర సమగ్ర ప్రగతికి దూరదృష్టితో కూడిన బ్లూప్రింట్‌ను విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌ ప్రకటించారు. శనివారం బెంగళూరులోని మానెక్‌ షా మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొని త్రివర్ణ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు.

ఏమేం ప్రణాళికలంటే..

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ అభివృద్ధికి బృహత్‌ ప్రణాళిక గురించి వివరించారు. దేశ సమగ్రాభివృద్ధికి ఏఐ వంటి అనేక కొత్త పథకాలు అమలు చేస్తామని, అక్షర అభియాన్‌, కోడింగ్‌ గురుకుల్‌, ముఖ్యమంత్రి ఉద్యోగ సంకల్ప యోజన, యువ ఉద్యోగ సేతు యోజన, ఉద్యోగ నిధి యోజన, ముఖ్యమంత్రి రైతు చైతన్య యోజన, రైతు మిత్ర, గ్రామీణ విద్యార్థుల కోసం సహాయ హస్త యోజన గురించి ప్రకటించారు. జ్ఞానం, విజ్ఞానం, సాంకేతిక, వ్యవసాయ రంగాలలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుతామన్నారు.

పాఠశాలల్లో ఏఐ, కోడింగ్‌

రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో 6వ తరగతి నుంచే ఏఐ అక్షర అభియాన్‌ కోడింగ్‌ గురుకుల పథకం ద్వారా విద్యార్థులకు ఉచిత కోడింగ్‌ శిక్షణను అందిస్తారు. ప్రభుత్వం బెంగళూరులో ఏఐ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తుందని, జనవరి 2027 నాటికి ఏఐ సర్టిఫికెట్‌ కోర్సులు ప్రారంభమవుతాయని తెలిపారు.

● ఉద్యోగాభిలాషులైన యువత సంక్షేమం కోసం వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 72 వేల ముఖ్యమైన పోస్టుల భర్తీ. రాబోయే 6 నెలల్లో అన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని తెలిపారు.

● యువ ఉద్యోగ్‌ సేతు ద్వారా ప్రవేట్‌ రంగం ఉద్యోగాలలో చేరికకు సహకారం అందిస్తారు. దీనికోసం ఒక సమగ్ర సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తారు, దీని సాయంతో ఉద్యోగాల భర్తీ జరుగుతుందన్నారు.

● రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో కొత్త ఉద్యోగాలను సృష్టించే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తారు. ఉద్యోగానికి రూ.2500 ప్రోత్సాహకం అందిస్తుంది.

● రైతు చైతన్య ద్వారా రైతులకు టెక్నాలజీతో సహాయం. డ్రోన్‌, ఉపగ్రహ చిత్రాల ద్వారా పంట సర్వేలు చేస్తారు. పంటలు పండించడం, విక్రయాలకు డిజిటల్‌ వ్యవసాయ మార్కెట్‌ వ్యవస్థకు అనుసంధానం.

● రైతులకు ట్రాక్టర్లు, రోటవేటర్లు వంటి సేద్య పరికరాలను సగం ధరకే అద్దెకు ఇస్తారు.

● విద్యార్థుల కోసం ఇంజనీరింగ్‌, వైద్యంతో సహా వివిధ వృత్తి విద్యా కోర్సులలో ప్రవేశాలకు గ్రామాల్లో చదివిన విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని సీఎం తెలిపారు.

● మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభిస్తామని, అలాగే 112 ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.16 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

● బెంగళూరులో రౌడీల అణచివేతకు ప్రత్యేక దళం ఏర్పాటు. బెంగళూరులో 5 కొత్త పోలీస్‌ కమిషనరేట్లను నెలకొల్పుతారు.

● ప్రజలకు అందుబాటు ధరలలో వాహన బీమాను అందించేందుకు రాష్ట్ర మోటారు వాహన బీమా సంస్థ ఏర్పాటు.

నాతో చేతులు కలపండి

రాష్ట్ర అభివృద్ధికి తన రెండు చేతులు సరిపోవు. కోట్లాది కన్నడిగులు తనతో చేతులు కలపాలని సీఎం పిలుపునిచ్చారు. కర్ణాటక తలసరి ఆదాయం రూ.4.33 లక్షలకు చేరుకుందని, జీఎస్టీ, ఆదాయపు పన్ను వసూళ్లలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని చెప్పారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా 2047 నాటికి కర్ణాటక ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్‌ డాలర్లకు, అంటే రూ.320 లక్షల కోట్లకు తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు. బెంగళూరు నగర వికాసానికి నూతన పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

సాంస్కృతిక ప్రదర్శనలు

ఈ వేడుకలో పెద్దసంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రజలు పాల్గొన్నారు. పాఠశాలల విద్యార్థుల కవాతు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆద్యంతం మంత్రముగ్ధుల్ని చేశాయి.

అభివృద్ధి, ఉపాధి, సంక్షేమాలకు నూతన ప్రణాళికలు

సీఎం డీకే శివకుమార్‌ వెల్లడి

స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రసంగం

బెంగళూరు మానెక్‌ షా మైదానంలో స్వరాజ్య సంబరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement